*దశిక రాము**
" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"
అవతారిక:
తన అంతఃకరణాన్ని ఈశ్వర పాద పద్మము లందు లగ్నము చేయలేక
అసారమైన సంసారంలోపడి, కొట్టుమిట్టాడుతున్న తనకు , జ్ఞానము
నిచ్చి రక్షించడం, దీనజన పాలకుడైన పరమేశ్వరుని భరమయి యున్నదని,
శంకరులు ఈశ్లోకంలో ఈశ్వరునకు విన్నవించారు.
శ్లో"
**అసారే సంసారే**
**నిజభజనదూరే జడధియా**
**భ్రమంతం మా మంధం**
**పరమకృపయా పాతు ముచితం**
**మదన్యః కో దీన _ స్తవ కృపణరక్షాతి నిపుణః**
**త్వదన్యః కోవామే**
**త్రిజగతి శరణ్యః పశుపతే !!**
పదవిభాగం:
అసారే , సంసారే _ నిజభజనదూరే _ జడధియా _ భ్రమంతం _
మామ్ _ అంధం _ పరమకృపయా _ పాతుమ్ _ ఉచితమ్ _ మదన్యః _
కః _ దీనః _ తవ _ కృపణరక్షాతినిపుణః _ త్వదన్యః _ కః _ వా _ మే _
త్రిజగతి _ శరణ్యః _ పశుపతే.
తాత్పర్యం:
ఓ పశుపతీ ! ఈశ్వరా ! నీ భజనకు దూరమైనదియూ, సారహీనమైనదియూ
అయిన సంసారమందు పరిభ్రమిస్తూ , గ్రుడ్డి వాడనైయున్న నన్ను అత్యంత
దయతో రక్షింౘడం, నీకు తగినపని. ఎందుకంటే, నీకు నాకంటే రక్షింప
దగిన దీనుడు ఇంకెవడున్నాడు? మఱి నాకో, నీకంటే దీనుల రక్షింౘుట
యందు మిక్కిలి నేర్పుగల రక్షకుడు ఇంకెవడున్నాడు? నేను అత్యంత
దీనుడిని. నీవు దీన రక్షణలో అత్యంత నిపుణుడివి. అందుచేత నన్ను
నీవు తప్పక రక్షింౘాలి.
వివరణ:
శివానుగ్రహం లేకపోతే , మన అంతఃకరణాన్ని అనగా మనస్సును
పరమేశ్వర పాద ధ్యానంపై మనం నిలబెట్టలేము. అందుకే శంకరులు
దీనుడైన తనను రక్షింౘుమని శరణమును కోరదగిన పరమేశ్వరుని
ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు...
ముల్లోకాలలో నూ, ముక్కంటి ని మించిన ముక్తిప్రదాతా, దీనజన
రక్షకుడూ, మఱొకడు లేడని శంకరులు ఈ శ్లోకంలో నొక్కి వక్కాణించారు.
" అపిచేత్సుదురాచారో, భజతే మామనన్యభాక్
సాధురేవ సమంతవ్యః, సమ్యక్ వ్యవసితో హిసః "
(భగవద్గీత)
తాత్పర్యం:
గొప్ప దురాచారుడు అయినా నన్ను భజిస్తే , అతణ్ణి సత్పురుషుని గానే
పరిగణింౘాలి, ఎందుకంటే అతడు నిశ్చయ బుద్ధి కలవాడు. అనగా
పరమాత్మ సేవతో సమానమైనది మరొకటి లేదని నిశ్చయింౘు
కొన్నవాడు.
🙏🙏🙏
**ధర్మము - సంస్కృతి**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి