**దశిక రాము**
తృతీయ స్కంధం -35
.కపిల దేవహూతిసంవాదంబు
“ఓ పుణ్యాత్మా! అసత్యలైన ఇంద్రియాల సంఘర్షణం వల్ల ఖిన్నురాలినై విచారిస్తున్న నాకు ఈ సాటిలేని మోహాంధకారంలోనుంచి బయటపడే అవకాశం ఏ ఉపాయం వల్ల కలుగుతుంది?ఓ పుణ్యాత్మా! దట్టమైన కారుమేఘాల చీకట్లతో ఆవరింపబడిన ఈ మహాప్రపంచానికి నీవు ఒక్కడివే ఏకైక నేత్రమై సూర్యునివలె వెలుగుతూ ఉంటావు. లోపాలు లేనివాడవు, అసహాయ దర్శనం కలవాడవు, మనోవికారాలు లేనివాడవు, సంసారమనే తీగలకు కొడవలి వంటివాడవు, జ్ఞానులలో ఉత్తముడవు, అందరికి శరణు కోరదగినవాడవు, ధర్మమును విస్తరించేవాడవు, శాశ్వతమైన వైభవములకు అధినాయకుడవు అయిన ఓ కపిలా! నా అంతులేని వ్యామోహమనే చీకటిని దూరం చేయడానికి నీవు కాక ఇతరు లెవరున్నారు?ఓ మహాతపస్సంపన్నా! నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను కాపాడు” అని దేవహూతి వినయంగా ప్రార్థించగా కపిలుడు సాటిలేని మేటి దయతో సజ్జనులకు మోక్షాన్ని ఇవ్వడానికి తగిన సాధనమైన తల్లి మాటలను అనురాగ పూర్వకంగా...విని, మందహాస సుందర వదనారవిందుడై మనస్సులో సంతోషం అతిశయించగా పరమశాంతుడై కన్నతల్లితో ఇలా అన్నాడు. విను. గాఢమైన సంసారబంధానికీ మోక్షానికీ జీవుని చిత్తమే కారణం. అది సత్త్వరజస్తమోగుణాలతో సమ్మేళనం పొందినప్పుడు సంసారబంధానికి హేతువవుతుంది. ఇంకా...ఆ చిత్తం శ్రీమన్నారాయణుని మీద సంసక్తమైనపుడు మోక్షానికి హేతువవుతుంది” అని మునికుల సాగరానికి చంద్రుని వంటివాడైన కపిలుడు తల్లికి కోరికతో వినిపించి, మళ్ళీ ఆప్యాయంగా ఇలా అన్నాడు.ఇంకా నేను నాది అనే అహంకార మమకార రూపమైన అభిమానంవల్ల కామం, క్రోధం, లోభం మొదలైన దోష సమూహాలు ఆవిర్భవిస్తాయి. చిత్తం వానికి లోనుగాకుండ వానినుండి విడివడినప్పుడు పరిశుద్ధ మవుతుంది. చిత్తం పరిశుద్ధమైనప్పుడు సుఖం, దుఃఖం అనేవి ఉండక ఒకే రూపంగా వెలుగొందుతుంది. ఏకరూపమైన అటువంటి చిత్తంలోనే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. ఆ పరమాత్మ ప్రకృతికంటె అతీతుడు, స్వయంప్రకాశుడు, సూక్ష్మస్వరూపుడు, అపరిచ్ఛిన్నుడు, ఉదాసీనుడు. అటువంటి పరమాత్మనూ, ఆ పరమాత్మ తేజస్సువల్ల నిస్తేజమైన ప్రపంచాన్నీ యోగివరేణ్యులు భక్తిజ్ఞానవైరాగ్యాలతో కూడిన చిత్తంతో దర్శించినవారై మోక్షప్రాప్తికి సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణునియందు సమర్పింపబడిన భక్తి మార్గమే ఉత్తమోత్తమ మైనదని, తక్కిన మార్గాలు దానికి సాటిరావని చాటిచెప్పారు. ఇంద్రియార్థాలైన శబ్దస్పర్శరూపరసగంధాలతో కలయిక అసద్విషయమై, దృఢమైన బంధానికి కారణం అవుతుంది. ఆ సంగమమే భగవంతుని సంబంధమై సద్విషయమైనపుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణాల సంయమనానికి హేతుభూతమై సత్పురుషులకు తెరిచిన మోక్షద్వారం అవుతుంది అని విద్వాంసుల అభిప్రాయం. సహన స్వభావం కలిగి, సమస్త జీవులకు ఆప్తబంధువులై, శాంతమూర్తులై, కరుణార్ద్రహృదయులై, కర్మఫలాలను పరిత్యజించి, తనవారు, బంధువులు అనే అభిమానం విడిచి, నన్ను చక్కగా ఆశ్రయించినవారై, నా గుణగణాలను ధ్యానిస్తూ, నా చరిత్రను వీనులవిందుగా ఆలకించి ఆనందిస్తూ, నా కథలే చెప్పుకొంటూ, నా కథలే వింటూ ఉండేవారు పరమ భాగవతోత్తములు. అటువంటి వారిని ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అనే తాపత్రయాలు ఏమీ చేయలేవు. అటువంటి సర్వసంగ పరిత్యాగులైన పరమభాగవతుల సాంగత్యం మాత్రమే కోరదగినది. అదే సకల దోషాలను నివారిస్తుంది. అటువంటివారి స్నేహంవల్ల సర్వప్రాణుల హృదయాలలో చెవులలో సుధారసం చిందించే నా కథాప్రసంగాలు ప్రాప్తిస్తాయి. నా గుణాలను వినడంవల్ల సక్రమమైన మార్గంలో శీఘ్రంగా మోక్షాన్ని ప్రసాదించే శ్రద్ధాభక్తులు ఉద్భవిస్తాయి. ఎవడు నేను చేసిన ఈ విశ్వసృష్టినీ, నా లీలావిహారాలనూ తలపోస్తూ అందువల్ల ప్రభవించిన భక్తిచేత ఇంద్రియ సుఖాలకూ, కనిపించేవీ వినిపించేవీ అయిన ఇహలోక పరలోక సుఖాలకూ లోనుకాకుండా, మనోనిశ్చలత్వం కోసం చక్కని యోగమార్గాన్ని అవలంబిస్తాడో అతడు యోగి అని చెప్పబడతాడు. అటువంటి యోగి ప్రకృతిగుణాలను అనుసరించటం వల్లనూ, వైరాగ్యాన్ని పెంపొందించే జ్ఞానయోగం వల్లనూ, ఆత్మార్పణ రూపమైన భక్తియోగం వల్లనూ సాక్షాత్కరించిన ఆత్మస్వరూపం గల నన్ను తన హృదయాంతరంలో నిలుపుకొంటాడు” అని కపిలుడు చెప్పగా విని దేవహూతి అతనితో ఇలా అన్నది. ఏ భక్తి నీ గుణగణాలకు అంకితమై సంసారపాపాలను పోగొట్టి శీఘ్రంగా మోక్షలక్ష్మిని చేకూరుస్తుందో ఆ భక్తి స్వరూపాన్ని నాకు బాగా తెలిసేటట్లు దయచేసి చెప్పు.అంతేకాక నీచేత పేర్కొనబడిన యోగవిద్యనూ, అందలి విభాగాలనూ, అందులోగల తత్త్వార్థాలనూ సంపూర్ణంగా, సుస్పష్టంగా మందబుద్ధినైన నాకు తెలిసేలా వెల్లడించు” అనగా కపిలుడు ఇలా
అన్నాడు.అమ్మా! సద్గుణసమూహం, యోగలక్షణాలు కలదానా! విను. సకలపదార్థాలకూ సంబంధించిన యథార్థస్వరూపాన్ని పూర్తిగా తెలియజేసేవి వేదాలు. వేదసంబంధమైన సత్కర్మలకూ సదాచారాలకూ దేవతలు సంతృప్తులౌతారు. సహజమూ నిర్హేతుకమూ అయిన భగవంతుని సేవారూపమైన భక్తి ముక్తికంటె గొప్పది. జీర్ణాశయమందలి జఠరాగ్ని తిన్న అన్నాన్ని జీర్ణం చేసినట్లుగా భగవద్భక్తి జీవులు కావించిన కర్మలనూ కర్మఫలాలనూ లోగొంటుంది. అందువల్ల జీవుని లింగమయ శరీరం నశిస్తుంది. విష్ణుభక్తి విశేషాలను వివరిస్తాను విను.కొందరు మహాత్ములు నిర్మలమైన భక్తిభావంతో నా పాదపద్మాలను తమ హృదయపద్మాలలో పదిలపరచుకొని ఎంతో కుతూహలంతో పరస్పరం సంభాషించుకుంటూ ఆ సంభాషణలలో నా దివ్యస్వరూపాన్నీ, నా లీలావిశేషాలనూ కొనియాడుతూ ఉంటారు. వారు సర్వదా తమ సమస్త కర్మఫలాలనూ నాకే అర్పించి భక్తి పరవశులై ముక్తిని కూడా వాంఛింపరు. కొందరు భాగవతోత్తములు ప్రసిద్ధికెక్కిన నా పురాణ స్వరూపాలను స్మరిస్తూ ఉంటారు. అందాలు చిందే ముఖమూ, కరుణారసం విరజిమ్మే అరుణనేత్రాలూ కలిగి భక్తులకు వరాలను ప్రసాదించే నా దివ్యావతారాలనూ వాని వైభవవిశేషాలనూ మనస్సులో నిలుపుకుంటారు. తమ భక్తియోగ మహత్త్వంవల్ల అలనాటి నా సంలాపాలను స్మరించుకొని కొనియాడుతుంటారు. నవనవోన్మేషమైన నా అవయవ సౌభాగ్యాన్నీ, సుందరమైన నా మందహాసాన్నీ, మనోహరాలైన నా మధురవాక్కులనూ మాటిమాటికీ మననం చేసుకుంటూ మనస్సూ, ప్రాణమూ పరవశింపగా మోక్షంమీద అపేక్ష లేకుండా ఉంటారు..ఆ విధంగా మోక్షాసక్తి లేనివారై కూడా వారు అణిమాది అష్టసిద్ధి సంసేవితమూ, శాశ్వతానంద సంధాయకమూ, వర్ణనాతీతమూ, మహనీయమూ, సంపూర్ణ వైభవోపేతమూ, సకలలక్షణ సమేతమూ, మహోన్నతమూ అయిన వైకుంఠధామాన్ని
పొందుతారు. ఈవిధంగా పొంది...అమ్మా! ఆ పుణ్యాత్ములు నా కాలచక్రానికి మ్రింగుడు పడనివారై నిరుపమానమైన నిత్య సౌఖ్యాలతో అలరారుతుంటారు. అది ఎలాగంటే...సర్వసముడనైన నేను స్నేహంవల్ల కుమారుని వలెనూ, విశ్వాసంవల్ల చెలికాని వలెనూ, హితం కూర్చడంవల్ల ఆత్మీయుని వలెనూ, మంత్రం ఉపదేశించడంవల్ల ఆచార్యునివలెనూ ఉంటూ వారికి నిత్యమూ పూజింపదగిన ఇష్టదైవాన్నై, కాలచక్రం వల్ల భయం కలుగకుండా వారిని కాపాడుతూ ఉంటాను.”అని ఈవిధంగా చెప్తూ మళ్ళీ ఇలా అన్నాడు.ఇంకా విను. ఈ భువికీ దివికీ నడుమ పలుసారులు తిరుగుతూ ఉండే ఆత్మ ధనం, పశువులు, పుత్రులు, మిత్రులు, స్త్రీలు మొదలైన తగులాలపై వ్యామోహం విడిచిపెట్టి పాపాలను సంహరించేవాడనూ, ప్రపంచమంతటా వ్యాపించినవాడనూ అయిన నన్ను ఏకాగ్రచిత్రంతో ఆరాధించినట్లైతే ఆ మానవుని మృత్యుమయమైన సంసారసముద్రం నుండి తరింపజేస్తాను. ప్రధానమనే మూలప్రకృతికీ, పురుషునకూ అధీశ్వరుడనూ, భగవంతుడనూ అయిన నన్ను కాకుండా ఇతరులను ఎన్నుకొన్నవారు సంసారభయంలో పడిపోతారు. కనుక నా ఆజ్ఞ జవదాటలేక భయంతో గాలి వీస్తుంది. అగ్ని మండుతుంది. సూర్యుడు ఎండ కాస్తాడు. ఇంద్రుడు వర్షిస్తాడు. మృత్యువు భయపడి పారిపోతుంది. అందువల్ల ఈ సృష్టి విజ్ఞానంతో పాటు వైరాగ్యంతో కూడిన భక్తియోగంతో యోగివరులైనవారు వైకుంఠాన్ని ఆశించి నా చరణాలను సంస్మరిస్తూ ఏ భయమూ లేకుండా ఉంటారు. అత్యంత భక్తితో చిత్తాన్ని ఎంతవరకు నాయందే లగ్నంచేసి ఉంచుతారో అంతవరకు ఆ సత్పురుషులకు ఈలోకంలోనే మోక్షం సంప్రాప్తిస్తుంది." అని కపిలాచార్యుడు విష్ణుసంబంధమైన భక్తియోగ స్వరూపాన్ని తల్లికి వినిపించి ఎంతో సంతోషంతో మళ్ళీ ఇలా అన్నాడు.
“అమ్మా! ఈవిధంగా భక్తియోగ స్వరూపం నీకు తెలిపాను. ఇక తత్త్వజ్ఞాన లక్షణాలను వేరువేరుగా తెలుపుతాను. ఏ తత్త్వజ్ఞాన లక్షణాలను తెలుసుకొన్న మానవులు ప్రకృతి గుణాలనుండి విముక్తు లవుతారో, మనస్సులోని సందేహాలు విడిపోయి స్వస్వరూపాన్ని తెలుసుకుంటారో, అటువంటి తత్త్వజ్ఞానం కైవల్యప్రాప్తికి కారణం అవుతుంది. అందువల్ల ఆత్మస్వరూపం ఎలాంటిదో చెపుతాను. అనాది యైనవాడూ, పురుషశబ్ద వాచ్యుడూ, సత్త్వరజస్తమోగుణాలు లేనివాడూ , ప్రకృతి గుణాలకంటె విలక్షణమైన గుణాలు కలవాడూ, ప్రత్యక్షస్వరూపం కలవాడూ, తనంతతాను వెలిగేవాడూ, విశ్వమంతటా ఉన్నవాడూ అయిన పరమాత్మ గుణత్రయాత్మకమూ, అవ్యక్తమూ, భగవంతుని అంటిపెట్టుకున్నదీ అయిన ప్రకృతిలో అప్రయత్నంగా అలవోకగా లీలగా ప్రవేశించాడు. ఆ ప్రకృతి గుణత్రయ మయమైన స్వరూపంతో సాకారమైన ప్రజాసృష్టి చేయటం ప్రారంభించింది. అది చూచి పురుషుడు వెంటనే మోహాన్ని పొంది విజ్ఞానం మరుగుపడగా, గుణత్రయాత్మకమైన ప్రకృతిని ఆశ్రయించి, పరస్పరం మేళనం పొందారు. అప్పుడు పురుషుడు ప్రకృతి గుణాలను తనయందే ఆరోపించుకొని జరుగుతున్న కార్యాలన్నింటికీ తానే కర్తగా భావించుకొని సంసారబంధంలో కట్టుబడి పరాధీనతకు లోనవుతాడు. ఈశ్వరుడు కర్త కాకున్నా జరుగుతున్న కర్మలకు సాక్షీభూతుడు కావటంవల్ల ఆత్మకు కార్యకారణ కర్తృతాలు లేవనీ, అవి ప్రకృతికి అధీనమైనవనీ, సుఖదుఃఖాలు అనుభవించడం ప్రకృతికంటె విలక్షణుడైన పురుషునిదనీ అనుభజ్ఞులు తెలుసుకుంటారు” అని చెప్పగా విని దేవహూతి కపిలునితో “మహాత్మా! ప్రకృతి పురుషులు అస్తిత్వం కలదీ, అస్తిత్వం లేనిదీ అయిన ప్రపంచానికి కారణభూతులు. కాబట్టి ఆ ప్రకృతి పురుషుల లక్షణాలు సదసద్వివేక పురస్సరంగా సెలవీయ కోరుతున్నాను” అన్నది. అప్పుడు భగవంతుడైన కపిలుడు దేవహూతితో ఇలా అన్నాడు.త్రిగుణాత్మకం, అవ్యక్తం, నిత్యం, సదసదాత్మకం, ప్రధానం అనేవి ప్రకృతి విశేషాలు. ఈ విశేషాలతో కూడి ఉన్నది కనుక ప్రకృతిని విశిష్టం అని ప్రాజ్ఞులు పేర్కొన్నారు.ఆ ప్రకృతి ఇరవై నాలుగు తత్త్వాలు కలదై ఉంటుంది. ఎలాగంటే పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలూ; శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే పంచ తన్మాత్రలూ; చర్మం, కన్ను, ముక్కు, చెవి, నాలుక అనే పంచ జ్ఞానేంద్రియాలూ; వాక్కు, చేతులు, కాళ్ళు, మలావయవం, మూత్రావయవం అనే పంచ కర్మేంద్రియాలూ; మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణ చతుష్టయమూ కలిసి ఇరవైనాలుగు తత్త్వాలు కలిగి సగుణబ్రహ్మకు సంస్థానం అయిన ప్రకృతిని వివరించాను. ఇక కాలం అనే ఇరవై ఐదవ తత్త్వాన్ని గురించి చెబుతాను. కొందరు పురుష శబ్ద వాచ్యుడైన ఈశ్వరుని స్వరూపమే కాలంగా చెప్పబడుతున్నదంటారు. అహంకార మోహితుడై ప్రకృతితో సంబంధం పెట్టుకున్న పురుషుడు జీవుడై భయాదులను అనుభవిస్తాడు. ప్రకృతి గుణాలన్నింటిలో సమానంగా అంతర్యామియై నిర్విశేషుడై ప్రవర్తించే భగవంతుని చేష్టా విశేషాలను కలుగచేసేదే కాలం అనబడుతుంది. అదికూడా జీవరాసులలో అంతర్యామిగా ఉన్నప్పుడు పురుషుడు అనీ, వానికి వెలుపల వ్యాపించి ఉన్నపుడు కాలం అనీ అనబడుతుంది. ఆత్మమాయ కారణంగా ప్రకృతి తత్త్వాలలో విలీనమైన జీవునివల్ల కదిలింపబడినదీ, జగత్తుకు కారణమైనదీ అయిన ప్రకృతియందు భగవంతుడు సృజనాత్మకమైన తన వీర్యాన్ని ఉంచగా ఆ ప్రకృతి తనలోనుంచి హిరణ్మయమైన మహత్త్వాన్ని పుట్టించింది. అనంతరం సకల ప్రపంచానికి మూలమైనవాడూ, లయవిక్షేప శూన్యుడూ అయిన ఈశ్వరుడు తన సూక్ష్మవిగ్రహంలో ఆత్మగతమైన మహదాది ప్రపంచాన్ని వెలిగిస్తూ, తన తేజఃప్రసారం చేత తనను నిద్రింపజేసే తమస్సును హరించి వేశాడు” అని చెప్పి కపిలుడు కళ్ళీ ఇలా అన్నాడు. వాసుదేవం, సంకర్షణం, ప్రద్యుమ్నం, అనిరుద్ధం అనే దివ్యమైన ఈ నాలుగు వ్యూహాలూ ముల్లోకాలలోనూ సేవింపదగినవి. సుగుణవతీ! వాటిని నీకు వివరించి చెబుతాను.వాసుదేవవ్యూహం ఆకలిదప్పులు, శోకమోహాలు, జరామరణాలు అనే ఆరు ఊర్ములనుండి విడివడినదై ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం అనే షడ్గుణాలతో పరిపూర్ణమై సత్త్వగుణ ప్రధానమై, నిర్మలమై, శాంతమై, నిత్యమై, భక్తజన సంసేవ్యమై అలరారుతూ ఉంటుంది. మహత్తత్త్వం నుండి క్రియాశక్తి రూపమైన అహంకారం పుట్టింది. ఆ అహంకారం వైకారికం, తైజసం, తామసం అని మూడు విధాలుగా విడివడింది. వానిలో వైకారికాహంకారం అనేది మనస్సుకూ, పంచేంద్రియాలకూ, అకాశాది పంచభూతాలకూ...ఉత్పత్తి స్థానమై దేవతారూపమై ఉంటుంది. తైజసాహంకారం బుద్ధిరూపాన్నీ, ప్రాణరూపాన్నీ కలిగి ఉంటుంది. తామసాహంకారం ఇంద్రియార్థాలతో సమ్మేళనం పొంది ప్రయోజనమాత్రమై ఉంటుంది. ఇంకా...వైకారికమైన సాత్త్వికాహంకారాన్ని అధిష్ఠించి సంకర్షణ వ్యూహం ఒప్పుతుంటుంది. వేయి పడగలతో ప్రకాశించేవాడూ, అనంతుడూ అయిన సంకర్షణ పురుషుడు మహానుభావుడై పంచభూతాలతో, పంచేంద్రియాలతో, మనస్సుతో నిండి ఉంటాడు. కర్త, కార్యం, కారణం అనే రూపభేదాలు కలిగి శాంతత్వం, ఘోరత్వం, మూఢత్వం మొదలైన లక్షణాలతో ఉల్లాసంగా ఉంటాడు. ఈ మేటి వ్యూహమే రెండవదైన సంకర్షణ వ్యూహం. దీనినుంచే మనస్తత్త్వం పుట్టింది.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి