మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
చల్లటి స్పర్శ..
"గత సంవత్సరం నుండీ నాకు కష్టకాలం దాపురించినట్లుగా అనిపిస్తున్నది..ఏ పని చేద్దామని అనుకున్నా..ఏదో ఒక సమస్య తో ఆ పని ఆగిపోవడమో..లేదా..నాకు దక్కకుండా పోవడమో జరుగుతున్నది..జాతకం లో ఏదైనా దోషం ఉన్నదేమో నని..ఇద్దరు ముగ్గురు జ్యోతిష్కుల వద్ద జాతకం చూపించుకున్నాను..వాళ్ళు చెప్పిన పరిహారాలూ చేయించాను..ఈ పరిహారాలకే దాదాపు యాభైవేల రూపాయలు పైగా ఖర్చు చేసాను..అదొక అదనపు భారం పడింది నా మీద..దిక్కుతోచని పరిస్థితి నాది.." అన్నాడు నారాయణ తన మిత్రుడి తో..
నిజమే..నారాయణ రావు సంవత్సరం క్రిందటి దాకా..బెంగుళూరు లో ఇళ్లు కట్టి అమ్మే వ్యాపారం లో బాగా సంపాదించాడు..కానీ ఉన్నట్టుండి అతని వ్యాపారం దెబ్బతిన్నది..కట్టిన ఇళ్లు అమ్ముడు పోలేదు..వాటి మీద పెట్టిన పెట్టుబడి ఇరుక్కుని పోయింది..తన స్వంత డబ్బులు కాకుండా..బైట నుంచి అప్పు తీసుకొచ్చి మరీ పెట్టుబడి పెట్టాడు..ఆ అప్పుకు వడ్డీ పెరిగి పోతున్నది..అప్పు ఇచ్చిన వాళ్లలో ఒకరిద్దరు తాము ఇచ్చిన డబ్బు వెనక్కు ఇచ్చేయమని వత్తిడి చేయ సాగారు..ఈ సమస్య లతో నారాయణ రావు మనోశాంతి కోల్పోయి బాధపడసాగాడు..
నారాయణ రావు చెప్పిందంతా విన్న మిత్రుడు..ధైర్యం వహించమని ఓదార్చాడు కానీ..అతని ఆర్ధిక బాధలు తీరడానికి ఎటువంటి మార్గము చూపలేకపోయాడు..నారాయణ రావు నిరాశలో కూరుకుపోసాగాడు..
సరిగ్గా ఆ సమయం లో నెల్లూరు లో ఉంటున్న తన బంధువు ఒకరు బెంగుళూరుకు వచ్చారు..అతనితో తన కష్టాన్ని చెప్పుకొని బాధపడ్డాడు..అతను నారాయణరావును నెల్లూరు రమ్మని చెప్పాడు..మూడురోజుల తరువాత నారాయణ రావు నెల్లూరు లోని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు..ఆ సమయం లో ఆ బంధువు పూజ చేసుకుంటున్నాడు..నారాయణ రావు ఓపికగా ఎదురు చూసాడు..
పూజ ముగించుకొని..ఆ బంధువు..నారాయణ రావు ను పలకరించి.."నారాయణా..నీ కొచ్చిన ఇబ్బందుల నుంచి బయట పడాలంటే..ఒక్కసారి మొగలిచెర్ల వెళ్లి, అక్కడ సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించు..ఆ స్వామి దయ వుంటే..ఈ కష్టాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి..నేను స్వయంగా అనుభవించాను..చాలా మహిమగల అవధూత మందిరం అది..ఈ మాట చెప్పి, నిన్ను అక్కడికి తీసుకెళ్లాడానికే నెల్లూరు రమ్మని చెప్పాను..ఇప్పుడే ఇద్దరమూ బయలుదేరి వెళదాము..నా మాట విశ్వసించు.." అన్నాడు..నారాయణ రావు తాను జ్యోతిష్కుల ను నమ్మి..ఎలా ఇబ్బంది పడిందీ వివరించి..ఇప్పుడు తనకు ఏ దేవీ దేవతలను..సిద్ధులను..గురువునూ.. కొలిచే ఓపిక లేదని..తనను బలవంత పెట్టొద్దనీ..చెప్పాడు..కానీ ఆ వ్యక్తి వినలేదు సరికదా..నారాయణ రావు చెవిలో పోరు పెట్టి..ఎట్టకేలకు ఒప్పించాడు..
ఇద్దరూ కలిసి..కారులో మొగలిచెర్ల కు చేరుకొని..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం చేరారు..శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకున్నారు..నారాయణ రావు..శ్రీ స్వామివారి సమాధి ముందు సాగిలపడి..తన కష్టాలు చెప్పుకున్నాడు..ముందున్న మంటపం లో కొద్దిసేపు ఇద్దరూ కూర్చున్నారు..ఒక ఐదు నిమిషాలు గడిచే సరికి..నారాయణ రావు కు తనకు తెలీకుండానే..నిద్ర ముంచుకొచ్చింది..అలానే వాలిపోయి..నిద్ర పోయాడు..నిద్రలో ఎవరో తన వీపుమీద అనునయంగా తడుముతున్నట్టు..చల్లని చేయి తన వళ్ళంతా నిమురుతున్నట్టు తోచింది..నారాయణ రావు లేచి సమయం చూసుకుంటే...తాను సుమారు మూడు గంటల పాటు నిద్రలో ఉన్నట్టు తెలిసింది..తన బంధువు కూడా నిద్ర పోతున్నాడు..అతని మనసంతా తేలికగా ఉంది..తన బంధువు కూడా నిద్ర లేచిన తరువాత..ఇద్దరూ కలిసి..మరొక్కసారి శ్రీ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని నెల్లూరు వచ్చేసారు..
ఆరోజు రాత్రికే నారాయణ రావు బెంగుళూరుకు తిరిగి వచ్చేశాడు..మరో రెండు మూడు రోజుల్లోనే..నారాయణ రావు కట్టిన ఇళ్లకు బేరం వచ్చింది..అదికూడా అతను అనుకున్న దానికన్నా ఎక్కువ రేటుకు..ఈ పరిణామం అతను ఊహించలేదు..ప్రక్కరోజే కొంత నగదు ఇచ్చి అగ్రిమెంట్ వ్రాసుకున్నారు..నారాయణ రావు తన బంధువుకు ఫోన్ చేసి..విషయం చెప్పి..మొగలిచెర్ల స్వామివారి వద్ద తాను పొందిన చల్లటి స్పర్శ ఆ స్వామి వారిదే అనీ..తనను గట్టెక్కించిన ఆ మహానుభావుడి మందిరాన్ని మళ్లీ మళ్లీ దర్శించుకోవాలనీ.. ఉద్వేగంతో చెప్పాడు..
రెండు నెలలు తిరిగే సరికి నారాయణ రావు మామూలు స్థితికి వచ్చేశాడు..అప్పటి నుంచీ అతని మనసంతా శ్రీ స్వామివారే నిండిపోయారు..తన జీవితాన్ని కాపాడిన స్వామివారి మందిరాన్ని పదే పదే దర్శించుకుంటూ ఉంటాడు..
స్వప్నంలో శ్రీ స్వామివారి చేతి స్పర్శ పొందిన అదృష్టవంతుడు నారాయణరావు..
సర్వం..
శ్రీ దత్త కృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా.. పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి