*దశిక రాము**
⚛️ శ్లోకం 13 ⚛️
**రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః|**
**అమృత శ్శాశ్వతః స్ధాణుః వరారోహో మహాతపాః||**
115. రుద్రః --- కన్నులలో నీరు తెప్పించువాడు (1. ప్రళయకాలమున ప్రాణుల లయము చేయునపుడు 2. తనను స్మరించు భక్తులను ఆనందపరచుచు) ; భక్తులకు శుభములను కలిగించువాడు; దుఃఖమును, దారిద్ర్యమును నాశనము చేయువాడు.
116. బహుశిరాః --- అనేకములైన శిరములు గలవాడు; ఆదిశేషునిగా అవతరించినవాడు; అనంతుడు.
117. బభ్రుః --- ఆధారమైనవాడు, భరించువాడు (ఆదిశేషుడై, ఆది కూర్మమై, ఆదివరాహ మూర్తియై)
118. విశ్వయోనిః --- విశ్వమునకు కారణమైనవాడు; తనను ఆశ్రయించిన భక్తులను తనలో విలీనము చేసుకొనువాడు.
119. శుచిశ్రవాః --- శుభప్రథమైన, శ్రవణమాత్రముననే పవిత్రులను చేయగల దివ్యనామములు గలవాడు; ధర్మపూరితములు, సత్యములునగు వాక్కులు విని ఆనందించువాడు; దివ్య సుందరమగు చెవులు గలవాడు.
120. అమృతః --- భక్తులకు తనివి తీరని అమృతమూర్తి; అజరుడు, అమరుడు.
121. శాశ్వత స్థాణుః --- కాళముతో నిమిత్తము లేకుండ నిశ్చలముగా, నిత్యమై, సత్యమై, నిరంతరమైనవాడు; ఆదిమధ్యాంత రహిత పరబ్రహ్మము; స్థిరుడై భక్తులకు నిత్యభోగమైనవాడు.
122. వరారోహః --- అన్నింటికంటె శ్రేష్టమగు ఊర్ధ్వగతి, పొందదగిన అత్యున్నత పదము; ఏ స్థానము చేరినపిదమ మరల తిరిగి జన్మింపరో అట్టి పరమోత్కృష్ట స్థానము గలవాడు; అత్యుత్తమమగు వృద్ధి గలవాడు; ఆదిశేషునిపై పవళించువాడు.
123. మహాతపాః --- గొప్ప తపస్సు (జ్ఞానైశ్వర్య ప్రతాపములు) గలవాడు; మహత్తరమైన జ్ఞానము గలవాడు.
శ్లో. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వ యోని శ్శుచి శ్రవః
అమృత శ్శాశ్వత స్థాణుర్వరారోహో మహా తపాః !!13!!
( నామాలు 114 ... 122)
26. శివుడె కాని చూడ శిరసులెన్నో యుండు
విశ్వ పాలకుండు, విశ్వయోని
శుభ్రమైన చెవులు, సురసేవితుడతడు
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : రుద్ర ... శివుడు, బహుశిరా ... వేలాది శిరస్స లున్నవాడు, బభ్రుః ... పాలకుడు, విశ్వయోని ... సృష్టి యంతటికీ జన్మస్థానం, శుచిశ్రవాః ... పరిశుద్ధమైన చెవులున్నవాడు, అమృతః ... మరణము లేనివాడు.
భావము : దుఃఖములను హరించి శుభములిచ్చువాడు, వేలాది శిరస్సులున్నవాడు( సృష్టిలోని చరాచర జీవులన్నిటా ఉంటూ అన్నీ తానే ఐన వాడు గనుక వేలాది చెవులున్నట్లే కదా), మంచి పాలకుడూ, మరణములేని(అమృతం అనగా సుర) తాగిన వాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
27. నశ్వరుండు కాడు నయముగా జేర్చునూ
జ్ఞాన గమ్యమునకు గమము చూపు
తాపసులలొ జూడ తనకు సాటియె లేదు
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : శాశ్వత స్థాణుః ... శాశ్వతంగా నిశ్చలమైన (నాశము లేని)వాడు, వరా రోహః ... జ్ఞాన మార్గము చేర్చువాడు (గమము అంటే దారి అనే యర్థమూ ఉన్నది కదా) లేదా తానే గమ్యం అయినవాడూ కావచ్చు, మహా తపాః ... అద్భుతమైన జ్ఞానం కలవాడు. తాపసి అంటే తాప త్రయాలను జయించిన మునీశ్వరుడు కదా.
భావము : శాశ్వతమైన వాడు, దేనికీ చలించని వాడు, జ్ఞానానికి చివరి మెట్టు లేదా దారి చూపేవాడు, తాపసులలో యెన్న దగిన వాడు లేదా విశేష జ్ఞానము కలవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
ఓం నమో నారాయణాయ
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
🙏🙏🙏
**ధర్మము - సంస్కృతి**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి