1, అక్టోబర్ 2020, గురువారం

15-11-గీతా మకరందము


         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి


అవతారిక - చిత్తశుద్ధిలేనివారు ప్రయత్నము సలిపినప్పటికిని ఆత్మను చూడజాలరని చెప్పుచున్నారు – 


యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్ | 

యతన్తోఽప్యకృతాత్మానో

నైనం పశ్యన్త్యచేతసః || 


తాత్పర్యము:- (ఆత్మాసాక్షాత్కారమునకై) ప్రయత్నము చేయుచున్న యోగులు తమయందున్నట్టి ఈ ఆత్మను చూచుచున్నారు (అనుభూత మొనర్చుకొనుచున్నారు). అట్లు ప్రయత్నము చేయుచున్నవారైనను చిత్తశుద్ధిలేని అవివేకులు ఈ ఆత్మను చూడజాలకున్నారు.


వ్యాఖ్య:- అనేకులు భగవత్ప్రాప్తికై యత్నించుచున్నప్పటికిని అందులో కొందఱు సఫలురగుటకును, కొందఱు విఫలురగుటకును కారణమేమియో ఇచట తెలుపబడుచున్నది. చిత్తశుద్ధిగలిగి యత్నించువారు తప్పక సాఫల్యమును బొందగలరు. అనగా పరమాత్మను తమయందు సాక్షాత్కరించుకొనగలరు. కాని అదే ప్రయత్నము, అవే ధ్యానాదులు గావించుచున్నప్పటికిని, మలినచిత్తులు, సంస్కరింపబడని మనస్సు గలవారు, పరమాత్మను సాక్షాత్కరించుకొనజాలరు. కొందఱు శాస్త్రపాండిత్యము మున్నగునవి మాత్రము కలిగి హృదయపవిత్రతలేక ఆత్మాన్వేషణమునకై ఉపక్రమింతురు. మఱికొందఱు కేవలము వేషధారులుగ నున్నవారై ధ్యానాదులను చేయుచున్నట్లు కనుపించుచుందురు. అట్టివారు ఇంద్రియనిగ్రహము లేని కారణముచేతను, చిత్తశుద్ధి లేనందువలనను ఆత్మను తమయందు గాంచజాలరని ఈ శ్లోకమున ఘంటాపథముగ చెప్పివేయబడినది. క్షేత్రమును బాగుగ దున్ని కలుపుతీసి, శుద్ధముచేసి, ఎరువుచల్లి ఆ పిదప విత్తనము వేసినచో చక్కగ పైరగును. అట్లుకాక, దున్నక, కలుపుతీయక వేసినను, లేక ఊషరక్షేత్రమునవేసినను ఆ విత్తనము మొలవదు. ఒకవేళ మొలచినను పెరగదు. ఒకవేళ పెరిగినను ఫలించదు. అట్లే సాధనచతుష్టయసంపత్తి మున్నగువానిద్వారా చిత్తమును మున్ముందు శుద్ధమొనర్చుకొనినచో, అత్తఱి ఆత్మవిచారణాధ్యానాదులచే అతిసులభముగ ఆత్మ యనుభూతము కాగలదు. అవి లేనివారు ఎంత ప్రయత్నించినను ఆత్మను చూడజాలరు.


 భగవద్దర్శనమునకై రెండు విషయములు ప్రతివారికి అత్యవసరములని ఇచ్చోట తెలుపబడినది. అవియేవి యనిన - (1) ప్రయత్నము (2) చిత్తశుద్ధి - ఈ రెండును గలవారికి పరమాత్మ తప్పక అనుభూతుడు కాగలడు. రెండును అవసరములే. “యతన్తః” - అని

చెప్పబడుటవలన పరమార్థమార్గమున ప్రయత్నము అత్యావశ్యకమని తేలుచున్నది. అయితే ఆ ప్రయత్నమునకు చిత్తశుద్ధియు తోడుగానున్నపుడు అది యింకను ప్రకాశించును. ఇచట "అచేతసః" అని చెప్పబడినదానికి అర్థము కేవలము మూఢులని అజ్ఞానులని, నాస్తికులని కాదు. ఏలయనిన ఆ యత్నించువారికి దైవమును పొందవలెనను తలంపుగలదు. ముముక్షుత్వము కలదు. లేకున్న వారు భగవత్ర్పాప్తికై అసలు ప్రయత్నమే చేయరుగదా! వీరు ప్రయత్నము చేయుచున్నారు. కాని వక్రమార్గమున, అపసవ్యపద్ధతిలో చేయుచున్నారు. అట్టివారు అనుభవజ్ఞులగు పెద్దల సాంగత్యముచేసినచో సత్యమార్గమును కనుగొని తరించగలరు. దైవమార్గమున ప్రయత్నము మంచిదేకాని దానికి చిత్తశుద్ధికూడ తోడైనచో ఇంకను రాణించును. బాగుగ ఫలించును. మోటుగా సాధనచేయుటవలన గొప్ప ప్రయోజనములు చేకూరవు; సాధనపద్ధతిని, సాధనరహస్యములను

భగవవత్ప్రోక్తములగు ఇట్టి వచనములవలనను, సద్గ్రంథమువలనను, మహాత్ముల సాంగత్యమువలనను తెలిసికొని ముముక్షువులు సక్రమపద్ధతిలో ధ్యానించి తరించవలయును.


ప్రశ్న:- పరమాత్మ యెచట గలడు?

ఉత్తరము:- తనయందే.

ప్రశ్న:- ఆతనిని ఎవరు చూడగలరు? 

ఉత్తరము:- చిత్తశుద్ధిగలిగి ధ్యానాది ప్రయత్నములను చేయువారు. 

ప్రశ్న:- ఎవరు చూడలేరు? 

ఉత్తరము:- చిత్తశుద్ధిలేక ప్రయత్నము చేయువారు.

ప్రశ్న:- కాబట్టి భగవద్దర్శనమున కేవి అవసరము?

ఉత్తరము:- (1) చిత్తశుద్ధి (2) ప్రయత్నము.

కామెంట్‌లు లేవు: