22, డిసెంబర్ 2020, మంగళవారం

కర్మఫల త్యాగం

 కర్మఫల త్యాగం


🍁🍁🍁🍁🍁



చేసే పనిని కర్మగా వర్ణించింది భగవద్గీత. ఇంద్రియాలతో ఆచరించే ప్రతి పనీ కర్మయోగమే. 


చూడటం, వినడం, తాగడం, తినడం... ప్రతిదీ కర్మలోని భాగమే. కర్మల ఫలితమే మనిషి జీవన విధానమని భగవద్గీత అయిదో అధ్యాయం చెబుతోంది.


పూర్వం చేసిన పనులు సంచితమని, వర్తమానంలో ఆచరించేవి ప్రారబ్ధమని, రాబోయే కాలంలో చేయబోయే పనులు ఆగామిగా విభజించారు. కర్మను అనుసరించి ఫలం అందుతుంది.


ధ్వనికి ప్రతిధ్వని, స్పందనకు ప్రతిస్పందన ఎలా సాధారణమో కర్మకు ఫలితం అలాంటిదే. 


రెండు చేతులు చరిస్తే వచ్చే చప్పట్ల శబ్దాన్ని చెవులు అనుభవిస్తాయి. మనసు, శరీరం కలిసి చేసే కర్మల ఫలాన్ని మనిషి పొందుతాడు. 

నవ్వుతూ తప్పుచేస్తే ఏడుస్తూ అనుభవిస్తారు.



కర్మకు పాపపుణ్యాలు లేవు, మంచిచెడులు లేవు. ఫలితానికే సుఖదుఃఖాలు  పరిమితం. మానవ జీవితమే కర్మఫలంగా చెబుతారు.


కార్యాచరణ నిమిత్తమాత్రంగా జరగాలని, అప్పుడే ఫలితం మనల్ని బంధించదని శ్రీకృష్ణుడు బోధించాడు. 


దానినే తామరాకుపైన నీటిబొట్టుగా వర్ణించాడు.


యజమాని దగ్గర పనిచేసే సేవకుడు నిమిత్తమాత్రుడు. తాను చేసే పనుల లాభనష్టాలు, మంచిచెడులకు తాను బాధ్యత వహించడు.


 వాటివల్ల తాను ఏ ప్రయోజనం పొందడు. మనిషి సేవకుడిలా పనిచేస్తూ యజమాని అయిన భగవంతుడికి కర్మఫలాన్ని వదలాలి. అదే కర్మసన్యాస యోగమని గీత బోధ.


కర్మచేయడంపట్ల మనిషికి అధికారం ఉంది. ఫలంలో లేదు. కర్మత్యాగం కన్నా కర్మఫలత్యాగం మనిషిని జ్ఞానమార్గం వైపు మళ్ళిస్తుంది.


రామాయణంలో భరతుడు ‘తండ్రి ఆదేశానుసారం రాజ్యభారం’ వహించాడా? తనకు కాక శ్రీరామపాదుకలకు పట్టాభిషేకం గావించాడు.


 తాను రాజుగా మారక రాజ్యప్రతినిధిగా పాలించాడు. రాజ్యం పరిపాలించే కర్మను ఆచరించింది భరతుడే అయినా, శుభాశుభాల ఫలితాలు శ్రీరాముడికి సమర్పించడం కర్మఫలత్యాగం.


మనిషి బతికినంతకాలం కర్మను ఆచరించక తప్పదు. కర్మనుకాక దాని ఫలాన్ని త్యాగం చేయాలి. మనం ఒకరితో పంచుకునే విధానాన్ని దానం, త్యాగం అంటారు.


దానం కన్నా త్యాగం ఉన్నతమైంది. మనకు అవసరం కానిది, అధికంగా ఉన్నది దానం చేస్తాం. త్యాగంలో నాకేమిటి అనే స్థితి రాదు. 


పావురం ప్రాణాన్ని రక్షించే నిమిత్తం తన శరీరం నుంచి మాంసాన్ని కోసి ఇచ్చాడు శిబి చక్రవర్తి. త్యాగానికి అది పరాకాష్ఠ!


కర్మఫలాన్ని త్యాగంచేయడం అసాధారణ విషయం. 


మనిషి తాను చేసే పనిలో ఎంతో కొంత లాభాన్ని ఆశిస్తాడు. స్వార్థంతో చేసే పనిలో తన శక్తియుక్తులను ధారపోస్తాడు. కర్మపరిపక్వత చేరినప్పుడు ఫలితాన్ని త్యాగంచేయడం యోగులకే సాధ్యం.


త్యాగఫలం ఒక యోగం. ఫలత్యాగం మోక్షసాధనం. మోహాన్ని క్షయింపజేయడమే మోక్షం!


🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: