*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 45 / Sri Devi Mahatyam - Durga Saptasati - 45 🌹*
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
*అధ్యాయము 12*
*🌻. ఫలశ్రుతి - 3 🌻*
20–25. ఈ నా మాహాత్మ్య మంతా (భక్తునికి) నా సాన్నిధ్యాన్ని కలిగిస్తుంది. రేయింబవళ్లు సంవత్సరము పొడుగునా ఉత్తమ పశువులను, పుష్పాలను, అర్ఘ్యాలను, ధూపాలను, సుగంధ ద్రవ్యాలను, దీపాలను అర్పించడం వల్ల, బ్రాహ్మణ సంతర్పణల వల్ల, హోమాల వల్ల, మంత్రోదక ప్రోక్షణ వల్ల, ఇతరమైన వివిధ నివేదనల వల్ల, దానాల వల్ల, నాకు కలిగే ప్రీతి; ఈ నా సచ్చరిత్రాన్ని ఒక్కసారి విన్నంత మాత్రాన్నే కలుగుతుంది.
నా ఉద్భవం గురించిన పఠన శ్రవణాలు పాపాలను హరిస్తాయి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి, భూతాల నుండి రక్షిస్తాయి. యుద్ధంలో దుష్టరాక్షసులను పరిమార్చిన నా చరిత్రమును వింటే, నరులకు వైరుల వల్ల భయం ఉండదు. మీరు (దేవతలు), బ్రహ్మర్షులు, బ్రహ్మ చేసిన స్తోత్రాలు శుభమైగు బుద్ధిని కలిగిస్తాయి.
25-30. అరణ్యమధ్యంలో గాని కార్చిచ్చు నడుమగాని నిర్మానుష్య స్థలంలో చోరులనడుమగాని చిక్కుకున్నప్పుడు, శత్రువులకు దొరకినప్పుడు, అడవిలో సింహం చేతో పెద్దపులి చేతో, అడవి ఏనుగుల చేతో తరుమబడుతున్నప్పుడు, కినుక బూనిన రాజుచేత మరణశిక్ష గాని చెఱసాల శిక్షగాని విధింపబడినప్పుడు,
మహాసముద్రంలో పడవ యందుండి ప్రచండ వాయువుచే ఉట్రూతలూగింప బడుతున్నప్పుడు, మహాభయంకర యుద్ధంలో తనపై ఆయుధాలు కురుస్తున్నప్పుడు, ఘోరమైన సకల విపత్తులచేత, వేదన చేత పీడింప బడుతున్నప్పుడు :
ఇటువంటి ఏ స్థితిలోనైనా ఉన్నవాడు ఈ నా చరిత్రను స్మరిస్తే వాని సంకటం తీరిపోతుంది. ఈ నా చరిత్రను స్మరించిన వాని వద్దనుండి సింహాదులు, చోరులు, వైరులు నా ప్రభావంచేత దూరంగా పారిపోతారు.”
సశేషం....
🌹 🌹 🌹 🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి