22, డిసెంబర్ 2020, మంగళవారం

*రెండో పురుషార్థం

 *రెండో పురుషార్థం*

🕉️🌞🌎🏵️🌼🚩


 *‘ధనం కలిగినవాడే బలవంతుడు. ధనం గలవాడే పండితుడు. ధనం* *సర్వశ్రేయాలకు నిదానం. ధనం లేనివాడి జీవనమేల? అర్థ* *పరిహీనుడికి  నిరంతరం ఖేదం సంభవిస్తుంది’ అంటాడు నీతిచంద్రికకారుడు. ‘అర్థ’* *శబ్దానికి అర్థాలు చాలా ఉన్నా- ధనవాచకంగా లోకంలో రూఢికెక్కింది. పురుషార్థాలు *నాలుగింటిలో రెండోది ‘అర్థం’.* 

 *మానవులు కోరే సమస్త వస్తు సమూహాన్ని ‘అర్థ’ శబ్దం సూచిస్తుంది. విద్య, భూమి, సువర్ణం, పశువులు, ధన ధాన్యాలు మొదలైనవన్నీ ‘అర్థం’లో భాగమేనన్నాడు* *వాత్సాయనుడు. ఆర్జనం, వర్ధనం, రక్షణం అనే మూడూ అర్థమనే పురుషార్థ* *స్వరూపమంటాడు దండి దశకుమార చరిత్రలో. ధర్మాచరణకు, కామ* *పురుషార్థానుభవానికి అర్థమే కారణమవుతుంది.* *ధర్మకామాలు రెండూ అర్థానికి రెండు అవయవాలని, అర్థసిద్ధి చేతనే రెండింటి అనుభవం కలుగుతుందని మహాభారతం శాంతిపర్వం చెబుతోంది.* 

 *అర్థ ప్రాధాన్యాన్ని గురించి* *శాస్త్రాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఎంతగానో చెప్పాయి. ధనాన్ని* *న్యాయబద్ధంగా సంపాదించు కోవాలి. ధర్మ పద్ధతిలో అనుభవించాలి. త్యాగబుద్ధితో దానం చేయాలి. మనిషికి వస్తు సంపదల మీద, సుఖభోగాల మీద కోరిక కలుగు తుంది. ఆ కోరిక తీర్చుకునేందుకు తనకు చేతనైన మార్గంలో ప్రయత్నించి వాటిని సాధిస్తాడు. తానను కున్నవి కొన్ని లభించినా, మరికొన్ని సాధించవలసిన కొత్తవి చేరుతూ ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి మనిషి లోకాన్ని సేవిస్తూ, శ్రమిస్తూ ఉంటాడు. తాననుకున్నది సాధించుకోవడం ముఖ్యం* *కనుక నీతి తప్పి ప్రవర్తించడానికి వెనకాడడు. క్రమంగా అన్ని విధాలా పతనమైపోయే ప్రమాదమూ ఉంది. మన సనాతన* *సంప్రదాయంలో అర్ధకామాలకు ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. మనిషి తాను చేయదలచిన ప్రయాణానికి తన పాదాల సాయం స్వీకరించినట్లు అర్థ కామాలనే తన పాదాల సాయంతో ధర్మం ముందుకు సాగుతుంది.* 

 *ధృతరాష్ట్రుడు, అతడి పుత్రులు, పుత్రుల మిత్రులు జీవితానికి అర్థమే* *పరమార్థమనుకున్నారు. అర్ధాన్ని(రాజ్యాన్ని) తమదిగా నిలబెట్టుకోవాలన్న* *తాపత్రయంతో పాండవుల్ని ఎన్నో ఇడుములపాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు తామనుకున్నదాన్ని దక్కించుకోకుండానే పరలోకాన్ని చేరారు.* *ధర్మరాజుది ధర్మోత్తరమైన జీవితం. పెదతండ్రి రాజ్యం మొత్తానికి తనను* *యువరాజును చేసినప్పుడు రాజ్యం దక్కిందని అతడు పొంగిపోలేదు. కొంతకాలం* *తరవాత కుటిలబుద్ధితో ధృతరాష్ట్రుడు అర్ధరాజ్యమే ఇచ్చినప్పుడు* *కుంగిపోనూలేదు. ధర్మానికి విరుద్ధం కాని అర్థ కాంక్ష అతణ్ని అర్ధరాజ్యస్థితి నుంచి సార్వభౌమ స్థితికి పెంచింది.* 

 *ధనానికి దానం, భోగం, నాశం* *అనే మూడు గతులున్నాయి.* *ఒకరికి పెట్టక, తాను తినక,* *దాచి పెట్టిన సంపదకు ఏదో ఒక మార్గంలో నాశనం తప్పదు. ‘సంపాదించిన విత్తానికి* *త్యాగమే రక్షణ. చెరువులో నిండుగా ఉన్న నీటికి పారుదల ఒక్కటే రక్షణ’ అంటోంది విక్రమార్క చరితం. పాత్రుడికి దానం చేయ మన్నారు. అది ఉత్తమం. తాను ఆర్జించింది అనుభవించడం తప్పు కాదు. కానీ అది మధ్యమమే. ఈ రెండూ జరగకపోతే దొంగలు అపహరించుకుపోతారు. ఇది అధమం. ధనానికి ధర్మం, అగ్ని, రాజు, దొంగలు అనే నలుగురు* *దాయాదులు. వీరిలో జ్యేష్ఠమైన ధర్మానికి అవమానం కలిగితే తక్కిన ముగ్గురికీ కోపం వస్తుందంటాడొక కవి.* *దానశీలురు ధనాన్నంతా దానం చేసి సర్వమూ కోల్పోయినా అది అతడికి శోభనే కలిగిస్తుంది. అర్ధ స్వభావాన్ని అర్థం చేసుకుని ప్రవర్తిస్తే ఒక పురుషార్థాన్ని సాధించగలుగుతాం.* 


డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు


🕉️🌞🌎🏵️🌼🚩

కామెంట్‌లు లేవు: