*సుబ్రహ్మణ్య తత్వం*
🍁🍁🍁🍁
“ *శరవణభవ*”…
శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు
ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని
వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు
ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు
భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు
షదాననం చందన లేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం రుదస్య నూనుం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే.
శ – శమింపజేయువాడు
ర – రతిపుష్టిని ఇచ్చువాడు
వ – వంధ్యత్వం రూపుమాపువాడు
ణ – రణమున జయాన్నిచ్చేవాడు
భ – భవసాగరాన్ని దాటించేవాడు
వ – వందనీయుడు అని ‘శరవణభవ’కు గూఢార్థం.
కౌమారము అనే శాఖ ‘కుమార’ అన్న శబ్దము నుండే వచ్చింది.
మనకు ‘షణ్మతము’లను ఆరు మతములు ఉన్నవి.
అందులో ఆరు దేవతా స్వరూపాలను పరబ్రహ్మ స్వరూపాలుగా పూజిస్తాము.
అవి,
గాణాపత్యము - గణపతి; సౌరము - సూర్యుడు;
శాక్తము - పార్వతి(శక్తి);
శైవము - శివుడు;
వైష్ణవము - విష్ణువు;
కౌమారము - సుబ్రహ్మణ్యుడు.
వీరిని పూజించే పద్ధతినే పంచాయతన పూజ అంటారు.
ఇచ్ఛా జ్ఞాన క్రియా రూప మహాశక్త్ధిరం భజే! శివశక్తి జ్ఞానయోగం జ్ఞానశక్తి స్వరూపకం!!‘‘ అని శివపురాణ వచనం.
వైదిక మతంలో శివ శక్త్యాత్మకుడైన సుబ్రహ్మణ్యోపాసన గురించి చెప్పబడింది.
షణ్మతాలలో- సౌర, శాక్త, గాణాపత్య, వైష్ణవ, శివమతాలతోపాటు కుమారోపాసన గురించి చెప్పినప్పటికీ, పంచదేవతారాధనలో స్థానం కల్పించలేదు.
సుబ్రహ్మణ్యునికి ‘‘అగ్నిగర్భుడ’’ని నామం ఉంది.
అయితే, సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే ప్రారంభం అవుతుందని తత్త్వజ్ఞుల అభిప్రాయం.
ఏ పూజ మొదలెట్టినా దీపారాధనతోనే ప్రారంభం కావడం తెలియంది కాదు.
‘దీపారాధన’ అంటే అగ్నిగర్భుని ఉపాసించడమే! అలా సుబ్రహ్మణ్యారాధన ప్రారంభంలో లేని ఏ పూజయైనా నిష్ఫలమే!
పార్వతీ పరమేశ్వరుల తనయులు గణపతి, సుబ్రహ్మణ్యులు కుమారతత్త్వానికి ప్రతీకలు.
పంచభూతాత్మకమైన ఈ విశ్వానికి నాలుగు తత్త్వాలున్నాయని విజ్ఞులు చెబుతారు.
అవి- అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం. అవ్యక్తం, వ్యక్తం శివ పార్వతుల పరంగాను,
మహత్ తత్త్వానికి గణపతిని, అహంకారం అనుదానికి సుబ్రహ్మణ్యుని లేదా కుమారస్వామిని ప్రతీకలుగా చెబుతారు.
ఈ నాలుగూ ఒకే పరతత్త్వానికి భిన్న రూపాలుగా ఉంటున్నాయి.
అహంకారమంటే ‘గర్వం’ అనే అర్థంలోకాక ‘నేను’ అనే స్పృహని కలిగి ఉండడం అని అర్థం చేసుకోవాలి.
ఇది చైతన్యం యొక్క స్వరూపం. పరమాత్ముని పరంగానూ ఈ భావం ఉంటుంది. సృష్టిక్రమానికి నాంది ఇదే.
ఈ చైతన్య స్వరూపం వ్యష్ఠిగాను, సమిష్ఠిగాను ప్రకటితవౌతుంది. ఈ చైతన్య స్వరూపానికి సుబ్రహ్మణ్యుడు ప్రతీక.
చైతన్యం ప్రతి హృదయ కుహరంలోను ఉంటుంది. కాని బాహ్యంగా కనుపించదు. హృదయ గుహలో ప్రకాశించే ఈ పరమాత్మ చైతన్యాన్ని ‘‘గుహః’అని చెప్పారు.
చైతన్యం జ్ఞాన లక్షణం గల తత్త్వం. అంటే గురు తత్త్వం. అందుకే సుబ్రహ్మణ్యుని ‘గురుగుహ’ అని కీర్తించారువాగ్గేయకారులు.
ముఖ్యంగా శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని సాక్షాత్కారం పొంది, ఆతని అనుగ్రహంతో సంగీత, సాహిత్య, మంత్రశాస్త్ర, నాద రహస్యాలను తెలుసుకున్నారు.
తాను రచించిన సంకీర్తనలన్నీ ‘గురుగుహ’’ నామంతో ముద్రాంకితం చేశారు. కర్ణాటక సంగీతంలో ముత్తుస్వామి దీక్షితుల కృతులకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
పరమాత్మ చైతన్య రూపుడైన సుబ్రహ్మణ్యుని అర్చిస్తే వ్యక్తావ్యక్త స్వరూపులైన శివశక్తులను కూడ ఆరాధించినట్లేనని స్కంద పురాణం చెబుతున్నది.అనన్య శక్తిసంపన్నుడైన సుబ్రహ్మణ్యుడు శివశక్తిని తనదిగా చేసుకున్నాడు.
ఆ శక్తే శక్త్యాయుధంగా చేత బుచ్చుకుని ‘శక్తి ధరుడు’గా ఉపాసింపబడుతున్నాడు. లోక రక్షణకు కంకణం కట్టుకున్నాడు.
పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I
అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా II
తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I
పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు. అవ్యక్త శక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి.
వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాంద పురాణం చెబుతోంది.
అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్నీ, లక్ష్మీనారాయణులనీ కలిపి అర్చించినట్లే...
🍁🍁🍁🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి