30, సెప్టెంబర్ 2021, గురువారం

సంస్కృత మహాభాగవతం*

 *30.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదియవ అధ్యాయము*


*లౌకిక - పారలౌకిక సౌఖ్యములన్నియును నిస్సారములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*10.1 (ప్రథమ శ్లోకము)*


*మయోదితేష్వవహితః స్వధర్మేషు మదాశ్రయః|*


*వర్ణాశ్రమకులాచారమకామాత్మా సమాచరేత్॥12577॥*


*శ్రీకృష్ణభగవానుడు నుడివెను* "ఉద్ధవా! సాధకుడు త్రికరణశుద్ధిగా నన్ను శరణుజొచ్చి, నేను ఉపదేశించిన ధర్మములను సావధానముగా పాటింపవలెను. వర్ణాశ్రమ ధర్మములను, వంశముయొక్క సదాచారములను నిష్కామ బుద్ధితో అనుష్ఠింపవలెను..


*10.2 (రెండవ శ్లోకము)*


*అన్వీక్షేత విశుద్ధాత్మా దేహినాం విషయాత్మనామ్|*


*గుణేషు తత్త్వధ్యానేన సర్వారంభవిపర్యయమ్॥12578॥*


విషయభోగములయందు నిమగ్న చిత్తులైన దేహధారులు ఆచరించు కర్మలు అన్నియును ఆరంభమున సుఖకరములుగా అనిపించినను పరిణామమున విషతుల్యములుగనే యుండును. అంతఃకరణ శుద్ధిగలవారు ఈ విషయములను లోతుగా ఆలోచించి, సంసారసుఖముల యెడ విముఖత కలిగి యుండవలయును.


*10.3 (మూడవ శ్లోకము)*


*సుప్తస్య విషయాలోకో ధ్యాయతో వా మనోరథః|*


*నానాత్మకత్వాద్విఫలస్తథా భేదాత్మధీర్గుణైః॥12579॥*


మానవుడు నిద్రించుసమయమున స్వప్నమునందు అనేక విషయానుభవములను కలిగి యుండును. మేల్కొనిన పిదప అవియన్నియును మిథ్యయని బోధపడును. అట్లే జాగ్రదవస్థ యందును మనస్సున ఉత్పన్నములగు సంకల్పవికల్పము లన్నియును మిథ్యయే. ఈ నానాత్వభ్రమకు అజ్ఞానమే కారణము.


*10.4 (నాలుగవ శ్లోకము)*


*నివృత్తం కర్మ సేవేత ప్రవృత్తం మత్పరస్త్యజేత్|*


*జిజ్ఞాసాయాం సంప్రవృత్తో నాద్రియేత్కర్మచోదనామ్॥12580॥*


మానవుడు విహితకర్మలను నిష్కామబుద్ధితో ఆచరింపవలయును. వాటి ఫలములను భగవంతునికే అర్పింపవలయును. సకామకర్మలను ఎన్నడును ఆచరింపరాదు. బ్రహ్మజ్ఞానము కొరకు బాగుగా ప్రయత్నించవలెను. కర్మ పరంపరలో చిక్కుకొనరాదు.


*10.5 (ఐదవ శ్లోకము)*


*యమానభీక్ష్ణం సేవేత నియమాన్ మత్పరః క్వచిత్|*


*మదభిజ్ఞం గురుం శాంతముపాసీత మదాత్మకమ్॥12581॥*


*10.6 (ఆరవ శ్లోకము)*


*అమాన్యమత్సరో దక్షో నిర్మమో దృఢసౌహృదః|*


*అసత్వరోఽర్థజిజ్ఞాసురనసూయురమోఘవాక్॥12582॥*


అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనునవి *యమములు* అనబడును. జిజ్ఞాసువు వీటిని పూర్తిగా ఆదరబుద్ధితో పాటింపవలెను. శౌచము, సంతోషము, తపశ్చర్యలు, స్వాధ్యాయము, 'ఈశ్వరప్రణిధానము' అను నియమములను యదాశక్తి పారమార్థికబుద్ధితో ఆచరింపవలెను. పిమ్మట బ్రహ్మనిష్ఠగల ప్రశాంతచిత్తుడైన గురువును ఆశ్రయింపవలెను. అట్టి గురువును నా స్వరూపునిగానే భావింపవలెను. జిజ్ఞాసువు ఎట్టి అభిమానముగాని, మత్సరబుద్ధిగాని లేకుండా కార్యదక్షుడై మమతారహితుడై యుండవలెను. గురువునెడలను, పరమాత్మనైన నాయందును దృఢమైన భక్తిశ్రద్ధలను కలిగియుండవలెను. మనస్సును లౌకిక విషయములమీదికి ఇటునటు పోనీయరాదు. దేనియందును దోషదృష్టి కలిగియుండరాదు. వ్యర్థమైన అసత్యభాషణములకు దూరముగా ఉండవలెను.


*10.7 (ఏడవ శ్లోకము)*


*జాయాపత్యగృహక్షేత్రస్వజనద్రవిణాదిషు|*


*ఉదాసీనః సమం పశ్యన్ సర్వేష్వర్థమివాత్మనః॥12583॥*


ఇట్లు అభ్యాసము చేయగా చేయగా ఆ జిజ్ఞాసువునకు సర్వత్ర సమభావము ఏర్పడును. అంతట భార్యాపుత్రులు, గృహములు, భూములు, బంధుమిత్రులు, సంపదలు మొదలగువాటియందు ఆసక్తి తొలగిపోవును. అన్ని పదార్థములయందును సమభావముగలిగి (బంగారము నందును, మట్టియందును సమభావము గలిగి) పూర్తిగా ఉదాసీనుడై యుండవలెను.


*10.8 (ఎనిమిదవ శ్లోకము)*


*విలక్షణః స్థూలసూక్ష్మాద్దేహాదాత్మేక్షితా స్వదృక్|*


*యథాగ్నిర్దారుణో దాహ్యాద్దాహకోఽన్యః ప్రకాశకః॥12584॥*


*10.9 (తొమ్మిదవ శ్లోకము)*


*నిరోధోత్పత్త్యణుబృహన్నానాత్వం తత్కృతాన్ గుణాన్|*


*అంతః ప్రవిష్ట ఆధత్త ఏవం దేహగుణాన్ పరః॥12585॥*


ఆత్మ స్వయంప్రకాశకము, సర్వసాక్షి, స్థూల, సూక్ష్మదేహముల కంటె భిన్నమైనది. బాగుగా జ్వలించుచు ప్రకాశించుచున్న అగ్ని దహింపబడు కట్టెలకంటెను వేరైనట్లు, సకలప్రాణుల దేహములను ప్రకాశింపజేయు (చైతన్యవంతమొనర్చు) ఆత్మయు ఆ శరీరములకంటెను భిన్నమైనది. కట్టె సంబంధమువలన అగ్ని కట్టెను అనుసరించి, చిన్న, పెద్ద ఆకారములలో కనబడును. కట్టె పూర్తిగా కాలిన పిమ్మట అగ్ని శాంతమైనట్లు, కాల్చినప్పుడు అగ్ని ఉత్పన్నమై కనబడును. కాని వాస్తవముగా అగ్ని ఆ కట్టెనుండి సర్వధా భిన్నమైనది. అట్లే ఆత్మయు దేహములలో ఉన్నప్పుడు వాటి గుణములను కలిగియున్నట్లు భావింపబడును. దేహములయొక్క పరిణామములు ఆత్మయందు ఆరోపింపబడును. కాని ఆత్మ దేహములకంటె భిన్నమే.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: