30, సెప్టెంబర్ 2021, గురువారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ధుని నిర్మాణం..*


దాదాపు పదిహేనేళ్ల క్రిందట..నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొత్తపేట గ్రామం నుంచి దంపతులు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు.. శ్రీ స్వామివారి మందిరం వద్ద వాళ్ళ తాహతు ననుసరించి ఒక చిన్న గది కట్టించాలని వాళ్ళ కోరిక..అదికూడా..శ్రీ స్వామివారి మందిరం ప్రాంగణం లోనే కట్టాలని నిశ్చయించుకున్నారు.. నేరుగా మా అమ్మగారు నిర్మల ప్రభావతి గారి వద్దకు వెళ్లి..తమ మనసులోని మాటను చెప్పేసారు..మా నాన్నగారు అప్పటికి అనారోగ్యం తో మంచం లో వున్నారు..ఏమీ మాట్లాడలేని పరిస్థితి వారిది..


"అమ్మా..మా శక్తి కొద్దీ స్వామివారి మందిరం లో ఒక గది కట్టించాలని అనుకున్నాము..మీరు అనుమతి ఇస్తే..పని మొదలుపెడతాము" అన్నారు..అమ్మగారు సరే అన్నారు..ఈ దంపతులు తాము ఎక్కడ కట్టదల్చుకున్నదీ స్పష్టంగా మా అమ్మగారికి చెప్పలేదు..ఆమె అనుకున్న ప్రదేశం వేరు..వీళ్ళు అనుకుంటున్న ప్రదేశం వేరు..


ఆ సమయానికి నేను వేరే చోట ఉండిపోయాను..మందిరం వద్ద నుంచి మా సిబ్బంది ఫోన్ చేసి.."అయ్యా!.. ఓ దంపతులు వచ్చి..ఆలయ ప్రాంగణం లో ఆగ్నేయ మూల గది కట్టించాలని సంకల్పించారు..అలా గుడి లో ఆ గది కడితే..ఆవరణ లో అడ్డంగా ఉంటుంది..అమ్మగారు కట్టుకోమని వాళ్లకు చెప్పేసారు..మేము అభ్యంతరం చెప్పినా..వీళ్ళు వినడం లేదు..ఆగ్నేయమూల పునాది కోసం త్రవ్వకం మొదలు పెట్టారు..మేము..మీ పేరు చెప్పి బలవంతం మీద ఆపాము.." అన్నారు..


నేను హుటాహుటిన బయలుదేరి మొగలిచెర్ల చేరాను..శ్రీ స్వామివారికి మనసులో మ్రొక్కుకున్నాను..ముందుగా అమ్మతో మాట్లాడాను..నేను మాట్లాడిన తరువాత..అమ్మకు పరిస్థితి అవగాహనకు వచ్చింది..అయినా కానీ..తాను వచ్చి స్వయంగా చూస్తానని చెప్పింది..కారులో ఎక్కించుకొని మందిరానికి తీసుకెళ్ళాను..మందిర ప్రాంగణంలో కొత్త కట్టడాలు వస్తే..ఉన్న స్థలం కుంచించుకు పోతుందనీ.. ఉత్సవాల సమయం లో ఎక్కువమంది భక్తులు వచ్చినప్పుడు..చాలా ఇరుకుగా ఉంటుందనీ..ధర్మకర్త లు గా ఉన్న మనం..ఇప్పటి పరిస్థితులే కాకుండా..భవిష్యత్ గురించి కూడా ఆలోచించాలని..ఎప్పటికైనా ఈ మందిరం పెద్ద క్షేత్రంగా మారుతుందని..ఆరోజు..ఈ కట్టడాలను కూల్చివేయక తప్పదని..నచ్చచెప్పాను..


అమ్మగారు..ముందు ఈ వాదనలన్నీ తోసిపుచ్చింది..కానీ తరువాత..తానే ఆలోచించుకున్నది.."నిజమేరా..నువ్వు చెప్పినట్లే..మందిరం లోపల కొత్త కట్టడాలు వద్దు..ఏనాటికైనా ఈ సమాధి మందిరం క్షేత్రంగా మారుతుందని శ్రీ స్వామివారు కూడా మాతో పదే పదే చెప్పేవారు..ఆ మాట ఎప్పటికైనా నిజమవుతుంది..కానీ ఆ దంపతులకు ఊరట కలిగేలా మరో స్థలం చూపించు.." అన్నారు..నెత్తిన పెద్ద బరువు దించినట్లుగా భావించాను..ఆ దంపతులకు నచ్చచెప్పి..మరో స్థలం చూపించాను..అక్కడికి ఆ సమస్య పరిష్కారం అయింది..కానీ వాళ్ళు త్రవ్విన పునాది చూసిన తరువాత..అమ్మ ఒక మాట అన్నది..


"ఒరేయ్ ప్రసాద్..మంచో చెడో.. వాళ్ళు ఇక్కడ కొద్దిగా త్రవ్వారు..ఈ ప్రదేశం గుడికి సరిగ్గా ఆగ్నేయ దిశలో ఉన్నది..శ్రీ స్వామివారి కి "ధుని" ఏర్పాటు చేయొచ్చు కదా..అవధూతల మందిరాల్లో ధుని ఉండటం కూడా మంచిదే..ఆలోచించు.."అన్నారు..ఈ మాటలు నా మీద గట్టి ప్రభావాన్నే చూపించాయి..


నిజమే..ఆ దంపతుల పుణ్యమా అని..మా అమ్మగారి నోటినుంచి ధుని ప్రస్తావన వచ్చింది..ఇక క్షణం ఆలస్యం చేయలేదు..ఒక ధుని కోసం చిన్నపాటి కట్టడాన్ని ఒక వారం లోపలే పూర్తిచేసాము..


కానీ నా మనసులో ఇప్పటికీ ఒక సందేహం ఉండిపోయింది..ఆ దంపతుల కోరిక మేరకు అమ్మగారు అనుమతి ఇచ్చింది గది కోసమా?..లేక ధుని నిర్మాణం కోసం అమ్మగారి ద్వారా శ్రీ స్వామివారే ఇలా చెప్పించారా?..

జవాబు శ్రీ స్వామివారికే తెలుసు!!


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: