23, అక్టోబర్ 2022, ఆదివారం

*ధన త్రయోదశి

 

*ధన త్రయోదశి - బలి త్రయోదశి*


_(బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారి అనుగ్రహ భాష్యం నుంచి)_


ధన త్రయోదశి అని ఉత్తర భారతంలో ప్రాచుర్యం పొందిన ఆశ్వీయుజ బహుళ త్రయోదశి దక్షిణ భారతంలో బలి త్రయోదశిగా ప్రాచుర్యంలో ఉంది.


అననుకూల,ప్రతికూల ఆలోచనలతో, అపమృత్యు భయంతో ఉన్న మనకు ఆత్మబలాన్ని ఇచ్చేదే బలి త్రయోదశి.


సాధారణంగా అమావాస్య ముందు వచ్చే బహుళ త్రయోదశి మనిషికి మానసికంగా,  బుద్ధిపరంగా నీరసాన్ని కలగజేస్తుదన్నది శాస్త్ర విదితం.


శరత్, వసంత కాలాలు  అన్ని ప్రాణులకు మృత్యువును తీసుకువచ్చే కాలాలని పేరు. అందులోనూ ప్రత్యేకంగా ఆశ్వీయుజ, కార్తిక మాసాలకు అపమృత్యుమాసాలని పేరు. ఈ మాసాలలో అటువంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అందుకని దీపావళి ముందు వచ్చే బహుళ త్రయోదశి రోజు నాడు చేసే దీప దానము మన మానసిక ఆందోళనలు తొలగించి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ బలాన్ని చేకూరుస్తుంది.


ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి స్వచ్ఛమైన పత్తితో చేసిన రెండు వత్తులు ఒకటిగా కలిపి వెలిగించి ఆ దీపాన్ని ఒక బ్రాహ్మణునకు దానంగా ఇవ్వాలి.

*తిలేభ్యః ఇదం తైలం*  అంటే నువ్వుల నుంచి తీసినదానికే తైలం అని పేరు. అందుకే నువ్వుల నూనె మాత్రమే వాడాలి. ఆ దీపం నుంచి వచ్చిన వెలుతురు చూడడం వలన మన కంటి శుక్లాలు కూడా తొలగి స్వచ్ఛమైన చూపును పొందగలం.


దీపదానం చేసే సమయాన చదువుకోవలసిన మంత్రం


*మృత్యునా  పాశదండాభ్యాం*

*కాలేన శ్యామలా సహా!*

*త్రయోదశ్యాం దీపదానాత్*

*సూర్యజః ప్రీయతాం మమ!!*



అలాగే ఈ రోజు ధన్వంతరి మహా మంత్రాన్ని కూడా జపించాలి.


*ఓం నమో భగవతే మహా సుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే*

*అమృతకలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ*

*త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే*

*శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరీ స్వరూప*

*శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర  నారాయణాయ స్వాహా*.


 ఈ రోజుదీప దానం చేసేవారు మరోక విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోండి.


అననుకూల, ప్రతికూల ఆలోచనలను మన నుంచి దూరం చేసి, మనకు ఆత్మస్థైర్యాన్ని కలగచేయడానికి మనము ఇచ్చే  అపమృత్యు దీపాన్ని ఆ యముని ప్రతినిధిగా మన నుంచి దానంగా స్వీకరించి, మనకు  ఆత్మ బలాన్ని ప్రసాదించే బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడో ఆలోచించుకోవాలి.


అటువంటి బ్రాహ్మణోత్తముడిని గౌరవించడం నేర్చుకోండి.


సమాజాన్ని ప్రతికూల వాతావరణ నుంచి రక్షించి ధర్మాన్ని కాపాడే బాధ్యత వహించేవాడు బ్రాహ్మణుడు.


అందుకే హిందూ సమాజం నుంచి బ్రాహ్మణులను దూరం చేసే ప్రయత్నాలు సర్వత్రా జరుగుతున్నాయి. అటువంటి ప్రయత్నాలు వెనుక దురాలోచనలను గ్రహించి,

సమాజాన్ని కాపాడుకుందాం.


అంతేగాక భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి వచ్చిన పితృదేవతలు ఆశ్వీయుజ బహుళ అమావాస్య అనగా దీపావళి తర్వాత తిరిగి ఊర్దలోకాలకు బయలుదేరుతారు.


అందువలన నరక చతుర్దశి రోజు కాగడా వెలిగించి ఊర్ద్వలోకాలకు ప్రయాణమైన పితృదేవతలకు దారి చూపించడం అన్నది ఆనవాయితీగా వస్తోంది.


నరక చతుర్దశి రోజు అందరూ తప్పక యమతర్పణ విధి నిర్వహించాలి.


ధర్మశాస్త్రాన్ని అనుసరిద్దాం, ఆచరిద్దాం.

భావితరాలను తీర్చిదిద్దుదాం.

 మన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం.


*మృశి*

(దశిక ప్రభాకర శాస్త్రి)

కామెంట్‌లు లేవు: