23, అక్టోబర్ 2022, ఆదివారం

పరమాచార్య - ప్రదోషం మామ

 పరమాచార్య - ప్రదోషం మామ


దయాసముద్రుడైన ఆ పరమేశ్వరుడే పరమాచార్య స్వామివారిలాగా ఈ భూమిపై అవతరించారు. కేవలం కొంత మంది మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగారు. కొంతమంది వారి దివ్య లీలలను అనుభవిస్తూ, పొందుతూ ఉండిపోయారు. మరికొంతమంది వారి వైభవాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో నిమగ్నమయ్యారు. వీరు దాన్ని తమ జీవిత ధ్యేయంగా మలచుకొని మహాస్వామివారే అన్ని రోగాలను పోగొట్టే వైదీశ్వరుడని, చిదంబరంలోని నటరాజు అని ప్రజలకు తెలియజేయాలని జీవితాంతం శ్రమించారు. అటువంటి మహా భక్తుల్లో ఒకరు బ్రహ్మశ్రీ ప్రదోషం మామ.


పరమాచార్య స్వామివారు ప్రదోషం మామ యొక్క అనన్య భక్తికి ఎప్పుడూ బద్ధుడై ఉంటారు. మహాస్వామి వారు తనపై చూపిన కరుణని దయని ఎన్ని జన్మలకైనా తిర్చుకోలేనిదని అంటుంటారు ప్రదోషం మామ. పరమాచార్య స్వామి వారిపై మామ భక్తిని వారు నెలనెలా నిర్వహించే ఉత్సవాలలోనూ, సంవత్సరోత్సవాలు, జయంతి, మహారుద్ర, సువాసిని పూజల్లోనూ ప్రస్ఫుటంగా చూడవచ్చు.


మామ పదవి విరమణ పొందిన రైల్వే ఉద్యోగి. వారికి వచ్చే పెన్షన్ వారి కుటుంబానికి ఏమాత్రం సరిపోయేది కాదు. వారికి ఉన్న పెద్ద సంపదల్లా పరమాచార్య స్వామివారి ఆశీస్సులే. అదే వారికి ఇన్ని కార్యక్రమాలు చేయాడానికి తోడ్పడుతోంది. ఈ కార్యక్రమాల నిర్వహణ విషయంలో మామకి ఎవ్వరూ సాటి రారు.


ఒకసారి మహాస్వామి వారు మహాగావ్ లో మకాం చేస్తున్నారు. హఠాత్తుగా రామమూర్తి అయ్యర్ తో తమ భిక్షకి దానం సేకరించవలసిందిగా ఆదేశించారు. అక్కడున్న వారందరూ ఇది నమ్మలేకపోయారు. భిక్ష కోసం మహాస్వామి వారు ధనం అడగడం. రాజులు, జమీందారులు ఇచ్చిన ధనం పైనే ఎప్పుడూ స్వామివారు ఇష్టత చూపలేదు. వాటిని మఠం వారు స్వీకరించి వెంటనే అవసరంలో ఉన్నవారికి ఇచ్చివేసేవారు.


అలాంటిది స్వామివారి మాటలకు ఆశ్చర్యపోయారు. వారి ఆదేశం ప్రకారం రామమూర్తిగారు అక్కడున్న ఐదు మంది బ్రాహ్మణులతో 1500 పోగుచేశారు.

“ఇది అతనికి ఇవ్వు” అని అన్నారు స్వామివారు, ముద్దుగా 64వ నాయనారుగా పిలుచుకునే ప్రదోషం మామను చూపిస్తూ.


ఆరోజు మామకు ఇచ్చిన దానం మేరుపర్వతమంత అయి మామకు సహాయ పడింది. మరుసటి ప్రదోషం నాటికి తమని దర్శించడానికి వచ్చిన మామతో “ఆ దానం బ్యాంకులో వెయ్యి” అని చెప్పారు స్వామివారు. పరమాచార్య స్వామివారి కార్యక్రమములు, వేద సంరక్షణ, గో సంరక్షణ, దేవాలయ ఉత్సవాలు అన్నీ ఆ ధనంతోనే జరుగుతున్నాయి. ఇలా అనుగ్రహింపబడింది కేవలం ప్రదోషం మామ ఒక్కరే.


--- ‘లోకమాత’ 1996 దీపావళి ‘కల్కి’ విశిష్ట సంచిక నుండి


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: