*ఋషి ఋణం*
➖➖➖✍️
*అంతగా కష్టపడుతున్నట్లు "కనబడని" వేద పండితులకు సన్మానాలు, సత్కారాలు ఎందుకు చెయ్యాలి?*
-------------
*భరతభూమి వేదాలకు పుట్టినిల్లు! మనం నమ్మినా, నమ్మకపోయినా మనకి తెలిసినా తెలియకపోయినా వేదం సకలజ్ఞాన నిధి, సమస్త విజ్ఞానానికి నిలయం! మన వీపుమీద ఏముందో మనంతట మనం తెలుసుకోలేని మానవ మాత్రులం - మనకి తెలియనంత మాత్రాన ఒప్పుకోo, లేదు, కాదు చూసేక నమ్ముతాను అంటే అవివేకం తప్ప మరేమీ కాదు! వీటిమీద కూడా ఎంతో పరిశోధన, పరిశ్రమ చెయ్యాలి! చెయ్యాలంటే కనీసం మూలం వేదాల్ని కాపాడుకోవాలి! తరువాతి తరాలకు అందించాలి.*
*మన ఇళ్ళల్లో ఎంత చిన్న కార్యక్రమం అయినా అటువంటి వేదపురుషుల ఆశీర్వచనం కావాలని కోరుకుంటాం, ప్రయత్నిస్తాం! కానీ ఎక్కడినుంచి వస్తారు? ఎలా అంత నిష్ణాతులైన పండితులుగా తయారవుతారు అనే విషయం చాలా మందికి తెలీదు. అందుకే ఎక్కువగా కష్టపడుతున్నట్లు కనబడని అలాంటి వారికి సభలు పెట్టి ఎందుకు సన్మానాలు, సత్కారాలు చెయ్యాలి? మనం పిలిచినప్పుడు పిలిచినవారికి ఇస్తున్నాం కదా! అనుకుంటూ ఉంటారు ఇలాంటి వారుకూడా చాలామంది!*
*కానీ కనీసం 10-12 సంవత్సరాల పరిశ్రమ చేస్తే కానీ ఒక ‘క్రమపాఠీ’ తయారు కారు. అది ప్రారంభ దశ! అర్హత! ఆపైన పదం, ‘జట’ ఇలా కొనసాగుతూ ‘ఘన’ వరకు కొనసాగుతుంది. ఆ స్థితికి చేరడానికి 18-20 సంవత్సరాల కృషి, పట్టుదల ఇంకా కఠోర పరిశ్రమ కావాలి. ఆపైన పరీక్ష ఇచ్చి ఉత్తీర్ణులు కావాలి!*
*పోనీ ఎలాగో అలాగ కష్టపడి అర్హత సాధించేక అయిపోయినట్లేనా? అంటే కాదు! ఆజన్మాంతం పొల్లు పోకుండా అపస్వరాలు రాకుండా గుర్తు పెట్టుకోవాలి!*
*మన లౌకిక విద్యలు పరీక్షల్లో క్లిష్టమైన IAS చదివిన అధికారులైనా ఒకసారి నియమించబడ్డాక పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడమే తప్ప చదివినదంతా గుర్తు ఉంచుకోనక్కరలేదు, ఉంచుకోరు కూడా!*
*నేడు న్యాయ పట్టా తీసుకున్న వారు కూడా మూలంగా విషయం గుర్తుపెట్టుకుని మర్నాడు కాబోయే కేసుకు సంబంధించిన సెక్షన్లు మళ్లీమళ్లీ చదువుకుని కోర్టు కి వెళ్ళవచ్చు. అనుభవం కొద్దీ పదును తేరవవచ్చు.*
*ఇంక, డాక్టర్లు తప్ప చదివినది నిత్యం గుర్తు ఉంచుకునే వృత్తి ఎవరికీ లేదు. వారుకూడా సాధారణ లక్షణాలు, స్థూలంగా చికిత్స గుర్తుపెట్టుకోవడమే కానీ చదివింది మొత్తం ఒక్క అక్షరం పొల్లుపోకుండా కంఠతా పట్టి ఆజన్మాంతం గుర్తు పెట్టుకోరు, ఆ అవసరం కూడా ఉండదు. వీళ్ళకీ గూగుల్ మాత ఆపన్నహస్తం ఉండనే ఉంది!*
*ఇంక మామూలు చదువులు అయితే చెప్పనే అక్కరలేదు. అయిపోయిన పరీక్షకి సంబంధించిన పుస్తకాలు అమ్మేయడమే/విసిరేయడమే. మళ్ళీ ఉద్యోగానికి interview కి వెళ్లాల్సినప్పుడు ముఖ్య విషయాలు నెమరు వేసుకోవడమే! మొత్తం గుర్తు ఉంచుకునే పరిస్థితి లేదు. ఒకవేళ మళ్ళీ మొత్తం చదివినా, ఉద్యోగం రాగానే వదిలేయడమే!*
*ఈ రోజుల్లో అయితే software coding తో సహా ఎక్కడ ఎవరికి ఏ అనుమానం వచ్చినా గూగుల్ మాతని అడగడమే!*
*కానీ అలా కాకుండా చిన్నప్పుడు చదువుకున్న వేదాన్ని 70, 80 సంవత్సరాలు నిండిన పండితులు కూడా కొత్తగా వచ్చిన పిల్ల విద్వాంసులతోబాటు సమానంగా గుర్తు ఉంచుకుని చెప్పడం వంటి అసాధారణ ప్రక్రియ, అప్రమేయ జ్ఞాపక శక్తి ఇంక ఏ రంగంలోనూ, ఏ వృత్తిలోనూ కనబడదు!*
*పోనీ ఇంత శ్రమపడి చదువుకుని పైకొచ్చిన పండితులకి కనబడితే నమస్కారం పెట్టేవాళ్ళే గానీ పిల్లనిచ్చే కన్యాదాతలు కూడా అరుదు అయిపోయారు. అందరికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అమెరికా సంబంధాలే కావాలి!*
*ఇలాంటప్పుడు అలాంటి మేధావుల్ని పెంచి, పోషించి కాపాడుకోవలసిన ధర్మం/బాధ్యత మనందరిమీదా ఉంది. వాళ్ళకి కూడా సంసారాలు, పెళ్ళాం పిల్లలు ఉంటారు కదా! వారి పోషణ చెయ్యాలి కదా!*
*వీరు చేసే కఠోర పరిశ్రమ, వీరికి ఉన్న, ఉండవలసిన అసాధారణ జ్ఞాపక శక్తిని తెలుసుకున్నాక - మామూలు ఇంగ్లీష్ చదువులు, ఇంజనీరింగులు చదవలేని వారు ఇందులో చేరతారు అనుకోవడం భ్రమ! తప్పు! అకార్యం అవివేకం కూడా!*
*అందుకని మనం చదవలేకపోయిన, చదువుకోని చదువును మనందరికోసం చదువుకుని ఆ పరంపరను ఋషిప్రోక్త వచనాలను మనకి అందిస్తున్న అలాంటివారిని ఆదరించడం మన విధి, కర్తవ్యం కూడా!!!*
*పుట్టిన ప్రతివారికీ ప్రామిసరీనోటు లేని ఋణాలు మూడు - దేవఋణం, పితృఋణం, ఋషిఋణం. వీటిని మన జీవిత కాలంలో తీర్చుకోవల్సిన కర్తవ్యం మన అందరి మీదా ఉంది. ఋషులు అందించిన వేదాన్ని చదువుకుని ఆ పరంపరను అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తూ వేదాధ్యయనం చెయ్యడం, చేయించడమే ఋషి ఋణం తీర్చుకోవడం అంటే.*
*అటువంటి ఋషిఋణం తీర్చుకోవడానికి మనవంతుగా పదిమంది వేద పండితులకు సహాయం అందించాలి!అందించేవారిని ప్రోత్సహించాలి! వారికి సహాయం అందించాలి! అన్నింటికంటే ముందు వారిని గౌరవించాలి, గౌరవించక పోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నచూపు చూడటం మాత్రం కూడదు!*
*ఇకనుంచైనా విషయం తెలుసుకుని విలువ ఉన్నవారిని గౌరవిద్దాం, వారికి ఇవ్వాల్సిన విలువ వారికి ఇద్దాం! మన వంతు ‘ఋషి ఋణం’ తీర్చుకుందాo!*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి