12, మే 2023, శుక్రవారం

 

*ఆత్మనామ గురోర్నామ నామాతి కృపణస్యచ*

*శ్రేయస్కామో న గృహ్ణీయాత్ జ్యేష్టాపత్య కళత్రయో*

      తన పేరు, గురువు పేరు, అతి దుర్మార్గుడిపేరు, పెద్దకుమారుని పేరు, భార్య పేరు చెప్పకూడదని పెద్దలంటారు. ఎవరు చెప్పకూడదు అంటే శ్రేయస్కాములు అని సమాధానము.    శ్రేయస్కాములు అంటే శ్రేయస్సును కోరేవారు అని.  వినటానికి, అనటానికి, ఆచరించటానికీ కూడా సులభముగా ఉన్న ఈ చిన్న శ్లోకములోని విశేషాలను, పరమతాత్పర్యమును పరిశీలించే ప్రయత్నమే ఈ చిన్ని భావప్రకటన.  *ఈ శ్లోకములో “శ్రేయస్కామః” పదమే కీలకమైనది.* అది ముందు పరిశీలిద్దాం.

     శాస్త్రములో  ప్రతి పదమునకు నిర్దిష్టమైన అర్థము ప్రత్యేకముగా ఉంటుంది.  ఈ శ్రేయస్సు అన్న పదము దానితో పాటు ప్రేయస్సు అన్న పదము కలిపి *“శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతస్తా సంపరిత్య వివినక్తి ధీరః; శ్రేయోహి ధీరోభిప్రేయసోవృణీతే ప్రేయోమందో యోగక్షేమాత్ వృణీతే”*  అని మనము కఠోపనిషత్ లో చూడవచ్చు. సాధకుడి పుణ్యవిశేష ఫలముగా శుభకరములైనవి, సుఖకరమైనవి కూడా అనుభవానికి వస్తాయి.  *శుభకరమైనవి, శాశ్వతమైనవి శ్రేయస్సు సూచిస్తే,  లౌకికమైనవి, అశాశ్వతమైన సుఖమునిచ్చేవి ప్రేయస్సు సూచిస్తుంది.*  విచక్షణ కలిగిన బుద్ధిమంతుడు శాశ్వతమైన శ్రేయస్సునే కోరుకుంటాడు, తద్భిన్నుడు లోభ మోహాదులచే అశాశ్వత లౌకిక సుఖములనే కోరుకుంటాడు అని స్థూలతాత్పర్యము. ఉపనిషత్సారమైన భగవద్గీతలో కూడా ఈ శ్రేయస్సు వివరించబడినది.  అంటే శ్రేయస్సు శాశ్వతమైనది, శాశ్వతమైనది మోక్షమని, అదే కోరుకోవాలని స్పష్టము కదా. 

     *ఇంతకీ శ్రేయస్సుకీ, పేర్లు పలకకుండా ఉండటానికి సంబంధం ఏమిటి* అని ఆలోచిస్తే,  పెద్దలకు  మనయెడల కారుణ్యము ఎంతో తెలుస్తుంది.  చెప్పకూడనివేమిటి? తన పేరు. గురువు ఆత్మజ్ఞానము కలగజేసేవాడు.  అతడు తన స్వస్వరూపము తెలిసినవాడు, నామరూపాతీత సర్వాత్మ తత్త్వము. షడ్భావసమాధిలో తను గురువుకన్నా అభిన్నుడు. ఆత్మావై పుత్రనామాసి అని వేదవాక్యము. ధర్మసంతానము పెద్దకుమారుడు అంటారు. అందుకే పెద్దకుమారుని చెప్పారు.  భార్య తనలో సగభాగము. లౌకికముగు సుఖములకు కూడా తానే హేతువు. కనుక ఈ ముగ్గురు తనకన్నాఅభిన్నులు అని బోధ. అలా కాదంటే భార్యాపుత్రులు లౌకిక సుఖములకు హేతువులు. లౌకిక సుఖములు వలదనికదా ప్రయత్నము. ఇది బాగానే ఉంది మరి  అతి దుర్మార్గుడిపేరు ఎందుకు చెప్పకూడదు. వాడిని నామరూపాలతో గుర్తించగానే వాడి దుశ్చర్యలు గుర్తురావటం, తద్వారా కోపావేశాలు కలుగటం, దానిననుసరించి, అరిషడ్వర్గములోని మిగిలినవి వచ్చిచేరటం జరుగుతాయి. ఇది సాధకునికి పతనహేతువులు.  అందుకు వాడి స్మరణ నిషేధించారు. అంటే లౌకికమైన సుఖ, దుఃఖ హేతువులను పేరు కూడా చెప్పవద్దన్నమాట.

     మరి ఎలా చెప్పాలిట?   “నన్ను ఫలానా వారి కొడుకు *అంటారండి* ” “నన్ను ఫలానా వారి తండ్రి *అంటారండి* ” “నన్ను అనంతకృష్ణ *అంటారండీ* ” ఇలా చెప్పాలిట.  దీనివల్ల లాభం?  ఇలా *అంటారండీ* అని చెప్పినప్పుడు  తనకి ఆ భావన లేదు, ఇతరులు అలా పిలుస్తారని. అంటే తాను సచ్చిదానందమైన శుద్ధ చైతన్యమని,  ఈ నామ రూపాలు కేవలము అశాశ్వతమైనవని పదే పదే మనలని మనము హెచ్చరిక చేసుకుంటామని.  పదే పదే ఈ భావన ప్రకటించటం ద్వారా దేహభావము స్థానే ఆత్మతత్వ జ్ఞానము కలుగుతుంది, రూఢి అవుతుంది, అదృష్టము కొలది అనుభవములోకి వస్తుంది. 

     ఇలా ఆధ్యాత్మిక ప్రయాణములో అత్యంత ఆవశ్యకమైన భావసంపద ఈ ఒక్క శ్లోకమును ఆచరించటం ద్వారా కలుగుతున్నదని నాకనిపించింది.  పెద్దలు చర్చించి గుణదోష విచారణ చేయుదురు గాక. స్వస్తి.

కామెంట్‌లు లేవు: