12, మే 2023, శుక్రవారం

ఆర్య చాణక్య

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 57*


అవమాన భారంతో వేడెక్కిన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కాలసర్పపు బుసవలె విషజ్వాలలు గ్రక్కుతుంటే... ఆవేశంతో యెగసెగసి పడుతున్న వక్షస్థలాన్ని అరచేత అదిమిపట్టుకుంటూ..


"ఓరి ! నందా ! సుకల్పనందా ! నీచసద్వంశ సంజాతా...!" సింహగర్జన చేస్తూ... కళ్ళల్లోంచి నిప్పులు రాలుస్తూ, ప్రళయకాల రుద్రునిలా లేచాడు చాణక్యుడు. పరాభవ దావాగ్నికి దహించుకుపోతున్నవాడిలా నిలువెల్లా కంపించిపోతూ "నీ వంశమెలా పుట్టిందో మరిచి... అహంకారం మదోన్మత్తుడివై... సద్భ్రాహణజాతికి చెందిన వేద వేదాంగ వేత్తనైన నన్ను... ఈ చాణక్యుని సర్వపండిత సమక్షంలో శిఖ పట్టిలాగి... బ్రాహ్మణునికి శిరశ్ఛేదము కంటే శిఖమిన్న... అన్న సత్యాన్ని తెలిసీ... శిఖలాగి పరాభవించావు. రాజునన్న గర్వంతో... మదంతో... అవమానించావు... ప్రాణసమానమైన నా శిఖ పట్టి లాగి...." అంటున్నాడు ఆగ్రహావేషాలతో. 


సుకల్పనందుడు మరింతగా రెచ్చిపోతూ "లాగాను... నీ శిఖ పట్టిలాగా ... ఏం చేస్తావ్...?" హంకరించాడు.  


"నాశనం... చాణక్యుని శిఖ పట్టి లాగిన నందవంశ సర్వనాశనం... అధికార గర్వ మదోన్మత్తులైన నందులను సర్వనాశన మొనరించి... సర్వలక్షణ సమున్నతులైన సక్షత్రియుని ఈ మగధ సింహాసనంపై నిలిపేంతవరకూ.. నందుల చేత అవమానించబడి ముడి వీడిన ఈ శిఖని... ఈ చాణక్యుడు ముడివెయ్యడు. పంచభూతాల సాక్షిగా... యజ్ఞోపవీత రూపంలో తేజరిల్లుతున్న గాయత్రి సాక్షిగా... ఇది చణకుల వారి పుత్రుడైన చాణక్యుని శపథం... కుటల మహర్షి సాక్షిగా కౌటిల్యుని ప్రతిజ్ఞ..." అంటూ యజ్ఞోపవీతాన్ని పట్టుకొని భీకర ప్రతిజ్ఞ చేశాడు చాణక్యుడు ఆగ్రహావేషాలతో వూగిపోతూ. 


చాణక్యుని భీషణ ప్రతిజ్ఞని ఆలకించిన యావన్మందీ భీతితో, దిగ్భ్రాంతితో మ్రాన్పడిపోయారు. అది ప్రతిజ్ఞా లేక కాలయముని శాసనమా ? నందవంశ నాశనం చేస్తానని ప్రకటించిన చాణక్యుడు ఉన్నతుడా లేక ఉగ్రస్వరూపుడైన రుద్రుడా ? 


సుకల్పనందుడు మరింతగా ఆవేశపూరితడవుతూ "ఏమిటీ ... నందవంశాన్ని నాశనం చేస్తావా ? పదిమందిలో బోడి ప్రతిజ్ఞలు చేస్తావా ? నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే గదట్రా...?" అంటూ ఒరనించి చివాల్న ఖడ్గాన్ని లాగి చాణక్యుని మీదకు లంఘించబోయాడు. 


"సుకల్పా ! ఆగు.." హెచ్చరించాడు రాక్షసుడు చప్పున తేరుకుంటూ. సుకల్పనందుడు ఆగి అసహనంగా అతని వైపు చూసాడు. రాక్షసుడు నందులను వారిస్తూ "జరిగిన గోల చాలు... బ్రహ్మహత్యాపాతకం కూడా ఎందుకు ? చాణక్యుని వదిలిపెట్టండి" అని మందలించాడు. 


సుకల్పనందుడు అడుగు వెనక్కివేసి "రాక్షసామాత్యులు చెప్పారు కాబట్టి బ్రతికిపోయావు... ఫో... ఈ చోటు విడిచిపో..." అని ఆజ్ఞాపించాడు. 


చాణక్యుడు వికృతంగా భృకుటి ముడిచి "పోతానురాజా, పోతాను. నా ప్రతిజ్ఞా పాలన అనంతరమే మరల ఈ పాటలీపుత్రంలో అడుగుపెడతాను. అంతవరకూ... అనుక్షణమూ ఈ చాణక్యుడు నీ గుండెల్లో చిచ్చు రేపుతుంటాడు. జాగ్రత్త" అని హెచ్చరించి అడుగు ముందుకువేసి, రాక్షసుని వైపు అదోలా చూసి... "రాక్షసామాత్యా... నందుల ఆగ్రహావేశాలకి అడ్డుపడి నీకు తెలియకుండానే నందవంశ నిర్మూలనకు నాకు సహకరించావు. నందుల నాశనం తథ్యం. హరిహరబ్రహ్మాదులు దిగి వచ్చి అడ్డుపడినా అప్రతిహతమైన చాణక్యుని ప్రతిజ్ఞా పాలనముని వారించలేరు. నందవంశ నిర్మూలనం తప్పదు. తప్పదు. ముమ్మాటికీ తప్పదు. అలాంటి విపత్కర సమయంలో కూడా నువ్వు చేసిన ఈ ఉపకారాన్ని గుర్తుంచుకుంటాను రాక్షసా.. గుర్తుంచుకుంటాను.." అని చెప్పి చరచరా బయటికి వెళ్లిపోయాడు చాణక్యుడు. 


ఆతడి ఆఖరి హెచ్చరిక విన్న రాక్షసామాత్యుడు నోట మాట పెగలక స్థబ్దుడైపోయాడు. 


(ఇంకా ఉంది)...🙏

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: