ॐ హనుమజ్జయంతి ప్రత్యేకం - 1/11
(ఈ నెల 14వ తేదీ హనుమజ్జయంతి)
I. హనుమ - శ్రీరాముడు
1. మొదటిసారి వచ్చి చూసి, హనుమ పలికిన మాటలు విన్న శ్రీరాముని వ్యాఖ్య :
ఇట్టి గుణగణములు గల కార్యసాధకులైన దూతలు ఏ రాజువద్ద ఉంటారో,
ఆ రాజు కార్యములు ఆ దూతలచే నిర్వర్తించబడి సిద్ధిస్తాయి.
ఏవం గుణగణైర్యుక్తా
యస్య స్యుః కార్యసాధకాః I
తస్య సిధ్యన్తి సర్వార్థా
దూతవాక్యప్రచోదితాః ॥
- కిష్కింధ 3/35
2. సీతాన్వేషణకై వానర భల్లూక సైన్యం నలుదిశలా పంపబడుతున్నప్పుడు, హనుమగూర్చి శ్రీరాముడు :
మహాతేజశ్శాలియైన ఆ శ్రీరాముడు,
ఉద్యమము చేయడంలో చాల సమర్థుడైన ఆ హనుమంతుని చూచి,
ఇంద్రియములు మనస్సు ఆనందంతో నిండగా,
తన పని పూర్తి అయినట్లు భావించాడు.
పిమ్మట ఆ రాముడు సంతోషిస్తూ,
సీతకు ఆనవాలు కోసమై,
తన నామధేయం చెక్కిన ఉంగరాన్ని హనుమంతునకు ఇచ్చాడు.
తం సమీక్ష్య మహాతేజా
వ్యవసాయోత్తరం హరిమ్ I
కృతార్థ ఇవ సంవృత్తః
ప్రహృష్టేన్ద్రియమానసః ৷৷
దదౌ తస్య తతః ప్రీత| స్వనామాఙ్కోపశోభితమ్ I
అఙ్గులీయమభిజ్ఞానం
రాజపుత్ర్యాః పరన్తపః ৷৷
- కిష్కింధ 44/11,12
3. సీతామాత జాడ తెలుసుకొనివచ్చిన హనుమ గూర్చి శ్రీరాముని ప్రశంస, సత్కారం :
"కార్యము చేయుటకై నియుక్తుడైన హనుమంతుడు ఆ పనిని సాధించినాడు. తనను ఏ మాత్రము తేలికపరచుకోలేదు. సుగ్రీవునకు సంతోషం కలిగించాడు.
హనుమంతుడు ఇప్పుడు సీతను చూచివచ్చి, నన్నూ రఘువంశమునూ, మహాబలుడైన లక్ష్మణునీ ధర్మానుసారము రక్షించినాడు.
కానీ నేను, ఈ ప్రియవార్తను చెప్పిన ఇతనికి తగు ప్రాయమును చేయజాలకున్నాను.
అదియే దీనుడనైన నా మనస్సును చాలా పీడిస్తోంది.
అట్టి మహాత్ముడైన హనుమంతునికి, ఈ సమయమున నేను,
నా సర్వస్వమైన ఆలింగనమును ఇస్తున్నాను."
తన్నియోగే నియుక్తేన
కృతం కృత్యం హనూమతా I
న చాత్మా లఘుతాం నీతః
సుగ్రీవశ్చాపి తోషితః ।।
అహం చ రఘువంశశ్చ
లక్ష్మణశ్చ మహాబలః I
వైదేహ్యా దర్శనేనాద్య
ధర్మతః పరిరక్షితాః ।।
ఇదం తు మమ దీనస్య
మనో భూయః ప్రకర్షతి I
యదిహాస్య ప్రియాఖ్యాతుః
న కుర్మి సదృశం ప్రియమ్ ।।
ఏష సర్వస్వభూతే
పరిష్వఙ్గో హనూమతః I
మయా కాలమిమం ప్రాప్య
దత్తస్తస్య మహాత్మనః ।।
- యుద్ధ 1/10,11,12,13
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
జై హనుమాన్ జై జై హనుమాన్
కొనసాగింపు ....
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
(86399 68383)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి