23, ఆగస్టు 2023, బుధవారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-28🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-28🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


కొల్లాపురమున లక్ష్మీదేవి భర్తయయిన శ్రీమహావిష్ణువును గూర్చి పదేపదే ఆలోచించుచూ కాలము గడుపుచున్నది. తాను కొల్లాపురమున నేకాకిగా నున్నందులకామె లోలోపల మిక్కిలి వెతపడుచున్నది.


 ఈ విధముగా వుంటూండగా ఒకనాడు నారాయణ నామస్మరణచేస్తూ నారదుడు వచ్చివాడు. లక్ష్మీదేవి అతనికి తగిన గౌరవము చేసి లోక వృత్తాంత విశేషములు చెప్పుమని అడిగింది. అడిగినదే తడవుగా నారదుడు సర్వలోక విశేష విషయాలూ లక్ష్మీదేవికి వివరించాడు.


 పద్మావతీ శ్రీనివాసుల సంగతి కూడా తెలిపినాడు. అందులకు ఆమె తనపట్ల శ్రీనివాసునకు ప్రేమాభిమానములు ఏమయినా తగ్గినవా? అని అడిగింది. ‘‘ఏమో! పద్మావతీదేవిని లాలించుటలో, పాలించుటలో నున్న శ్రద్ద నాపట్ల సున్నయగునేమో!’’ అని స్ర్తీ సహజ భావమును నారదుని యెదుట ప్రకటించినది. 


నారదుడు ‘‘శ్రీనివాసునకు నీపైగల అభిమానము చెక్కుచెదరలేదు. అతడును యీ మధ్య నిన్ను పలుమారులు తలచుకొనుట జరుగుచున్నది. ఆయన హృదయమును అర్ధము చేసుకొని నీవు ఆయనను చేరుటయే లోకకళ్యాణప్రద కార్యమగును.’’ అని బోధించి, తన దారిన వెడలెను.


*సవతుల కయ్యము:*


నారదుడు కొల్లాపురమునుండి సరాసరి శ్రీనివాసుని వద్దకు వెడలి, జరిగిన విషయము పూసగ్రుచ్చినట్లు చెప్పినాడు. 


శ్రీనివాసుడు ‘‘నారదా! లక్ష్మీదేవి నాచెంత లేకుండుటవలన నేను కూడా చాలా బాధపడుచున్నాను. ఆమెను చూచి ఎన్నోళ్ళో అయినది. నేనే స్వయముగా వెడలి ఆమెను ఆహ్వానించి తీసుకొని రావలె ననుకొనుచున్నాను. అన్నాడు.


 ‘శుభమస్తు’ అన్నాడు నారదుడు. తాను లక్ష్మీవేవిని తేనున్న విషయాన్ని శ్రీనివాసుడు పద్మావతితో తెలుపగా ఆమె ఏ కళనున్నదోగాని అంగీకరించినది. వెంటనే శ్రీనివాసుడు రాయాబారాల మీద రాయబారాలు జరిపి ఎట్టకేలకు లక్ష్మీదేవిని తీసుకొని వచ్చినాడు.


 శ్రీ వెంకటేశుడు తనకు తాళిగట్టినాడనీ ఆయనకు లక్ష్మికన్న తానే ఎక్కువ అనీ పద్మావతి వాదన. అంతకు ముందెన్నడో స్వర్గమున శ్రీ మహావిష్ణువున్నప్పటి నుండియు ఆయన హృదయ మందిరమున తాను నివసించుట వుండనే వున్నదనీ, కనుక, మహావిష్ణువునకు పద్మావతీదేవి కంటే తానే అధికమైన ప్రియురాలిననీ లక్ష్మీదేవి వాదన, పద్మావతీ, లక్ష్మీదేవి ఒకరినొకరు చిలువలు పలువలు పెంచుకొనుచూ నేనేవో అనుకొనసాగిరి.


 ఆ సవతుల కయ్యమును శ్రీ వెంకటేశ్వరస్వామి ఆపుటకు ప్రత్నించెను. కాని వారి దెప్పుళ్ళూ మాటవిసుర్లూ, సణుగుళ్ళూ ఏ మాత్రమూ తగ్గలేదు. పైపెచ్చు హెచ్చినవి. ఒకరి పుట్టుపూర్వోత్తరాలు మరియొకరు విమర్శించుకొనసాగినారు. ఇక పరిస్థితిని శ్రుతిమించి రాగాన పడనీయ రాదనుకొనినాడు శ్రీనివాసుడు. ఒకనాడు ఏకాంతములో పద్మావతి పూర్వచరిత్ర అయిన వేదవతి కథను లక్ష్మికి చెప్పినాడు.



నివాసుడు చెప్పిన పూర్వకథను విని నిజము తెలుసుకొని లక్ష్మీదేవి శాంతించెను. 


అంతకు శ్రీవేంకటేశ్వరుడు మిక్కిలి ఆనందించి ఆమెతో యిట్లనెను.


 ‘‘దేవీ! నేను వివాహము కొరకు కుబేరుని వద్ద అప్పు తీసుకొంటిని. అది తీర్చు మార్గము తోచుట లేదు. ప్రతీ సంవత్సరము వడ్డీ చెల్లింతునని పత్రము వ్రాసితిని, నీవు నాకొక ఉపకారం చేయవలెను. ఈ కలియుగమున నా భక్తులకు భాగ్యమిచ్చుచుండవలెను.


 వారు ధన గర్వముచే పాపము లొనర్చి ఆపదలపాలైనా దర్శనమును కోరుదురు. నాకు మ్రొక్కులు, ముడుపులు, నిలువుదోపుడులు చెల్లించమని కలలం దగుపడి చెప్పి వారిని కాపాడు చుందును. వారివల్ల ప్రతిసంత్సరము వసూలు చేసిన వడ్డీకాసులను కలియుగాంతము వరకు కుబేరునకు చెల్లించెదను. ఆ తదుపరి అసలు దీర్చి మనము వైకుంఠమునకు చేరుకొందుము. 


అంతవరకు నీవీ పద్మసరోవరమునుండి భక్తులను రక్షించుము’ ఆ మాటలకు లక్ష్మీదేవి మొక్కి ఆనందించి, తాను శ్రీ వేంకటేశ్వరుని వక్షమందుండుటకును తన అంశమును పద్మసరోవరమును వెలయించుటకును అంగీకరించెను. 


శ్రీనివాసుడు దేవశిల్పి విశ్వకర్మను గావించి శుకాశ్రమమునందలి పద్మసరోవరము వద్ద మందిరమును నిర్మింపజేసెను. లక్ష్మీదేవిని ఆ ఆలయమున ప్రవేశింప జేసి శుకునిచే అచ్చడ అగ్రహారమును వెలయింపజేసెను.


ఒక రోజున శ్రీనివాసుని సుందర్శించుటకై తొండమానుడు ఆగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ పద్మావతీ శ్రీనివాసులు అతడిని చాలా గౌరవించిరి. 


తరువాత తొండమానుడు శ్రీనివాసుడితో ‘‘సర్వలోకరక్షకా! సృష్టికారణా! భక్తజనరక్షకా సుందరమైననీ దివ్యరూపాన్నీ చూస్తుంటే, సర్వకాల సర్వావస్థలోనూ యిలా చూస్తూనే జీవించాలనే కోరిక కలుగుతోంది, నాకు దేనిపైనా ఆశలేదు. 


కానీ, నీ పాదసేవపైననే ఆశ కలదు. ఈ దీనుడయిన భక్తునిపై కరుణాదృష్టి ఎప్పుడునూ జూపుతూ వుండండి’’ అన్నాడు. 


అందుకు శ్రీనివాసుడు అంగీకరించి ‘‘రాజా! నీ కోరిక తీరవలెనంటే నీవు నాకై ఒక చక్కని ఆలయం నిర్మించాలి’’ అన్నాడు. అనంతరం తొండమానుని శేషాచలానికి తీసుకొనివెళ్ళి అక్కడ కొంత స్థలమును చూపించి ‘‘రాజా! ఇదిగో ఈ ప్రదేశము నాకు వరాహస్వామిచే యివ్వబడినటువంటింది. ఇందు స్వామిపుష్కరిణికి తూర్పు ముఖంగా ఆలయ నిర్మాణము చేయుము.


 గోపుర, ప్రాకార, సింహద్వార, ధ్వజస్తంబ ఆస్థాన మండపములు-గో, ధాన్య వంటశాలలూ అన్నీ దానిలోనే ఉండేవిధంగా ఆలయం కట్టించు. అన్నట్లు చెప్పడం మరిచాను. ఇక్కడనే ఒక పూలబావి కలదు. అది శిధిలావస్థలో నున్నది. అదే బాగుచేయించు’’ అన్నాడు.


గరుడాద్రి వాస గోవిందా, నీలాద్రి నిలయా గోవిందా, అన్జనాద్రీస గోవిందా, వృషభాద్రీసా గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||28||


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: