23, ఆగస్టు 2023, బుధవారం

కడతేరిన కష్టాలు..

 *కడతేరిన కష్టాలు..*


 "అయ్యగారూ..నాపేరు లలితామాధవి..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయస్వామివారి మందిరానికి రావాలని అనుకుంటున్నాను..ఎలా రావాలో చెపుతారా?"..అంటూ ఆ యువతి ఫోన్ లో అడిగింది..తాను ఏ ఊరు నుంచి రాదల్చుకున్నదో అడిగి..అక్కడినుంచి ఎలా రావాలో వివరంగా చెప్పాను..ధన్యవాదాలు చెప్పింది..


పదిహేను రోజుల తరువాత ఒక గురువారం ఉదయం..కందుకూరు నుంచి వచ్చే మొదటి బస్సులో ఓ అమ్మాయి మందిరం వద్దకు వచ్చింది..ఆ అమ్మాయి వయసు లో చిన్నదాని లాగే కనబడుతోంది..నేరుగా మందిరం లోపలికి వచ్చింది..అక్కడే ఉన్న మా సిబ్బంది ని ఒక రూమ్ కావాలని అడిగింది..తన పేరు లలితామాధవి అని, తాను బెంగుళూరు నుండి వస్తున్నాననీ..రెండురోజుల పాటు ఇక్కడ వుండదలిచాననీ చెప్పింది..మా వాళ్ళు రూమ్ కేటాయించారు..ఆ అమ్మాయి చెప్పిన పేరు విన్న నేను..తనను దగ్గరకు పిలిచి..పదిహేను రోజుల క్రితం ఫోన్ చేసింది మీరేనా..అని అడిగాను.."మీరేనా ప్రసాద్ గారు..?" అని నన్ను అడిగింది..అవును అన్నాను..చేతిలో ఉన్న సంచీ ని ప్రక్కన పెట్టి..రెండు చేతులతో నమస్కారం చేసింది.."అయ్యగారూ..మీరు ఇక్కడే వుంటారు కదా..నేను ఒక గంటలో తయారయ్యి వస్తాను..స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత..మీతో ప్రత్యేకంగా మాట్లాడాలి.." అన్నది..మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉంటానని చెప్పాను..


మరో గంటలోపలే..స్నానాదికాలు ముగించుకొని..మందిరం లోకి వచ్చి..స్వామివారి వద్ద అర్చన చేయించుకొని..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి ప్రదక్షిణ చేసి..నమస్కారం చేసుకొని..నేను కూర్చున్న చోటుకి వచ్చింది.."అమ్మా..ఇప్పుడు చెప్పండి..నాతో ఏదో మాట్లాడాలన్నారు కదా.." అన్నాను..


"సుమారు తొమ్మిది నెలల నుంచీ సోషల్ మీడియా లో ఈ స్వామివారి గురించి చదువుతున్నాను అయ్యగారూ..ఆరు నెలల క్రితం మీ దగ్గరనుంచి పోస్టులో స్వామివారి విభూతి గంధం తెప్పించుకున్నాను..మాది చిత్తూరు ప్రక్కన పల్లెటూరు..నా చిన్నతనం లో..అంటే..నాకు ఐదారు ఏళ్ల వయసప్పుడే మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు..మా అమ్మ కు నేనొక్కదానినే సంతానం..ఎంతో కష్టపడి నన్ను పెంచింది..నాన్న వదిలేసిన తరువాత చిత్తూరు తీసుకొచ్చి..ఇళ్లల్లో పాచిపని చేసి..నన్ను చదివించింది..చిన్న రేకుల షెడ్ లో వుండేవాళ్ళము..నాకు పదో తరగతిలో మంచి మార్కులు వచ్చాయి..ఒక ట్రస్ట్ వాళ్ళు నా చదువుకు సహాయం చేశారు..ఇంజినీరింగ్ పూర్తి చేసాను..దేవుడి దయవల్ల ఉద్యోగం వచ్చింది..ఉద్యోగం లో చేరిన వెంటనే మా అమ్మను తీసుకొచ్చేసాను..నా వద్దే ఉంటున్నది..ఇప్పుడు నా వయసు 24 ఏళ్ళు..పోయిన సంవత్సరం అమ్మకు కడుపులో నొప్పి వచ్చింది..డాక్టర్ల కు  చూపించాను..టెస్టులు చేసి..కడుపులో కణితి ఉంది..ఆపరేషన్ చేయాలన్నారు..తాను బలహీనంగా ఉందనీ..రక్తం తక్కువ ఉందనీ..కొన్నాళ్ళు మందులు వాడి..మళ్లీ రమ్మన్నారు..ఆరోజు చాలా బాధపడ్డానండీ..అమ్మను ఇంటికి తీసుకొచ్చిన తరువాత..ఎందుకో తెలీదు అయ్యగారూ..ఈ మొగిలిచెర్ల స్వామివారు పదే పదే గుర్తుకొచ్చారు..మీరు విభూతి గంధం తో పాటు పంపిన స్వామివారి చిన్న ఫోటోను చేతిలో పట్టుకొని.."మా అమ్మకు ఏ కష్టం రాకుండా చూడు స్వామీ..అమ్మ త్వరగా కోలుకుంటే మొగిలిచెర్ల కు వచ్చి నీ దర్శనం చేసుకుంటాను..నా శక్తి మేరకు అన్నదానం చేయిస్తాను..అని మొక్కుకున్నాను..స్వామివారి విభూతి అమ్మ నుదుటిపై పెట్టాను..అమ్మ డాక్టర్ ఇచ్చిన మందులు ఒక నెల వాడింది..ప్రతిరోజూ విభూతి పెట్టుకునేది..ఆ తరువాత మళ్లీ డాక్టర్ వద్దకు పరీక్షకు వెళితే..మళ్లీ అన్ని టెస్టులూ చేసి..ఆపరేషన్ అక్కర్లేదు..కడుపులోని కణితి కరిగిపోయింది..అని చెప్పారు..ఇదంతా స్వామివారి దయే అని నా నమ్మకం..అందుకే..నా మొక్కు తీర్చుకుందామని ఈరోజు వచ్చాను.." అన్నది..


"ఈరోజు స్వామివారి సమాధి వద్ద నాకు తెలీకుండానే ఏడుపు వచ్చింది..దుఃఖం ఆపుకోలేక పోయాను..మా అమ్మ నాకు దక్కేటట్లు చేసావు స్వామీ..అదే విధంగా నన్నూ మా అమ్మనూ కూడా బాగా చూసుకునే భర్తను కూడా నువ్వే చూడు..మంచి మనిషితో నా వివాహం జరగాలని ఆశీర్వదించు తండ్రీ.." అని కూడా మొక్కుకున్నాను.." అంటూ మళ్లీ కన్నీళ్లు పెట్టుకున్నది..ఆరోజు స్వామివారి మంటపం లోనే పడుకున్నది..ప్రక్కరోజు ఊరు వెళ్లేముందు మళ్లీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..అన్నదానానికి కొంత విరాళం ఇచ్చి వెళ్ళిపోయింది..


మరో మూడు నెలల తరువాత.."అయ్యగారూ..నాకు వివాహం కుదిరింది..వచ్చే నెల లోనే ముహూర్తం పెట్టుకున్నాము..వివాహం కాగానే..మా వారి తో కలిసి మొగలిచెర్ల కు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటాను..శుభలేఖ పంపుతున్నాను..స్వామివారి విగ్రహం వద్ద పెట్టి మా గోత్రనామాలతో పూజ చేయించండి..మీకు ఋణపడిఉంటాను.." అని ఫోన్ చేసింది లలితామాధవి..అలాగే అన్నాను..ప్రక్క నెలలో వివాహం కాగానే భర్తను, తల్లిని వెంటబెట్టుకొని మొగలిచెర్ల కు వచ్చి, శ్రీ స్వామివారి సమాధి ని దర్శించుకొని..అర్చన చేయించుకొని..సంతోషంగా తిరిగివెళ్లింది..


ఆ అమ్మాయి చిన్నతనం నుంచీ పడిన కష్టం..తల్లి గురించి పడిన వేదన..అన్నీ తీరిపోయి..జీవితం ఒక గాడిలో పడింది..అందుకు అన్నివిధాలా మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారే కారణం అని లలితామాధవి నమ్మకం..

ఆ విశ్వాసమే ఆ అమ్మాయికి అన్నివిధాల రక్ష..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: