ంంంం ఆలోచనాలోచనాలు ంంంం సంస్కృత సూక్తి సుధ ంంంం. కోకిలానాం స్వరో రూపమ్. పాతివ్రత్యస్తు యోషితామ్! విద్యా రూపం విరూపిణాం క్షమారూపం తపస్వినామ్!! కోకిలలకు సుస్వరమే అందము. స్త్రీలకు పాతివ్రత్యమే అందము.అందవిహీనునకు మంచి విద్యయే అందము. తపస్సు చేసుకొనే ఋషిపుంగవులకు ఓర్పే నిజమైన అందము. దైవాధీనం జగత్సర్వం. సత్యాధీనంతు దైవతమ్! తత్సత్యముత్తమాధీనం ఉత్తమో మమ దేవతా!! ఈ జగత్తు యావత్తు భగవంతుని అధీనంలో ఉన్నది. ఆ దైవం సత్యం అధీనంలో నిలచివున్నాడు. ఆ సత్యం ఉత్తమముల అధీనమై ఉంది. మరి, అట్టి ఉత్తములే దైవసమానులని భగవంతుని వాక్కు. అభ్యాసానుసరీ విద్యా. బుద్ధిః కర్మానుసారిణీ! ఉద్యోగానుసరీ లక్ష్మీ. ఫలం భాగ్యానుసారిణీ!! అభ్యాసాన్ని బట్టి విద్య వంటబట్టుతుంది. మనకర్మను అనుసరించి మనకు బుద్ధి పుడుతుంది. మనం చేసే వృత్తి లేదా ఉద్యోగాన్ని బట్టి ధనం లభిస్తుంది. మరి ఫలితం ఉన్నదే మన అదృష్టాన్ని బట్టే మనకు లభిస్తుంది. పిబంతి నద్యః స్వయమేవ నాభః. ఖాదంతి నస్వాదు ఫలాని వృక్షాః! పయోధరాస్సస్య మదంతి నైవ. పరోపకారాయ నతాం విభూతయః!! నదులనిండా నీళ్ళున్నా ఆ నీళ్ళను నదులు తాము త్రాగవు. చెట్లనిండా మధురమైన ఫలాలు ఉంటాయి. అయినా ఆ పండ్లను చెట్లు తినవు. మేఘాల నిండా నీరే ఉంటుంది, కానీ ఆ నీటిని మేఘాలు త్రాగవు. లోకంలో ధర్మాత్ములైనవారు తాము సంపాదించిన ధనాన్ని తాము ఉపయోగించుకోకుండా పరుల కోసమే ఉపయోగిస్తారు. అర్థా గృహే నివర్తంతే. శ్మశానే మిత్ర బాంధవాః ! సుకృతం దుష్కృతం చైవ గచ్ఛంత మనుగచ్ఛతి!! మానవుడు చనిపోయిన తరువాత ఆతని భార్య ఇంటివద్దే ఆగిపోతుంది. స్నేహితులు, బంధువులు వల్లకాటిదాకా వచ్చి వీడ్కోలు పలుకుతారు. మనుష్యులు దాటిపోయిన తర్వాత వెంట వచ్చేవి ఆ జీవి చేసుకొన్న పాప, పుణ్యఫలితాలే. కాబట్టి జీవితం అంతా పుణ్యకార్యాలే చేసుకొంటూపోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి