23, ఆగస్టు 2023, బుధవారం

సృష్టి గణపతి

 *నిత్యాన్వేషణ:*                                                                                                                          


సృష్టి గణపతి గురించి వివరాలు తెలుపగలరు?


గణపతిని వివిధ రూపాలలో అర్చించడం సనాతనంగా అలవాటు. ఆదిశంకరులు వారు షణ్మతాలని స్థాపించారు అందులో ఒకటి గాణపత్యం.

హిందువు యొక్క పూజా విధానాల్లో ఎక్కడ కూడా ఇస్లామిక్ విధానాలు లేదా క్రిస్టియన్ విధానాలు ఉండవు. అలాగే ఎవరు - భగవంతుని - ఎందుకోసం ప్రార్థించినా కూడా - ఒకే సంప్రదాయంలో ఆ ప్రార్థన విధానాలన్నీ ఉండటం అన్నది సహజమైన ప్రక్రియ.

విఘ్నాలు పోవడానికి గణపతిని, చదువు కోసం సరస్వతి దేవిని, డబ్బు కోసం లక్ష్మీదేవిని - ఇలా అన్ని సంప్రదాయాలని కలిపి వాడుకోవడం అన్నది కొత్తగా ప్రారంభమైన ప్రక్రియ. పూర్వకాలంలో అలా ఉండేది కాదు.

ఉదాహరణకి వైష్ణవ సంప్రదాయంలో - గణపతిని పూజించరు. విశ్వక్సేనుల వారిని పూజిస్తారు. చదువు కోసం సరస్వతి దేవిని అర్చించరు విద్యాలక్ష్మిని పూజిస్తారు. లక్ష్మీదేవి అష్టలక్ష్మిలుగా భాషిస్తుంది.

సారాంశం - మనిషికి ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా రకరకాల దేవతా స్వరూపాలను అర్చించడం మొదలుపెట్టాడు. అవసరాలు ఎన్నైనప్పటికీ, దేవతా స్వరూపాలు ఎన్ని అయినప్పటికీ — అవన్నీ కూడా ఒకే సంప్రదాయంలో ఉండడం అన్నది పద్ధతి. ఒక సంప్రదాయాన్ని పాటించేవారు వేరొక సంప్రదాయంలోని దేవతా స్వరూపాన్ని అర్ర్చించేవారు కాదు. ఇది వేరొక సంప్రదాయం పట్ల ఉన్నటువంటి నిరసన కాదు. తమ సంప్రదాయం పట్ల ఉన్నటువంటి గౌరవము — నమ్మకము.

తమ సంప్రదాయంలోని పూజా విధానాలు, స్తోత్రాలు ధర్మబద్ధమైనటువంటి తమ కోరికలను అన్నింటిని తీర్చలేదు అన్న ఆలోచన — మనిషిని ఆ సంప్రదాయంలో ఎక్కువ కాలం నిలువనివ్వదు.

అందుకని ప్రతి సంప్రదాయంలో కూడా సగటు మనిషి అవసరాలు తీరడానికి కావలసినటువంటి పూజలో, స్తోత్రాలో మరొకటో ఉంటాయి. అలాగే గణపతి ఆరాధనా విధానాల్లో కూడా.


పైన చెప్పినటువంటి విధానంలో భాగంగా 32 రకములైనటువంటి గణపతి స్వరూపాలున్నాయి. కొన్ని లెక్కల ప్రకారం ఈ 32 గణపతిలలో 23వ వాడు సృష్టి గణపతి. మరికొన్ని పద్ధతుల్లో ఆయన 21వ వాడు.‌ వరుస క్రమంలో ఈ స్వరూపం యొక్క సంఖ్య ఏదైనప్పటికీని — సృష్టి గణపతి అన్నది గణపతి యొక్క స్వరూపాలలో ఒకటి.

పేరు సూచిస్తోంది ఈ గణపతి సృష్టికి మూల కారకుడు. గాణపత్యంలో బ్రహ్మగారు అన్నమాట.


ఈ గణపతి స్వరూప ఆరాధన కేరళలోని తిరునంతపురం ప్రాంతాలలోనూ, కర్ణాటకలో మైసూరు ప్రాంతంలోనూ, తమిళనాడులో సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం స్వామి మలై లోను ఉన్నది.

ఈ గణపతిది జ్యేష్ట నక్షత్రం. ఈయనని ఆరాధిస్తే విచక్షణా జ్ఞానం కలుగుతుంది.

కామెంట్‌లు లేవు: