23, ఆగస్టు 2023, బుధవారం

హిందువుల్లో లోపాలు?

 🌾🌺🌾🌺🌾🌺🌾🌺🌾

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    *హిందువుల్లో లోపాలు?!*


*సమన్వయమే సనాతనం..... సామరస్యమే భారతీయం*



*మతం మారుతున్నది కేవలం హిందువులు మాత్రమే.* 


*మార్చుతున్నది హిందువులను మాత్రమే.*


*ఈ మార్చేక్రమంలో పాఠశాలలు, వైద్యశాలలు అన్నీ వారి - కార్యాలయాలవుతున్నాయి. అయితే ఎలా హిందువులను మాత్రమే మార్చగలుగుతున్నారు! చాలా కాలం క్రితం హింస, అధికార దౌర్జన్యం వంటివి కారణాలు. తరువాత ప్రలోభాలు. కానీ, ఇప్పుడు ప్రలోభాలతోపాటు, మరేవో కారణాలు ఉన్నాయి.*


*ప్రధాన కారణాలు - హిందువులకు కొరవడిన స్వాభిమానం, తమ మతంపై పరిజ్ఞానం లేకపోవడం, ఒక నియమబద్ధమైన మతానుష్ఠానం శూన్యమవడం, గౌరవం లేకపోవడం - ఈ నాలుగు. దీనికి తల్లిదండ్రులే బాధ్యులనాలి. వారిలో ఉన్న ఈ నాలుగు కారణాలచేతనే తమ పిల్లలకు కూడా పరంపరని అందించలేకపోయారు.*


*ఇతర మతాలలో బాలబాలికలకు కూడా వారి మతంపై ఒక అభిమానం, గౌరవం ఉ ంటాయి. హిందూ బాలబాలికలకు ఏ కోశానా ఆ రెండూ గోచరించవు. మతం పట్ల ఒక నిబద్ధత ఉండదు. కేవలం కోరికల కోసం ఒకసారి ఎప్పుడో గుడికి వెళ్లడం తప్ప, పెద్దల ప్రమేయంతో ఒక నియమబద్ధంగా వెళ్లడం, మతగ్రంథాలను అధ్యయనం చేయడం లేదు. పైగా ఆచారాలను హేళన చేయడం, దేవీదేవతలను కించపరచడం, అర్థరహితమైన ప్రశ్నలు వేయడం అలవాటు. అది 'తార్కికబుద్ధి' అనుకుంటాం కానీ, అది శరత్వం అని తెలుసుకోలేం.*


*చిత్రమేమిటంటే - ఈ దేశంలో నాస్తికులలో అత్యధికులు హిందువులు. నాస్తికునికి ఏ మత విశ్వాసమైనా మూఢత్వమే - గుడ్డి నమ్మకమే. కానీ ఈ దేశపు నాస్తికునికి మాత్రం హిందూమతం మాత్రమే అంధవిశ్వాసం కింద లెక్క ఇతర మతాల విశ్వాసాల విషయంలో 'కిమ్మనరు'. పైగా 'వారి మనోభావాలను గౌరవించాలి' అంటారు. చివరకు న్యాయరంగ ప్రముఖుల మాటలూ, ఇలాగే ఉంటాయి. ఆ నాస్తికులకు ఎన్నో ఛానల్స్ పెద్ద పీటలు వేసి వినోదం చేస్తాయి.*


*మన బాలబాలికలు, యువత కూడా ఇతర మతాలవాళ్లను, వారి మతనిష్ఠను చాలా గౌరవిస్తారు.*


*తల్లిదండ్రులు ఏ మతపరిజ్ఞానం పొందే ప్రయత్నం చేయక, పిల్లలకు అందించే ఉద్దేశం లేక పెంచిన తీరు ప్రతి ఇంటా కనిపిస్తున్నదే. బైట బడులకు పంపిస్తున్నారనుకుంటారే కానీ, అక్కడ మతప్రచారకుల కుతంత్ర ప్రభావంతో పిల్లల ఆలోచనాధోరణి విషపూరితమౌతోందని. గమనించడం లేదు.*


*ఈ మధ్య ఒక విద్యార్థినిని ఇంట్లో ఒక పండుగనాడు బొట్టుపెట్టుకోమంటే మొరాయించింది. అంతే కాదు. ఒక ద్వేషభావాన్నే వెళ్లగక్కింది. కారణం ఆమె బడిలో అన్యమత ప్రచారం చేసే ఉపాధ్యాయుల ప్రభావం.*


*ఇంగ్లీష్ భాషా చదువులకోసమని కొన్ని దశాబ్దాల క్రితం నుండే 'కాన్వెంట్'లలో చేరినదాని ప్రభావం, కొన్ని తరాలను సంస్కృతికి దూరం చేసింది. ఇప్పుడు సెక్యులరిజం, మతప్రచార స్వేచ్ఛ వంటివి అడ్డం పెట్టుకుని చొరబాటుగా చేస్తున్న 'బ్రెయిన్ వాష్' సామాన్యం కాదు.*


 *పైగా పిల్లల జీవితం, పాఠశాల నుండి కళాశాలల వరకు క్రమంగా ఇంటి అనుబంధంనుండి దూరం చేస్తున్నదే. వారికి ఇల్లు, పరంపర కంటే బైట వ్యాపకాలు, విద్యార్థి జీవితమే ఎక్కువ. హిందూ గృహాలలో మతవిశ్వాసం పాటించడం, తెలుసుకోవడం కంటే విద్యపైననే ప్రాధాన్యమివ్వాలనే దృఢాభిప్రాయం ఉంది. కానీ, ఇతర మతస్థులకు మతం తర్వాతనే ఏదైనా.*


*మతం మార్చితే చాలా పుణ్యమనీ, ఇతరుల్ని తమ మతస్థులుగా మార్చడం కర్తవ్యమనీ, తమ మతం తప్ప మిగిలినవన్నీ వ్యర్థాలనీ, వాటిని పరిమార్చాలనీ... వారి మత పాఠాలలో స్పష్టంగా, గాఢంగా బోధిస్తారు. అందుకే ఇప్పుడు ప్రచారకులుగా, మత తీవ్రవాదులుగా ఉన్నవారు ఆ మతంలో లీనమైపోయిన ఒకనాటి హిందువులే. వారికి ఆ పాఠాలు ఒంటబట్టాయి.*


*మతం గురించి ఏమీ పట్టని హిందువుల వల్ల తమకు ఎలాగూ ప్రయోజనం లేదని, ఇతర మతాల సంతుష్టీకరణ కోసం పాకులాడే రాజకీయాలు హైందవ ద్వేషానికి కూడా సిద్ధపడుతున్నాయి. హైందవేతర మతాలకు కొమ్ముకాచే నాస్తికుల మూక కూడా ఈ ధర్మానికి పెద్ద శత్రుసమూహమై ఉంది. వారి చేతుల్లో పడ్డ చరిత్ర కూడా వక్రీకరణకు గురై, "హిందువులు ఆటవికులుగా, అనాగరికులుగా, దోపిడీదారులు"గా చిత్రించడం జరిగింది.*


*ఈ దేశసంపదను, విజ్ఞానాన్ని విధ్వంసం చేసి దోచుకున్నవారిని, ఈ దేశీయులను దారుణంగా చంపిన కిరాతకుల్ని గొప్ప నాయకులుగా చూపించడానికి కూడా వెనుదీయ లేదు. వాటిని చదివే విద్యార్థులకు ఈ దేశంపై, మతంపై గౌరవం, స్వాభిమానం ఎలా ఏర్పడతాయి! మన ధార్మిక గ్రంథాలను బోధించే వారిని కూడా ప్రగతి విరోధులుగానో, విజ్ఞానశూన్యులుగానో, ఛాందసులుగానోభావించే ధోరణి కూడా హిందువుల్లోనే వ్యాపించి ఉంది.*


*హిందూమతంపై వందల ఏళ్లు చేసిన దాడులు, విధ్వంసాలు, హింసలు చరిత్ర ద్వారా తెలియనివ్వకుండా చేశారు. తెలియజేస్తే ద్వేషభావం పెరుగుతుందని అపోహ కొందరిది. కానీ చారిత్రక వాస్తవాలను దాచిపెట్టడం ద్రోహం కాదా?*


*జరిగిన విధ్వంసాలను తెలుసుకుంటే, వాటిని చేసినవారి పరంపరకు చెందిన నేటితరం వారిలో కూడా ఒక సానుభూతి, ఇకపై అటువంటి తప్పులు చేయకూడదనే భావం పెరిగే అవకాశం ఉంటుంది. విధ్వంసాలకు, హింసకు గురైన వారి పరంపరకు చెందిన నేటితరం హిందువు తమ వారసత్వ సంపదను పునరుద్ధరించుకునే ప్రయత్నం చేయవచ్చు.*


*కానీ పిల్లలకు వాస్తవాలు తెలియకపోవడం, మతధర్మంపై ఆత్మన్యూనత, గౌరవహీనత పెరగడం హిందూగృహాల్లో సర్వసాధారణమైపోయింది.*


*ఇప్పుడిప్పుడు సామాజిక మాధ్యమాలద్వారా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజ్ఞాన దృక్పథంతో కొందరు మేధావులు చేస్తున్న పరిశోధనల వల్ల, బోధనలవల్ల - నేటితరం హిందువుల్లో కొంత మేరకు మార్పు వస్తున్నదని చెప్పక తప్పదు.*


*కానీ ఇతరుల వంచన, దాడులు పెరుగుతున్నంత వేగంగా, తీవ్రంగా ఈ మార్పు గోచరించడం లేదు. హిందువులు ఇతరుల్ని మార్చడానికి, ద్వేషించడానికి ఉద్యమించనక్కర లేదు - హిందువు హిందువుగా జీవించడానికి, జీవింపజేయడానికి కృషి చేయాలి.*


*వక్రీకరణలకు సమాధానమిస్తున్న పెద్దలమాటల్ని పరిశీలించాలి. పరివ్యాప్తి చేయాలి. స్వాభిమాన హిందూజాతి ఏర్పడాలి.*


       *సామవేదం షణ్ముఖ శర్మ*

కామెంట్‌లు లేవు: