ప్రముఖ సినీ కథానాయిక శ్రీదేవి జయంతి ఈరోజు. ఐదేళ్ల కిందట 2018 ఫిబ్రవరి 24న ఆమె మరణించారు. ఆమె మృతికి సంతాపంగా అప్పట్లో నేను రాసిన కవితను జయంతి సందర్భంగా పంచుకుంటున్నాను.
*దేవత మరణం*
*-డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు*
ఇప్పుడే తెలిసింది
దేవతలూ మరణిస్తారని
ఇంటింటా ఉన్న బొమ్మల డబ్బాలు
ప్రకటిస్తున్నాయి
జన హృదయాధిదేవత
అస్తమించిన సంగతి
గుండెల్లో కొలువైన దేవతలకూ
గుండె నొప్పి వస్తుందా?
మనసులే నెలవైన సురులకూ
మరణం ఉంటుందా?
మూగబోయిన హృదయం
మరు జన్మకైనా తేరుకుంటుందా?
మాటలు రాని మనసుకు
మరపు భాష వస్తుందా?
పదహారేళ్ల వయసులో ఆడి పాడిన
జ్ఞాపకాల దగ్గరే ఆగిపోయిన యవ్వనం
అతిలోక సుందరి వైపే చూసీ చూసీ
నిలిచిపోయిన దృష్టి కోణం
ప్రభాత సూరీడి సమక్షంలో
ఆకు నుండి నీటిగా
బొట్టు బొట్టూ జారిపడే
తుషార బిందు సౌందర్యం
నోరెళ్లబెట్టించే ఆ అందం
కళ్లప్పగించేలా చేసే ఆ అభినయం
పదహారేళ్ల వయసుతో
మనుషుల్ని మైమరిపించిన రూపం
మూడు పద్దెనిమిదుల ఈడులో
దేవుడిని మురిపించిన ఈ వైనం
పై నుండి ఒక సుమధుర స్వరం
“మానవా! బాధపడడం మానవా?”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి