9, సెప్టెంబర్ 2024, సోమవారం

విలువలతో కూడిన ధర్మాలు

 *కుటుంబ ప్రబోధన్*


*మంగళ సంవాదం*!  

ప్రతి వారంలో కనీసం ఒకసారి కుటుంబంలోనీ సభ్యులమందరం కలిసి పిల్లలతో సహా, అనుకూలమైన సమయం లో కలిసి కూర్చుందాం!

ఒక 30 నిముషాలు,ఈ కింద చెప్పిన విధం గా కార్యక్రమం నిర్వహిస్తాం! అదే విధంగా వారానికి ఒక చిన్న కథను జోడిస్తున్నాను. ఈ కథే చెప్పాలి అని కాదు. మీరు ఏదైనా ఒక చిన్న కథను మీరు చెప్పవచ్చు.


                 *ఆకు కూరలు*


    *రవి సాఫ్ట్ వేర్ ఇంజినీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు, స్వయంపాకం చేసుకుంటాడు*.


     *ఆరోజు ఆదివారం. పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు*.


*ఆకు కూరలు, ఆకు కూరలు అని కేక వినిపించింది*. *డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది, పిలిచాడు*.


*"కాస్త గంప దించయ్యా" అన్నది ఆమె.*

"పాలకూర కట్ట ఎంత?" అడిగాడు.*


"*పది రూపాయలకు మూడయ్యా" చెప్పింది అవ్వ*.

"మరీ అన్యాయం... బయట అయిదు ఇస్తున్నారు." అన్నాడు చిరుకోపంగా


"నాలుగు తీసుకో నాయన.." కట్టలు తీసింది అవ్వ

పదిరూపాయలు ఇచ్చాడు. *"గంప కాస్త పట్టయ్యా" అన్నది అవ్వ తనవైపు పట్టుకుని*.


*గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి *


*అవ్వ వెళ్ళిపోయింది.

"ఎంత ఆశో ఈ ముసలిదానికి,ఇవాళో రేపో చావబోతుంది, ఇంకా మూటలు కడుతున్నది"ముసిముసిగా నవ్వుకున్నాడు.*


అప్పటినుంచి అవ్వ వచ్చినపుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో, రెండు వంకాయలో, ఒక దోసకాయో, చిన్న సొరకాయో లాఘవంగా తీయడం మొదలుపెట్టి ముసలిదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు.


*కొన్నాళ్ల తరువాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు. అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది*.


 *ఎనిమిదేళ్ల అమ్మాయి పుస్తకాల సంచీని మోస్తూ "నానమ్మా.. నన్ను స్కూల్ నుంచి పంపేశారు..." ఏడుస్తూ వచ్చింది.*


*అవ్వ కంగారుగా "అయ్యో నా బిడ్డ.. బాబూ...కాస్త గంప కిందికి దించు!" అన్నది రవితో.*


*"ఏడవకమ్మా...నేనొచ్చి చెబుతాలే. రేపు ఫీజు కడతాలే..నా తల్లే... ఇంటికిపొదాం పద" అన్నది పిల్లను వాటేసుకుని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ.*


రవికి అర్ధం కాలేదు. "ఎవరీ పిల్ల?" అడిగాడు అవ్వను.*


*"నా మనవరాలు బాబూ...ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతురును వదిలేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కలవారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు ఎలుకలమందు మింగి చచ్చిపోయింది. మా ఆయన మూడేళ్ళబట్టీ మంచం మీదున్నాడు.* 


 *ఈ నలుసును సాకడానికి చిల్లిగవ్వ లేదు. ఎప్పుడూ బయటకు వచ్చి ఎరగని నేను రోజూ తెల్లారుజామునే లేచి పొలాలకెళ్లి ఇరవై కిలోల కూరలు అరువు మీద తీసుకుని మోస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ అమ్ముకుంటూ పైసాపైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా. మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు.*


 *నెలరోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు. ఈరోజు చూడు బాబు... పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా బయటకి పంపించారు."

అన్నది కళ్ళు తుడుచుకుంటూ*.


*రవి నరాలు మొత్తం బిగుసుకుని పోయాయి. రక్తప్రవాహం స్తంభించి పోయింది. గిరుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు. అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది*. 


*మనసంతా ఉష్ణ జలపాతం అయింది. ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు ధారలు కట్టాయి. "ముసల్దానికి ఎంత డబ్బాశ" అనే తన వెకిలి మాట వెయ్యి గునపాలై దేహాన్ని కుళ్ళబొడిచింది.*


 *ప్రతి కష్టం వెనుకా ఒక కన్నీటి గాధ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు ...*


*పర్సులో చెయ్యి పెట్టాడు. బయటకొచ్చి "అవ్వా ... ఈ ఐదువేలు తీసుకుని మనవరాలి ఫీజ్ కట్టెయ్యి" అన్నాడు. బలవంతంగా అవ్వ చేతిని తీసుకుని.

హంపి మొహంజదారో శిధిలాలకు ప్రతీకలాంటి అవ్వ వృద్ధశరీరం భూకంపం వచ్చినట్లు కంపించింది*.


"*బాబూ ....ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది"* అన్నది వణుకుతూ.


*"అప్పని ఎవరు చెప్పారు? చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను ....* 


 *ఇప్పుడే కాదు .... నీ మనవరాలి చదువు అయ్యేంతవరకు నేనే ఫీజ్ కడతాను ....


 రేపటినుంచి రోజూ నేను ఉన్నా లేకపోయినా పది రూపాయల ఆకు కూరలు ఇచ్చేసి వెళ్ళు" గంప పైకెత్తాడు రవి*.


*మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు. వాకిట్లో ఆరు ఆకు కూర కట్టలు కనిపించాయి*!


*ఇట్టాంటి చిట్టి కధలు మన మనస్సులని కదిలిస్తాయి ..*


*తమ కుటుంబాల కోసం, ఒంటరి మహిళలు, ఒంటరివాళ్లు ఎందరో చిరు వ్యాపారాలు చేసుకుంటూ చిన్నచిన్న పనులు చేసుకుంటూ పల్లెల్లో పట్టణాలలో నిత్యం మనకు సమాజంలో ఎంతో మంది కనిపిస్తారు ,ఉన్నారు.* *అలాంటి వారి పట్ల మనము కాస్త జాలి, దయ, కరుణ చూపి అవసరమున్న వాళ్లకు కాస్త ఆర్థిక సహాయం అందించడం నిజమైన మానవత్వం అనిపించుకుంటుంది...*


*భూమిపై జీవించిన కొన్ని రోజులు మానవత్వంతో జీవిస్తూ మనకున్న దాంట్లో కొద్దిమందికైనా సేవ ,సహాయం, సహకారం చేసుకుంటూ ఉన్నతంగా జీవిద్దాం... వచ్చినప్పుడు ఏం తీసుకురాం... పోయేటప్పుడు ఏమి తీసుకపోం... ఏమంటారు....*


*దానం,ధర్మం, సత్యాన్ని కాపాడితే అవే మనకు రక్షిస్తాయి... ఓ మంచి సమాజ నిర్మాణానికి పునాది ఇవే అనే విషయం మనకు అందరికీ తెలుసు...*



*రేపటి తరానికి బతుకు, భద్రత, ఆత్మ రక్షణ లతోపాటు భారతీయత హిందుత్వం కూడా నేర్పండి.*

మన పిల్లలకు మన ఆస్తులే కాదు...


విలువలతో కూడిన ధర్మాలు ఇవ్వండి....మన సంస్కృతీ 

సాంప్రదాయాల గొప్పదనం చెప్పండి. 


మన ఆహార అలవాట్లను నేర్పండి.

తల్లి తండ్రుల ప్రేమని. బందుత్వాలని అర్థం చేయించండి.


*లోకా సమస్తా సుఖినోభవన్తు!*


మీ 

ఎండెల శ్రీనివాస్ 

ఇందూర్ విభాగ్ కుటుంబ సంయోజక్.

కామెంట్‌లు లేవు: