9, సెప్టెంబర్ 2024, సోమవారం

శ్రీ కాళోజీ నారాయణ రావు గారి 110 వ జయంతి



*''పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది" అని నినదించిన ప్రజా కవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు గారి 110 వ జయంతి నేడు.*


నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు (Kaloji Narayana Rao)1914 లో సరిగ్గా ఇదేరోజున కర్నాటక బీజాపూర్‌లోని రట్టిహళ్లిలో జన్మించారు. కాళోజీ అసలు పేరు రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ముద్దుగా ఈయనను కాళోజీ, కాళన్నా అని పిలుచుకునేవారు. తెలంగాణ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు..


కాళోజీ తెలుగు, ఉర్దూ హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లిష్‌ భాషల్లో అనేక రచనలు చేసి ఖ్యాతి గడించారు. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన రాసిన ‘నా గొడవ’ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలను ఏకరువు పెట్టారు. ఆంధ్ర సారస్వత పరిషత్‌ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమి సభ్యుడిగా కూడా సేవలందించారు. కాళోజీ సేవలకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయగా.. భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం ఆయన సేవలకు గౌరవంగా వైద్యవిశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు హెల్త్‌ సైన్సెస్‌ యూనివర్శిటీ అని పేరు పెట్టింది...

కామెంట్‌లు లేవు: