18, ఆగస్టు 2020, మంగళవారం

*సాక్షి* ఫ్యామిలీ పేజీ:(18-8-2020)


 🌹 *రసావతారుడు జస్ రాజ్*//భారతీయ సంగీత శిఖరం ఒరిగిపోయింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత మేరువు పండిట్ జస్ రాజ్  అనంతలోకాలకు వెళ్లిపోయారు. తాన్ సేన్ ఎలా పాడుతారో మనకు తెలియదు. కబీర్ ఎలా ఉంటారో మనం ఊహించుకోవాల్సిందే. జయదేవుడు నుండి నారాయణతీర్థుడు వరకూ వాగ్గేయకార యోగ స్వరూపులు తమ భక్తిని సంగీతమయం చేసి, ఎలా రచించారో, ఎలా వినిపించారో ఊహా చిత్రాలు గీసుకోవాల్సింది. గంధర్వులు, కిన్నరులు, నారద, తుంబురులనే వారు అసలు ఉన్నారో ? లేరో ? మన మేధకు, అవాహనకు అందదు. ఒక వేళ ఉంటే, వారందరూ వీరి రూపంలో వచ్చారేమో అనిపించే సంగీత స్వరూపం, రసావతారుడు పండిట్ జస్ రాజ్. జయహో! మాతా! అని జస్ రాజ్ గొంతు నుండి వినగానే ప్రేక్షకులు అనిర్వచనీయమైన భావ తరంగాల్లోకి వెళ్లి పోతారు. ఏ రాగం ఎత్తుకుంటే, ఆ రాగ దేవత జస్ రాజ్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.రాగమై, గానమై, నాదమై, ప్రాణమై ధ్వనిస్తుంది. జస్ రాజ్ తాను లీనమై పాడుతూ, వినేవారిని తన్మయులను చేస్తూ, తనలో లీనం చేసుకుంటారు. సంగీతాన్ని ప్రతిభా ప్రదర్శనగా ఏనాడూ చెయ్యలేదు.భూమిపై పద్మాసనం వేసుకొని అనంతమైన ఆకాశంవైపు చూస్తూ, అనంతమైన శక్తి స్వరూపానికి నాదమయమైన అర్చన చేసిన యోగి పండిట్ జస్ రాజ్. దుర్గాదేవిని, శ్రీకృష్ణపరమాత్మను ఉఛ్వాస నిశ్వాసాలలో నిలుపుకొని గానం చేసిన భక్తి సామ్రాజ్య సమ్రాట్ జస్ రాజ్. ఇంట్లో రెండు తంబురలు పెట్టుకొని నాదోపాసన చేస్తున్నా, లక్షల మంది ప్రేక్షకుల మధ్య కచేరీ చేస్తున్నా పండిట్ జీ తీరు ఒకటే.పండిట్ హరి ప్రసాద్ చౌరాసియా, పండిట్ శివ్ కుమార్ శర్మ, ఎల్ సుబ్రహ్మణ్యం మొదలైన దిగ్గజ వాయిద్య విద్వాంసులతో జుగల్ బందీ, త్రిగళ్ బందీ చేసే సమయంలోనూ ఎక్కడా.. నువ్వా? నేనా? అనే ప్రదర్శన ఉండదు. యోగముద్రలో కూర్చొని,ఒక మౌని గానం చేస్తున్నట్లు ఉంటుంది పండిట్ జస్ రాజ్ సంగీత కచేరీ విధానం. సంగీత ప్రదర్శన అని అనడానికి ఏ మాత్రం వీలు లేదు. హిమవత్ పర్వతాల్లో కూర్చొని శివుడి కోసం తపస్సు చేసే భక్తుడిలా ఉంటుంది జస్ రాజ్ పాడుతున్నప్పుడు అక్కడి దృశ్యం. పండిట్ జీ చుట్టూ ఒక గొప్ప వెలుగు (ఆరా) ఉంటుంది. జస్ రాజ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి భజన్లు. శ్లోకాలు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ కొన్ని కోట్లమంది వీటిని వింటూ వుంటారు.డిజిటల్,సీడీ,డివిడి  వివిధ  రూపాల్లో నిక్షిప్తమై ఉన్న ఈ సంపద భారతీయ సంగీత ఖజానా.జస్ రాజ్ గొంతులోనే ఒక ప్రత్యేకమైన మాధుర్యం, మత్తు, ప్రేమతత్త్వం ఉన్నాయి.సంగీతం కోసం భక్తి కాదు.భక్తి కోసమే సంగీతం అని భావించి, గానంలో తరించి దశాబ్దాల పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందిని తరింప జేసిన సంగీతమూర్తి జస్ రాజ్. దర్బారీ,అహిర్ భైరవ్, విలక్షణ తోడి, భాగేశ్రీ, భూప్, మాల్కౌన్స్, కావేరి, యమన్.. ఇలా ఏ రాగంలో పాడుతున్నా, వినేవారిని రసలోకాల్లో విహరింపజేసే ప్రతిభామూర్తి, సంగీతజ్ఞుడు, పండితుడు, కళామూర్తి, పరమ భక్తుడు పండిట్ జస్ రాజ్. మేవాతీ ఘరానాకు చెందిన వీరి సంగీత విద్యా వికాసం అన్యులకు అసాధ్యం.చిన్ననాడే బేగం అక్తర్ గజల్స్ వింటూ స్కూల్ కు ఎగనామం పెట్టేవాడు. జుగల్ బందీలోనూ వినూత్న విన్యాసాలు చేశారు.త్రివేణి, ముల్తానీ, బేహడ, గౌడగిరి మల్హర్, పూర్వీ రాగాలు జస్ రాజ్ గొంతులో, గానంలో కొంగ్రొత్త సొగసులు వలికిస్తాయి. చిదానంద రూప శివోహం శివోహం, ఓం నమో భగవతే వాసుదేవాయ, గోవింద్ దామోదర మాధవేతి, మేరో అల్లా,శ్రీ కృష్ణ మధురాష్టకం మొదలైన గీతాలు  అద్భుత భక్తి సంగీత శిఖర సదృశాలు. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హృదయం మధురం...అని  ఆయనే పాడినట్లు, జస్ రాజ్ గానం మధురం.ఆయన సంగీతం,  చరితం అఖిలం  మధురం. హైదరాబాద్ కు - పండిట్ జీకి ఉన్న అనుబంధం ఆత్మీయ సుగంధం. బాల్యం ఎక్కువ హైదరాబాద్ లోనే గడిచింది. ఆ అనుబంధం చిహ్నంగా, తండ్రి, సంగీత కళాకారుడు పండిట్ మోతీ రామ్ జీ  స్మృతి చిహ్నంగా , ప్రతి ఏటా హైదరాబాద్ లో, కార్తీకమాసంలో సంగీత సమారోహ్ నిర్వహించేవారు.ఆంధ్రప్రదేశ్ లో చివరగా,2014 లో విశాఖపట్నంలో శ్రీ కొప్పరపు కవుల కళా పీఠం నుండి  జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు.ఆ సందర్భంగా జస్ రాజ్ మాట్లాడుతూ తెలుగు నా మాతృభాష అని చెప్పుకున్నారు. తెలుగురాష్ట్రాలు రెండుగా ఏర్పడినా, తెలుగువారంతా ఒక్కటే అని పండిట్ జస్ రాజ్ తెలుగునేలపై తన కున్న మమకారాన్ని చాటుకున్నారు. పండిట్ జస్ రాజ్ కేవలం గాయక కళామూర్తి  కాదు, భక్తాగ్రేసరుల ప్రతిరూపం. పరమ భాగవతోత్తముడు పండిట్ జస్ రాజ్. ఒక మహా అవతారం అనంతనాదంలో విలీనమైంది. -మాశర్మ🙏
*****************

కామెంట్‌లు లేవు: