18, ఆగస్టు 2020, మంగళవారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*అష్టమ స్కంధము - పదమూడవ అధ్యాయము*

*రాబోవు ఏడు మన్వంతరముల వర్ణనము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*13.1 (ప్రథమ శ్లోకము)*

*మనుర్వివస్వతః పుత్రః శ్రాద్ధదేవ ఇతి శ్రుతః|*

*సప్తమో వర్తమానో యస్తదపత్యాని మే శృణు॥6813॥*

*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! వివస్వంతుని (సూర్యుని) పుత్రుడగు శ్రాద్ధదేవుడగు ఏడవ మనువు. గొప్ప యశస్వియైన ఇతడు వైవస్వతుడు అని ఖ్యాతి వహించెను. ప్రస్తుతము ఈ మన్వంతరకాలమే నడుచుచున్నది. అతని సంతానమును గూర్చి వినుము-

*13.2 (రెండవ శ్లోకము)*

*ఇక్ష్వాకుర్నభగశ్చైవ ధృష్టః శర్యాతిరేవ చ|*

*నరిష్యంతోఽథ నాభాగః సప్తమో దిష్ట ఉచ్యతే॥6814॥*

*13.3 (మూడవ శ్లోకము)*

*కరూషశ్చ పృషధ్రశ్చ దశమో వసుమాన్ స్మృతః|*

*మనోర్వైవస్వతస్యైతే దశపుత్రాః పరంతప॥6815॥*

శత్రువులను తపింపజేసే మహారాజా! ఇక్ష్వాకుడు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూషుడు, పృపధృడు, వసుమంతుడు అను పదిమంది వైవస్వతమనువు యొక్క పుత్రులు.

*13.4 (నాలుగవ శ్లోకము)*

*ఆదిత్యా వసవో రుద్రా విశ్వేదేవా మరుద్గణాః|*

*అశ్వినావృభవో రాజన్నింద్రస్తేషాం పురందరః॥6816॥*

రాజా! ఈ మన్వంతరమున ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వేదేవతలు, మరుద్గణములు, అశ్వినీకుమారులు, ఋభవులు అను వారు ప్రధాన దేవతా గణములు. పురందరుడు వారికి ఇంద్రుడు.

*13.5 (ఐదవ శ్లోకము)*

*కశ్యపోఽత్రిర్వసిష్ఠశ్చ విశ్వామిత్రోఽథ గౌతమః|*

*జమదగ్నిర్భరద్వాజ ఇతి సప్తర్షయః స్మృతాః॥6817॥*

ఈ మన్వంతరమున కశ్యపుడు, అత్రి, వసిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అను వారు సప్తర్షులు.

*13.6 (ఆరవ శ్లోకము)*

*అత్రాపి భగవజ్జన్మ కశ్యపాదదితేరభూత్|*

*ఆదిత్యానామవరజో విష్ణుర్వామనరూపధృక్॥6818॥*

ఈ మన్వంతరమునందు కశ్యపుని ధర్మపత్నియైన అదితిగర్భమున విష్ణుభగవానుడు *వామన* రూపమున అవతరించెను. ఆయన ఆదిత్యులతో అందఱి కంటెను చిన్నవాడు.

*13.7 (ఏడవ శ్లోకము)*

*సంక్షేపతో మయోక్తాని సప్తమన్వంతరాణి తే|*

*భవిష్యాణ్యథ వక్ష్యామి విష్ణోః శక్త్యాన్వితాని చ॥6819॥*

రాజా! నేను ఏడుమన్వంతరములను గూర్చి సంక్షిప్తముగా ఇదివరకే చెప్పియుంటిని. ఇప్పుడు శ్రీహరి యొక్క శక్తిమంతమైన రాబోవు ఏడు మన్వంతరములను గురుంచి వర్ణించెదను.

*13.8 (ఎనిమిదవ శ్లోకము)*

*వివస్వతశ్చ ద్వే జాయే విశ్వకర్మసుతే ఉభే|*

*సంజ్ఞా ఛాయా చ రాజేంద్ర యే ప్రాగభిహితే తవ॥6820॥*

మహారాజా! వివస్వంతునకు (సూర్యునకు) సంజ్ఞా, ఛాయ అను భార్యలు ఉండిరని నేను ఇదివరలో (ఆరవ స్కంధమున) తెలిపియుంటిని. వీరిద్దరు విశ్వకర్మయొక్క కుమార్తెలు.

*13.9 (తొమ్మిదవ శ్లోకము)*

*తృతీయాం వడవామేకే తాసాం సంజ్ఞాసుతాస్త్రయః|*

*యమో యమీ శ్రాద్ధదేవశ్ఛాయాయాశ్చ సుతాంఛృణు॥6821॥*

*13.10 (పదియవ శ్లోకము)*

*సావర్ణిస్తపతీ కన్యా భార్యా సంవరణస్య యా|*

*శనైశ్చరస్తృతీయోఽభూదశ్వినౌ వడవాత్మజౌ॥6822॥*

సూర్యునికి *బడబ* అను మరియొక పత్ని గలదని కొందరు తెలిపెదరు. సూర్యపత్నియైన సంజ్ఞయందు యముడు, యమి (పుత్రిక), శ్రాద్ధదేవుడు అను వారు జన్మించిరి. ఛాయయందు గూడ సావర్ణి, శనైశ్చరుడు అను పుత్రులును, తఫతి అను పుత్రియును కలిగిరి. ఈమె సంవరణునికి పత్ని అయ్యెను. సంజ్ఞయందు, బడబయొక్క రూపమును ధరించినప్పుడు ఆమెకు ఇద్దరు అశ్వినీ కుమారులు జన్మించిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదమూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
*******************

కామెంట్‌లు లేవు: