13, ఆగస్టు 2020, గురువారం

భగవద్గీత మానవుడి భవిత*.


గీత అంటే కేవలము కృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణ మాత్రమే కాదు, ప్రతి హృదయములో నిరంతరము జరుగుతున్న సంఘర్షణ.
నిరాశా నిస్పృహలతో మునిగిన వారికి ఉత్సాహాన్ని కలిగించేది గీత. ఆపదలో ఉన్నవారి హృదయాలను ధైర్యముతో తట్టి లేపేది గీత. సంశయాలతో కొట్టుమిట్టాడుతున్న వారి శంకలన్ని పొడమార్చేది గీత. కన్నీరు కార్చే వారికి ఓదార్పు గీత.
అజ్ఞానమనే చీకట్లతో సహవాసము చేస్తున్న వారికి వెలుగు జ్యోతి గీత.
శ్రీ కృష్ణుని హృదయావిష్కారము గీత. గీత అంటే గానము చేయబడేది అని అర్థము.
ఆనందముగా ఉన్నప్పుడే గానము సాధ్యమవుతుంది, కావున భగవద్గీత లక్ష్యము ఆనందము.
మానవ జీవితములో శోకాన్ని తొలగించి ఆనందాన్ని అనుభవించేందుకు త్రోవను చూపించడమే శ్రీ మద్ భగవద్గీత ముఖ్యోద్దేశ్యము.
త్యాగమంటే అన్నిటినీ వదిలేయడం. త్యాగానికి నిదర్శనం సన్యాసం. అవుతే నేటి కాలంలో సన్యాస జీవితం అరుదైపోయింది/కనుమరుగై పోయింది. అందుకని ఇది మనకు సంబంధించింది కాదనే అభిప్రాయానికి తావులేకుండా త్యాగానికి నిర్వచనమిచ్చింది గీత.
*కర్మలను ఆచరించి, వాటి ఫలితాన్ని భగవంతునికి సమర్పించడమే త్యాగం* అని *యస్తు కర్మఫలత్యాగి స తాగీత్యభిధీ యతే* అంటోంది గీత...ఫలితాన్ని ఆశించక కర్మలను చేయడమే సన్యాసమని గీతా వచనము.
*ఎవరికి వారు,  వారి వారి విధులను చక్కగా నిర్వహిస్తూనే, దీనికి అర్హులు కావచ్చనేది దీని పరమార్థము*.
*సమత్వం యోగ ఉచ్చతే* మరియు *యోగ కర్మ సు కౌశలమ్*...తాను చేసే పని విజయవంతమైనా, విఫలమైనా సమానంగా స్వీకరించ గల్గే మానసిక స్థితినే యోగం అంటోంది గీత.
*మనిషిని భగవంతునితో ఏకం చేసే ప్రతి పని యోగమే*

కామెంట్‌లు లేవు: