13, ఆగస్టు 2020, గురువారం

సింధూరపు పూజ - తమలపాకుల పూజ

హనుమత్పూజలో చాలామందికి తెలిసిన అంశమే సింధూరపు పూజ అని. అదేవిధంగా తమలపాకుల పూజ అని. ఇవన్నీ ప్రసిద్ధి చెంది ఉన్నాయి అని మంత్రశాస్త్రం చెప్తున్నది. అంతేకాదు. ఆంజనేయస్వామి వారి విగ్రహాన్ని అర్కముతో చేసి అదీ శ్వేతార్కంతో చేసి గానీ పూజిస్తే ఇది ఉమాసంహిత అని మంత్రశాస్త్రంలో చెప్పబడ్డ అంశం. 
అర్కమూలేన కుర్వీతా హనుమత్ ప్రతిమాన్ సుధీః!
యః కరోతి నరో భక్త్యా పూజాం శక్త్యా హనూమతః!
నశస్త్ర భయమాప్నోతి భయం వాప్యంతరిక్షజం!
పుత్రపౌత్రాది సహితః సర్వసౌఖ్యమవాప్నుయాత్!!
 దీని అర్థం అర్కమూలేన - తెల్లజిల్లేడుయొక్క మూలముతో ఆంజనేయ మూర్తిని తయారుజేసి (విగ్రహంగా చెక్కి) దానిని నిరంతరం పూజించినట్లైతే వాడికి ఆయుధాల వల్ల ఏ ప్రమాదమూ జరుగదు. అలాగే ఉపద్రవాలు, ఉత్పాతాలు అతనికి ఎదురుకావు. పుత్రపౌత్రాది సంపదతో అన్ని సౌఖ్యములు పొందుతాడు అని ఉమాసంహిత అనే మంత్ర శాస్త్రంలో సాక్షాత్తు శివుడు చెప్పినటువంటి మాట ఇది. అయితే తెల్లజిల్లేడుతో హనుమంతుడికి పూజ అనేది చాలామందికి తెలియదు. తెల్లజిల్లేడుతో గణపతి పూజ చాలామందికి తెలుసు. రెండూ ఒక్కటే అని ఇప్పుడు తెలుసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహదోషాలకి పరిష్కారం చెప్తూ శనివారం పూట ఈ శ్వేతార్కంతో ఉన్న హనుమంతునికి సింధూరంతో పూజ చేసి అష్టోత్తర శతనామాలతో ఆ సింధూరాన్ని గానీ ధారణ చేసినట్లైతే ఎలాంటి శని దోషమైనా పోతుంది. శనిదోషాన్ని పోగొట్టేశక్తి తొండంరాయుడికీ, తోకరాయుడికీ ఉంది. వాళ్ళిద్దరికీ ఆ శక్తి ఉందిట. గ్రహాన్ని control చేయగలరు. గ్రహాలు, జ్యోతిష్యము అన్నీ కూడా ఈయన అధీనంలో ఉంటాయి. విరాడ్రూప ఆంజనేయ మూర్తి వర్ణన కూడా మనకి కనపడుతోంది. బ్రహ్మదేవునికి చూపిస్తాడట తన విరాడ్రూప స్వరూపాన్ని. ఇది సంహితా గ్రంథంలో చూపిస్తారు. అప్పుడు స్వామియొక్క వాల వర్ణన చాలా విశేషంగా ఉంటుంది. అయితే హనుమంతుడి తోక వర్ణన గణపతి సహస్రంలో కనపడుతుంది. ఆశ్చర్యం. "జ్యోతిర్మండల లాంగూలః" అని ఒకమాట అన్నారు. అయితే ఆ తోక హనుమంతుడిదా? గణపతిదా? - గణపతియొక్క హనుమద్రూపానిది. ఇదొక రహస్యం. కథలు చెప్పేవాడికి తెలియదు. ఉపాసన చేసేవాడికి తెలుస్తుంది. అటువంటి ఉపాసకులలో గొప్పవాడు, నాదోపాసక చక్రవర్తి త్యాగరాజస్వామి వారు. ఆయన గణపతిని స్తుతిస్తూ ఒక కీర్తన వ్రాస్తారు. శ్రీగణనాథం భజామ్యహం అనే కీర్తనలో కుంజరముఖం ఆంజనేయావతారం గుడాకరం అని చూపిస్తారు.  అందులో ఆంజనేయావతారం అని గణపతిని స్తుతించడంలోనే ఆంతర్యాన్ని చూపించాడా మహానుభావుడు.

కామెంట్‌లు లేవు: