శ్రీకృష్ణ భగవానుడు సర్వాంతర్యామి. అందరి మనోగతాలను తెలుసుకోగలడు. ఆయనను చూసేసరికి ద్రౌపది కి పోవుచున్న ప్రాణాలు లేచి వచ్చినట్లు అయింది. అప్పుడు ద్రౌపది సంగ్రహంగా ఆయనకు విషయం చెప్పింది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతో తొందరను ప్రదర్శిస్తూ ఆమె తో అమ్మా! ఆ మాటలు తర్వాత చెప్పవచ్చును. ముందు నాకు తినడానికి ఏమైనా పెట్టమ్మా! నాకు ఆకలి బాధ ఎక్కువ గా ఉంది. నేను ఇప్పుడు ఎంత దూరం నుండి అలసి సొలసి వచ్చేనో నీకు తెలియదు. ఆ మాట విని ద్రౌపది సిగ్గుతో క్రుంగిపోయింది. ఆయనకు బదులు చెప్పలేక, ఇప్పుడే నేను భోజనం చేసి లేచాను, అక్చయ పాత్ర లో ఏమీ మిగుల లేదు. అని చెప్పింది. ఏదీ? ఆ పాత్ర ను నాకు ఒక్క సారి చూపించు అన్నాడు, పరమాత్ముడు. ద్రౌపది ఆ పాత్ర ను తెచ్చి ఆయనకు ఇచ్చింది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ పాత్రను చేతిలో ఉంచుకుని పరిశీలించగా, అందులో ఒక ప్రక్కన ఒక కూరాకు అంటుకుని కనపడింది. దానిని తన నోట్లో బెట్టుకొని ఆయన ఈ కూరాకుతో జగదాత్మస్వరూపుడు
యఙ్ఞభోక్త అయిన పరమేశ్వరుడు వెంటనే త్రుప్తి చెందుగాక! అని పలికాడు..తరువాత ఆయన సహదేవుడు ని పిలిచి అతని తో సహదేవా! నీవు పోయి మునీశ్వరులు ను భోజనానికి పిలుచుకుని రా! అని చెప్పాడు. అప్పుడు సహదేవుడు గంగాతీరానికి వెళ్లి చూడగా అక్కడ అతనికి ఒక్క ముని కూడా కనిపించలేదు. జరిగిన విచిత్రం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు కూరాకును నోటబెట్టుకొని ఆ సంకల్పం పఠించినవేళ ఆ మునీశ్వరులు అందరూ నీటిలో నిలిచి అఘమర్షణ మంత్రాలు పఠించుకొంటూ ఉన్నారు. ఆ సమయంలో వారికి అకస్మాత్తుగా తమ ఉదరాలు అన్నీ పీకలవరకూ భోజనాలు చేసినట్లు అనుభూతి కలిగింది. వారు పరస్పరమూ ఒకరి మొఖం ఒకరు చూసుకుని ఇక మనం అక్కడ కు పోయి ఏమి భోజనం చేయగలం అని చెప్పుకున్నారు. మారుమాట్లాడకుండా అటు నుండి అటే వెళ్లిపోవడం శ్రేయస్కరం అని దుర్వాసుడు భావించుకున్నాడు. కారణం ఏమిటంటే పాండవులు భగవద్భక్తులని అతనికి తెలుసును. తన విషయంలో అంబరీషుని ఇంట్లో జరిగిన సంఘటన అతనికి ఎన్నటికినీ మరపునకురాదు. ఆ సంఘటన జరిగింది మొదలు అతనికి భగవద్భక్తులు అంటే భయం కలగడం మొదలైంది. తోడనే అతడు శిష్యసమేతంగా అచ్చట నుంచి కదిలి వెళ్ళిపోయాడు. వారు వెళ్ళుతున్న సమాచారం అక్కడ ఉన్న ఇతర మహర్షుల వలన సహదేవునకు తెలిసింది. అతడు వెళ్లి వచ్చి ఆ విషయం ధర్మనందనకు చెప్పాడు. ఈ విధంగా శ్రీక్రుష్ణునియందు ద్రౌపది కి ఉన్న భక్తి కారణంగా పాండవుల నెత్తిమీదనుండి ఒక మహాభయంకరమైన ఆపద తొలగింది. ఈ విధంగా ఆ పరమ పురుషుడు తన శరణాగత వాత్సల్యము ను వెల్లడించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి