31, అక్టోబర్ 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం

 *30.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఇరువదియవ అధ్యాయము*


*జ్ఞాన, కర్మ, భక్తి యోగములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*20.17 (పదిహేడవ శ్లోకము)*


*నృదేహమాద్యం సులభం సుదుర్లభమ్ ప్లవం సుకల్పం గురుకర్ణధారమ్|*


*మయానుకూలేన నభస్వతేరితం పుమాన్ భవాబ్ధిం న తరేత్స ఆత్మహా॥13022॥*


(ఆద్యమ్) మొదటగా మానవదేహము అత్యంత దుర్లభమైనదని గ్రహింపవలెను. అయితే భగవంతుని అపారమైన కృపచేత అది ఎంతయో సులభమైనది. సకలశ్రేయఃఫలములను పొందుటకు ఇదియే ముఖ్యసాధనము. అగాధమైన సంసారసాగరమును సులభముగా దాటిపోవుటకు ఇదియే దృఢమైన నౌక. ఈ నావకు గురువే కర్ణధారుడు. అనుకూలవాయువుగా తోడ్పడుటకు స్వయంగా భగవంతుడే సిద్ధంగా ఉన్నాడు. దైవకృపచే సకలసౌకర్యములు లభించుచున్నవి. కావున వెంటనే - ఏమాత్రమూ జాగు సేయకుండా భవసాగరమును దాటిపోవుటకు సాధకుడు ఉద్యమింపవలెను. ఇంతటి సువర్ణావకాశమును వదిలిపెట్టి చేతులు ముడుచుకొని యుండువాడు ముమ్మాటికీ ఆత్మఘాతకుడే.


*20.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*యదాఽఽరంభేషు నిర్విణ్ణో విరక్తః సంయతేంద్రియః|*


*అభ్యాసేనాఽత్మనో యోగీ ధారయేదచలం మనః॥13023॥*


పురుషుడు కామ్యకర్మల ఫలముగా దుఃఖములకు లోనై వాటియెడ విరక్తుడైనప్పుడు బాహ్యాభ్యంతర ఇంద్రియములను జయించి (జితేంద్రియుడై) యోగమునందు స్థితుడు కావలెను. క్రమముగా అభ్యాసముద్వారా మనస్సును నిశ్చలముగా నాయందే లగ్నముచేయవలెను.


*20.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*ధార్యమాణం మనో యర్హి భ్రామ్యదాశ్వనవస్థితమ్|*


*అతంద్రితోఽనురోధేన మార్గేణాత్మవశం నయేత్॥13024॥*


సాధకుడు మనస్సును స్థిరముగా నిలుపుటకు ప్రయత్నించుచున్నను అది చంచలమై ఇటునిటు పరుగెత్తుచుండును. అప్పుడు అతడు వెంటనే అప్రమత్తుడై ఆ మనస్సును బుజ్జగింపువంటి తగిన ఉపాయములద్వారా వశపఱచుకొనవలెను.


*20.20 (ఇరువదియవ శ్లోకము)*


*మనోగతిం న విసృజేజ్జితప్రాణో జితేంద్రియః|*


*సత్త్వసంపన్నయా బుద్ధ్యా మన ఆత్మవశం నయేత్॥13025॥*


ఇంద్రియములను, ప్రాణములను వశమునందు ఉంచుకొని, మనస్సుయొక్క విశృంఖలత్వమును అదుపు చేయవలెను. అందులకై సాత్త్వికాహారములను స్వీకరించుట మొదలగు ఉపాయముల ద్వారా సత్త్వసంపన్నమొనర్చిన బుద్ధితో మనస్సును వశపరచుకొనవలెను.


*20.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*ఏష వై పరమో యోగో మనసః సంగ్రహః స్మృతః|*


*హృదయజ్ఞత్వమన్విచ్ఛన్ దమ్యస్యేవార్వతో ముహుః॥13026॥*


మొండికేసి దారికిరాని గుర్రమును రౌతు తన మనోభావములకు అనుగుణముగా తిన్నతిన్నగా బుజ్జగించుచు సరియైన దారికి మళ్ళించినట్లు అటునిటు పోవుచున్న మనస్సును మెల్లమెల్లగా సంయమనమొనర్చి భగవత్పరము గావించుటయే పరమయోగము.


*20.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*సాంఖ్యేన సర్వభావానాం ప్రతిలోమానులోమతః|*


*భవాప్యయావనుధ్యాయేన్మనో యావత్ప్రసీదతి॥13027॥*


సాంఖ్యశాస్త్రమునందు తెలిపినరీతిగా ప్రకృతినుండి శరీరపర్యంతము జరుగు సృష్టిక్రమమును మరియు శరీరమునుండి ప్రకృతివరకు జరుగు లయక్రమమునుగూర్చి (అనులోమ ప్రతిలోమ క్రమముగా) చక్కగా మనస్సునందు తర్కించుకొనవలెను. మనస్సు ప్రశాంతమై స్థిరత్వమును పొందువరకును ఈ ప్రక్రియను కొనసాగించుచునే యుండవలెను.


*20.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*నిర్విణ్ణస్య విరక్తస్య పురుషస్యోక్తవేదినః|*


*మనస్త్యజతి దౌరాత్మ్యం చింతితస్యానుచింతయా॥13028॥*


సాంసారిక విషయములవలన దుఃఖముల పాలైనవాడు విసుగు చెంది క్రమముగా వాటియందు విరక్తుడగును. అప్పుడు అతడు తన గురుజనుల ఉపదేశములను చక్కగా అవగాహన చేసికొని పదేపదే తన ఆత్మస్వరూప ధ్యానమనందే నిమగ్నుడగును. ఇట్లు అభ్యసించుటద్వారా మనస్సుయొక్క చంచలత్వము దూరమగును.


*20.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*యమాదిభిర్యోగపథైరాన్వీక్షిక్యా చ విద్యయా|*


*మమార్చోపాసనాభిర్వా నాన్యైర్యోగ్యం స్మరేన్మనః॥13029॥*


'యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు' అను అష్టాంగయోగ మార్గములద్వారాను, తత్త్వవిమర్శనాత్మక విద్యద్వారాను, నన్ను అనన్యభక్తితో ఉపాసింపవలెను. అట్లు ఒనర్చుట వలన మనస్సు చాంచల్యమును వీడి ప్రశాంతమై పరమాత్మయందు లగ్నమగును. అంతేగాని, మనస్సు నిశ్చలమగుటకు మఱియొక ఉపాయములేదు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: