31, అక్టోబర్ 2021, ఆదివారం

*దాసో-హం*

 *దాసో-హం* 

💫🌻💫🌻💫🌹🌈🌹🌻💫🌻💫


💫 *దాసోహం* అన్న పదంలో *అహం* ఒక భాగం. విడదీయరాని అక్షర సమాహారం. 


💫 *అహం* అంటే నేను. నేను నీ దాసుణ్ని అని మనసా, వాచా చెప్పగలగాలి.


💫 *'దాసోహం'* అన్నమాటను ఒక మంత్రంగా స్మరించడం, గుణాత్మకంగా మరీమరీ గుర్తు చేసుకోవడం, మనసును ఏకాగ్రం చేసి అక్కడే నిలపడం - చెప్పినంత తేలిక కాదు.


💫 *శ్రవణం,* *మననం,* *ధ్యానం,* అనేవి *భక్తియోగ* సాధన కు కలిసివచ్చే *భౌతిక,* *మానసిక,* *ఆంతరంగిక* ప్రక్రియలు. *దాసోహానికి* *దారిదీపాలు.*


💫 ఒకరికి తలవంచి నమస్కరించడం బానిసత్వానికి నిదర్శనం. 


💫 ఒకరి గొప్పతనాన్ని బేషరతుగా ఒప్పుకొని శరణాగతి కోరడం భక్తి పరాకాష్ఠకు సంకేతం.


💫 ప్రతి నిమిషం, ప్రతి విషయంలోనూ బయటపడి అడ్డుకునేది *'అహం'.* 


💫 ‘నన్ను అడిగావా?’ అని నిలదీయడం, ‘నాకు తెలియదే!’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించడం... అదే *అహంకారం* !


💫 *పూర్ణ దాసత్వం* ఆషామాషీ కాదు. 


💫 *నవవిధ భక్తి మార్గాల* లో *దాస్యానికి* సముచితమైన స్థానం ఉంది. 


💫 నమ్రతా భావంతో కూడిన వినయ విధేయతల త్రివేణీ సంగమంతో సమానమైనది *దాస్య భక్తి.* 


💫 నిజమైన హరిదాసుడు *దాసోహం* అనడానికి, అలా కావడానికి ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాడు. తన అస్తిత్వాన్ని పోగొట్టుకుని పరతత్త్వంలో లీనం కావడానికి - పాలలో పంచదారగా మారాలి. దాసుడికి అది ఒకరకమైన జీవన్ముక్త దశ. 


💫 అహంకారం బండరాయిలా ఎప్పటికప్పుడు అడ్డుతూ, చాపకింద నీరులా తెలియకుండా తడిగట్టి పడగొట్టుతుంది.


💫 *హరిదాసు* అనగానే... సంక్రాంతి పండుగ రోజుల్లో తలపైన పాత్ర, చేత చిడతలు, భుజాన తంబురా వేసుకుని *'హరిలో రంగ హరి'* అంటూ చిందులు వేసే ఆసామీ కళ్లకు కడతాడు. 


💫 *హరిదాసు* అన్న బిరుదు బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షికే చెల్లుతుంది. సదా నారాయణ నామస్మరణలో కాలంగడిపే నారదుడి కన్నా మిన్న అయిన విష్ణుభక్తుడు ఎవరైనా ఉన్నారా? 


💫 *రామదాసు* అన్న పేరు మన దేశంలో మిక్కిలి జనప్రియమైన నామం. *రామదాసు* అంటే *రామబంటు* - హనుమంతుడు. ఈ పేరులో రాముడు తప్ప మనకు హనుమంతుడు కనిపించడు. ఆ పదాన్ని విడదీసి శల్యపరీక్ష చేస్తేగాని అందులో దాగిన *దాసుడు- ఆంజనేయుడు* బయటికి రాడు. 


💫 *తులసీదాసు* - *తులసికి దాసుడు* శ్రీమహావిష్ణువు. తులసిలో కలిసి ఉన్న ఆ పరమాత్మను స్మరించడానికి, మనోనేత్రంతో దర్శించడానికి *'కృష్ణ తులసి'* అన్న ప్రయోగం మనకు ప్రయోజనకరంగా కలిసి వస్తుంది. రుక్మిణి ఒక్క తులసిదళంతో కృష్ణ తులాభారంలో నెగ్గింది.


💫 మనల్ని మనం *దాసుడిగా* గుర్తించడానికి ముందుగా *మోహనిద్ర* నుంచి మేలుకుని బయటపడాలి. 


💫 చెలికాడు, శిష్యుడు, బావమరిది అయిన అర్జునుడికి తాను *కృష్ణదాసుడిని* అని తెలుసుకోవడానికి, పద్దెనిమిది అధ్యాయాలు, ఏడువందల శ్లోకాలు అవసరమయ్యాయి. 


💫 చిట్టచివరికిగాని, ‘ఓ అచ్యుతా! నువ్వు చెప్పినట్లే చేస్తాను’ అన్న సమాధానం కిరీటి నోటంట రాలేదు. 


💫 *దాస* సంప్రదాయంలో సర్వోత్తమమైన భక్తి నివేదనా గరిమకు ఉదాహరణ *దాసకూటం* పేరు చెప్పగానే మన తలపులో మెరుపులా *కనకదాసు* కనిపిస్తాడు. 


💫 ఆ భక్త శిఖామణి కోసం ఉడుపిలోని బాలకృష్ణుడు తన దిశను మార్చుకుని, కనకదాసు దశను మార్చాడు. క్షణంలో భక్తుడికి మోక్షం ప్రసాదించాడు. 


💫 *పురందరదాసు* శ్రీకృష్ణ దేవరాయల రాజధాని హంపీ క్షేత్రంలో తన కీర్తనలు వినిపించి, స్వర సేవకులందరికీ ఆదర్శంగా స్ఫూర్తిమన్మూర్తిగా ఈనాటికీ సంప్రదాయ భక్తి సంగీతపు మెరుపులు కురిపిస్తున్నాడు. 


💫 బద్ధ జీవులను *భక్తిసేవ* లతో తన అక్కున చేర్చుకోవడానికి భగవంతుడు సర్వదా సిద్ధంగా ఉంటాడు. ఆయన *దాసులకు దాసుడు* !



*సేకరణ:* 

💫🌻💫🌻💫🌹🌈🌹🌻💫🌻💫

కామెంట్‌లు లేవు: