31, అక్టోబర్ 2021, ఆదివారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*484వ నామ మంత్రము* 31.10.2021


*ఓం డాకినీశ్వర్యై నమః* 


విశుద్ధి చక్ర అధిష్ఠానదేవత అయిన డాకినీ స్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *డాకినీశ్వరీ* యను అయిదక్షరముల నామ మంత్రమును *ఓం డాకినీశ్వర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లికరుణచే ఆయురారోగ్యములు, శాంతిసౌఖ్యములు, భోగభాగ్యములు, కీర్తిప్రతిష్టలు సంప్రాప్తమగును.


*విశుద్ధిచక్రనిలయా* యను 475వ నామ మంత్రము నుండి *అమృతాది మహాశక్తి సంవృతా* యను 483వ నామ మంత్రము వరకూ, విశుద్ధిచక్రాధిష్ఠానదేవతయైన డాకినీశ్వరియొక్క విశేషణములు (లక్షణములు) చెప్పబడినవి.


ఈ డాకినీశ్వరి *ఆరక్తవర్ణా* (476వ) యను నామ మంత్రములో) పాటలవర్ణముతో (ఎఱుపు, తెలుపుల మిశ్రమవర్ణముతో) భాసిల్లుచున్నదని చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *త్రిలోచనా* (477వ) యను నామ మంత్రములో మూడునేత్రములు కలిగినదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *ఖట్వాంగాదిప్రహరణా* (478వ) యను నామ మంత్రములో నాలుగు చేతులందు కపాలము గ్రుచ్చబడిన కర్ర (ఖట్వాంగము), ఖడ్గము, త్రిశూలము, మహాచర్మము ధరించినదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *వదనైక సమన్వితా* (479వ) యను నామ మంత్రములో ఒకే శిరస్సు గలిగినదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *పాయసాన్నప్రియా* (480వ) యను నామ మంత్రములో పాయసాన్నమనిన ప్రీతిగలిగినదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *త్వక్ స్థా* (481వ) యను నామ మంత్రములో చర్మధాతువునందు ఉండి, చర్మమును రక్షించునదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *పశులోకభయంకరీ* (482వ) యను నామ మంత్రములో అజ్ఞానులై పశుప్రాయులుగా ఉండు సమూహమునకు భయంకరిగా గోచరిస్తుందని చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *అమృతాది మహాశక్తి సంవృతా* (483వ) యను నామ మంత్రములో విశుద్ధి పద్మమునందలి పదహారు దళములందు పదహారుమంది అమృతాది మహాశక్తులచే డాకినీశ్వరి పరివేష్ఠింపబడినది అని చెప్పబడినది.


డాకినీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం డాకినీశ్వర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: