31, అక్టోబర్ 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం

 *31.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఇరువదియవ అధ్యాయము*


*జ్ఞాన, కర్మ, భక్తి యోగములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*20.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*యత్కర్మభిర్యత్తపసా జ్ఞానవైరాగ్యతశ్చ యత్|*


*యోగేన దానధర్మేణ శ్రేయోభిరితరైరపి॥13037॥*


*20.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*సర్వం మద్భక్తియోగేన మద్భక్తో లభతేఽఞ్జసా|*


*స్వర్గాపవర్గం మద్ధామ కథంచిద్యది వాంఛతి॥13058॥*


కర్మతో, తపస్సుతో, జ్ఞానవైరాగ్యములతో, యోగముతో, దానధర్మములతో ఇతర శ్రేయస్సాధనములతో ఏయే ఫలములు లభించునో, వాటినన్నింటినీ భక్తిప్రభావముచే నా భక్తుడు అవలీలగా పొందగలడు. ఒకవేళ నా భక్తుడు స్వర్గమునుగానీ, మోక్షమునుగానీ, నా ధామమునుగానీ ఏది కోరిననూ దానిని అతడు సునాయాసముగనే పొందగలడు.


*20.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*న కించిత్సాధవో ధీరా భక్తా హ్యేకాంతినో మమ|*


*వాంఛంత్యపి మయా దత్తం కైవల్యమపునర్భవమ్॥13039॥*


నా యొక్క ఏకాంతభక్తుడు ధీరుడై, సాధుశీలిగా నుండును. అతడు ఏదీ కోరనే కోరడు. ఒకవేళ నేను స్వయంగా కైవల్యమును లేదా మోక్షమును ఇచ్చిననూ, వాటిని అతడు కోరడు. కోరుమని కోరినా నాయందు భక్తిని తప్ప వేరేదానిని కోరనేకోరడు.


*నాఽఽస్థా ధర్మే న వసునిచయే నైన కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్! పూర్వకర్మానురూపమ్|*


*ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్నజన్మాంతరేఽపి త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు॥*


దేవా! నాకు జన్మజన్మలయందును నీ పాదపద్మములను సేవించుచుండెడి నిశ్చలభక్తి అబ్బిన చాలును. మఱి దేనినీ వాఛింపను అని అన్నారు భక్తశిరోమణియైన ఆళ్వారులవారు. (ముకుందమాల 5)


*20.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*నైరపేక్ష్యం పరం ప్రాహుర్నిఃశ్రేయసమనల్పకమ్|*


*తస్మాన్నిరాశిషో భక్తిర్నిరపేక్షస్య మే భవేత్॥13040॥*


ఉద్ధవా! నిరపేక్షము అనగా అపేక్ష లేకుండుట సర్వోత్కృష్టము. ఉత్తమోత్తమము. పరమమంగళప్రదము. ఎంతో గొప్పది. కావున, నిష్కాముడు, నిరపేక్షుడు ఐన వానికే నా యందు అనన్యభక్తి పాదుకొనును. 


*20.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*న మయ్యేకాంతభక్తానాం గుణదోషోద్భవా గుణాః|*


*సాధూనాం సమచిత్తానాం బుద్ధేః పరముపేయుషామ్॥13041॥*


నాయందు ఏకాంతభక్తి గలిగినట్టి మహాత్ములు సమచిత్తమును కలిగి, సమదర్శనులై బుద్ధికి అతీతమైన పరమతత్త్వమును పొందెదరు. అట్టివారిని గుణదోషములతో ఏర్పడు గుణములు ఎంతమాత్రము బాధింపవు.


*20.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*ఏవమేతాన్ మయాఽఽదిష్టాననుతిష్ఠంతి మే పథః|*


*క్షేమం విందంతి మత్ స్థానం యద్బ్రహ్మ పరమం విదుః॥13042॥*


ఉద్ధవా! ఈ విధముగా నాచే ఉపదేశింపబడిన జ్ఞాన, భక్తి, కర్మమార్గములను అనుష్ఠించువారలు నా యొక్క పరబ్రహ్మతత్త్వమును ఎరుగుదురు. కావున వారలు మిగుల కళ్యాణస్వరూపమగు నా పరంధామమును క్షేమముగా చేరుకొందురు.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే వింశోఽధ్యాయః (20)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *జ్ఞాన, కర్మ, భక్తి యోగములు* అను ఇరువదియవ అధ్యాయము (20)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: