31, అక్టోబర్ 2021, ఆదివారం

శ్రీమద్వాల్మీకి రామాయణం

ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 

(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం) 


               ----------------------- 


          10. వైద్యశాస్త్రం 


       విదేశీ వైద్య విజ్ఞానం ప్రస్తుత కాలంలో బహుళ వ్యాప్తి చెందియుంది. కానీ దానిని సంపూర్ణ జ్ఞానంగా పరిగణించలేము. ఆ విధానంలో 

  - ఇప్పుడున్న వ్యాధులకూ చికిత్సా విధానం సంపూర్ణంగా గానీ, కొన్నిటికి అసలు చికిత్సేగానీ లేకుండా ఉంది. 

  - క్రొత్త వ్యాధులకు చికిత్స సంగతి సరేసరి. 

    ఈ రెండు సందర్భాలలోనూ, నిరంతర పరిశోధన జరిగినా, ఫలితం సంపూర్ణతను అందివ్వడం జరుగదు. 


      శ్రీమద్రామయణంలో కొన్ని సంఘటనలు, ఆ కాలంలో వైద్యవిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తుంది. 


సంజీవని 


      ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రామలక్ష్మణులు మూర్ఛిల్లుతారు. 

      అప్పుడు జాంబవంతుడు హనుమంతునితో హిమవత్పర్వతాలకి వెళ్ళాలని సూచిస్తూ, నాలుగు ఓషధులను గూర్చి తెలిపాడు. అవి 

1. మరణించినవారిని బ్రతికించే "మృత సంజీవని", 

2. శరీరంలో ఉన్న ములుకులు తొలగించే "విశల్యకరణి", 

3. విరిగిన శరీరభాగాలని అతికించే "సంధానకరణి", 

4. దేహానికి మంచిరంగు కలిగించే "సువర్ణకరణి". 


    సంధానకరణికి ఈ కాలంనాటి ఉదాహరణ: 

    అవిభక్త ఖమ్మం జిల్లాలో భాగమైన చర్ల సమీపాన ఒక గిరిజన గ్రామంలో 

    పరదేశీ అనే ఒక గిరిజనుడు ఒక పసరును కోడి ఈకతో రాస్తే, విరిగిన ఎముక వెంటనే అతుక్కునేదట. 

    కొలది కాలం క్రాతమే అతను మరణించాడు. 

    అతను ప్రదర్శనగా, 

    మాంసం కోసం చంపిన మేకని, దాని ముక్కలను చేర్చి, ఆ పసరు రాసి విరిగిన ఎముకలు కలవడం చూపేవాడట. 

    అతనినీ, అతని చికిత్సనీ ప్రత్యక్షంగా చూసినవాళ్ళు ఇప్పటికీ సాక్ష్యంగా ఉన్నారు. 

    ఇతరులు ఆ వైద్యం నేర్చుకోవటానికి ఉత్సాహం చూపనందువలన అది అతనితోనే అంతమైపోయింది.

     

 సువర్ణకరణి: 

     హనుమ తెచ్చిన పర్వత ఓషధుల వాసనను ఆఘ్రాణించగానే, రామలక్ష్మణుల దేహంలోని శల్యాలూ తొలగిపోయాయి. 

    రుగ్మత మాయమైంది. 

    మరణించిన వానరులందఱూ ప్రాణాలతో లేచారు. 


    బాలరాజు మహర్షి హిమాలయాలకి వెళ్ళి, మూలికా వైద్యశాస్త్రాన్ని పొంది తెలియజేశారు. 

    దానిని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యరూపంలోకి తీసుకువచ్చింది. అది ఒక సమగ్ర పుస్తకరూపంలో లభించడం గొప్ప విశేషం. 


బాధోపశమనం 


    ఇంద్రజిత్తు వధానంతరం లక్ష్మణునికి సుషేణుడు చికిత్స చేశాడు. 

    లక్ష్మణుడు నాసిక ద్వారా ఉత్తమ ఓషధిని పీల్చగానే, 

    శరీరంలోని శల్యాలన్నీ తొలగిపోయి, 

    గాయాలు మాని, 

    అలసట తగ్గి, 

    స్వస్థతపొంది, 

    క్షణకాలంలోనే బాధోపశమనంతో సంతసించాడట. 

    ప్రస్తుత విదేశీ వైద్యపద్ధతిలో మందులవలె ముందుగా తాత్కాలికోపశమనం పొందే విధానంగా కాకుండా, 

    క్షణంలో తగ్గి, శరీరం పూర్వపు ఆరోగ్యస్థితికి వెంటనే రావడం విశేషం. 


శస్త్ర చికిత్స 


    సీతామాత లంకలో తనలోతనే బాధపడుతూ, 

   "శస్త్ర చికిత్సకుడు గర్భస్థప్రాణిని ఛేదించినట్లు, ఆ రావణుడు తన అవయవాలని శస్త్రంతో ముక్కలు చేస్తాడ"ని అనుకుంటుంది. 

    తద్వారా ఆనాటి శస్త్రచికిత్సా విధానాన్ని సూచనప్రాయంగా తెలియజేసింది. 


అవయవ మార్పిడి 


    కైక దశరథునితో మాట్లాడుతూ, 

    గతంలో అలర్క మహారాజును ఒక వేదపండితుడైన బ్రాహ్మణుడు యాచిస్తే, 

    ఆ రాజు తన నేత్రములను పెకలించి, ఆ బ్రాహ్మణునికి దానం చేశాడని ఉదహరిస్తుంది. 

    తద్వారా అవయవ మార్పిడి చికిత్స ఆ రోజులలోనే ఉండేదని స్పష్టమౌతుంది.


ఆయుర్వేదం 


    ఆయుర్వేదం అద్భుతమైన భారతీయ వైద్యశాస్త్రానికి వేద ప్రామాణికమైనది. 

    అద్భుత చికిత్సలు చేసిన, చరకుడు - శుశ్రుతుడు వంటి ఆయుర్వేద వైద్యులు, 

    అందుబాటులో ఉన్న ఇప్పటి చరిత్ర కాలానికి చెందినవారే కదా!

    భారతీయ వైద్య విధానం ఆయుర్వేద వైద్యపద్ధతికి చెందినది. 


    మనం ఇప్పటిదాకా పరిశీలించిన

శ్రీమద్రామాయణంలోని వైద్యవిధానం ఆ భారతీయ వైద్య ప్రామాణికమైనదని తెలుస్తుంది కదా! 

    అభివృద్ధిచెందిన ఆ సంప్రదాయ వైద్యవిధానాన్ని మనం స్వీకరిస్తే, 

    - ఏ రుగ్మతలకైనా ప్రామాణికమైన చికిత్స, 

    - ఆర్థిక పరమైన అవుసరాలులేక 

    (ఒళ్ళూ ఇల్లూ గుల్లవకుండా) 

    వ్యాధులనుండీ బయటపడే అవకాశం ఉంటుంది కదా!


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

కామెంట్‌లు లేవు: