31, అక్టోబర్ 2021, ఆదివారం

తాంత్రిక పూజలు

 తాంత్రిక పూజలు..............!!


తంత్ర పూజలు 5 విధములు అవి:

1.సూర్య 2.గణపతి 3.విష్ణువు

4.శివుడు 5.శక్తి పూజ లనునవి.

ప్రతి శక్తికి 5 రూపములు 5 సాధనలు గలవు.


ఉపాసకుని శక్తి సామర్థ్య,భావముల ననుసరించి సాధనలు 4 విధములుగా పేర్కొనబడినవి.

అవి:

1.పూజ 2. జపము 3.ధ్యానము

4.బ్రహ్మత్వము అనునవి. 

వీనిలో సాధకుని భావములు 

మూడు తెగలుగా విభజింపబడినవి.

అవి:

1.పశుభావము 2.వీరభావము

3.దివ్యభావము


1.పశుభావము:

లజ్జ,కామ,క్రోధాది అరిషడ్వర్గములచే కట్టబడిన వారు పశ్వాచారులు.


2.వీరభావము:

పశుపాశములను విడిపించుకొనిన జితేంద్రియులు వీరాచారులు


3.దివ్యభావము:

బ్రహ్మజ్ఞానులైనవారు

దివ్యాచారులనదగిన వారు. 

వివిధ సాధనా విధానములను గమ్యమును చేరుకొను అంతస్థులను,ఆచారములనినారు.

కులార్ణవతంత్రము ఈ ఆచారములను

ఆరునొక్కటి (7)గా పేర్కొనినది.


అవి:

1.వేదాచారము:

బహిః పూజాపద్ధతి దీనిలోనిది క్రియామార్గమై స్థూలదేహము వంటిది.


2.వైష్ణవాచారము:

భక్తి యోగ ప్రాధాన్యమై హృదయ సాధనకు దోహదమిచ్చును.


3.శైవాచారము:

జప యోగముతోకూడి

ధర్మస్థాపన కుపక్రమించినది.


4.దక్షిణాచారము:

దక్షిణ కాళిక పూజా పూర్వకమైనది.

ఈ తెగవారికి సమయాచారులని మరియొక పేరు గలదు. వీరికి దేవి గాయత్రీ మంత్ర ముపదేశింపబడును.

త్రిశక్తుల కావ్యశక్తి బ్రహ్మశక్తి యగుటవలన బ్రాహ్మణత్వ సాధనకిది నాందియై శక్తి పూజార్హత్వము లభించును.

ఈ ఆచారములో ధ్యాన యోగ ప్రాప్తియై ప్రవృత్తి మార్గమునుండి నివృత్తికి,

తన్మూలమున యోగసిద్ధి కలుగుటకు

ప్రారంభమగును.


5.వామాచారము:

దక్షిణాచారములో పుట్టిన మానవుడు గురువులచేత దీక్షనందుకొని (తంత్ర దీక్ష) వామాచారుడగును.వామమనగా వ్యతిరేక పక్షము,విప్లవ మార్గము అని పేరు. ఇచ్చట సాధకుడు ప్రవృత్తి మార్గమును పూర్తిగా వదలి నివృత్తి పదములో నిమగ్నుడగుటయే ప్రత్యేకత.అనగా సంసార బంధ విముక్తుడై యోగిగా నుండు స్థితి.

వీరినే వీరాచారులని,హఠయోగులని పిల్తురు.


6.సిద్ధాంతాచారము:

లజ్జ,భయ,మోహాది అరిషణ్మార్గములకుకుల శీలాలకు నతీతులుగా వీరు స్మశాన వాసులై 

శివ స్థితి నొందినవారు.

వీరికి యోగ రహస్యములు కరతలామరకములు.

మనో నిగ్రహము,ప్రాణవాయు 

సంచార సమస్థితి, 

వాని గతులయొక్క జ్ఞానము

వీరికి అనుభవ సిద్ధము.

వీరికి గురువులు వేదాచార

రహస్య ముల నుపదేశించి దీక్షయొసంగుదురు.

అష్టాంగయోగ సాధనచే 

వీరు తురీయులై కాలాచార పరాయణులగుటకు

అర్హతను బడయుదురు.

వీరినే అఘోరయోగాచారులని,

దివ్యాచారులని వ్యవహరింతురు.

(శివుని వామ పార్శ్వమగు శక్తిని పూజించువారుగూడా వామాచారులనబడుదురు.)


7.కౌలాచారులు:

ఇచట శత్రు మిత్రత్వము,శీతోష్ణ సుఖ దుఃఖ స్థితి కతీతమైన స్థిత ప్రజ్ఞత్వము కలిగి బ్రహ్మీభూతులగుదురు.ఇచటి వారు లాభ నష్టముల (మన్ను-పొన్ను) భేదము లెరుంగని ద్వందాతీతులైనారు.వీరికి సర్వము బ్రహ్మమయమే.బేధభావన యుండదు. భగవద్గీతలో చెప్పబడిన బ్రహ్మభావము నంది,సమతా భావము గలవారు వీరు. అప్పుడప్పుడు భ్రష్టులవలె,ఉన్మత్తులవలె,శిశువులవలె,భూత,ప్రేత,పిశాచవర్తనులై 

కాన నగుదురు. 

ఏకాంత స్థలములలో

శ్మశాన వాటికలో నుండి 

నిర్వికల్ప సమాధి స్థితి

నందుకొనెడివారు. 

వీరిని జీవన్ముక్తులు,పూర్ణమానవులు, పరమహంసలని పిల్తురు.


ఈ పై పేర్కొనిన వివిధ తంత్ర శాస్త్ర మార్గములలో సామాన్యులు మొదటి నుండి ప్రారంభించి జన్మజన్మల సంస్కారమునొంది చివరకు కౌలాచారమున సిద్ధులగుదురు. 

కాని పూర్వజన్మ సంస్కారము కలవారు మాత్రము సిద్ధాంతాచారము 

నుండియే సాధనచేసి పరమహంస లగుదురు.దీనికి తార్కాణముగా రామకృష్ణపరమహంస ,

తురీయాచారములైన సిద్ధాంత కౌలాచారముల సాధనతో మహా భావన కలిగి వామాచార పరాయణులుగానే సిద్ధినొందిరి.

వీరికి జగజ్జనని పిలిచిన వెంటనే సాక్షాత్కరించెడిదట.

అంతటి మహనీయులు వారు కనుకనే పరమహంసయని పిలువబడిరి.


ఇట్టి తంత్ర రహస్యములను మన దేశములోని హిందువులేగాక హేతువాద ప్రధానముగా గల ఆంగ్లదేశములో పుట్టి, పెరిగి, ఉన్నతవిద్యనభ్యసించి,క్రైస్తవ మత

సిద్ధాంతాచారము కలిగిన వంగదేశ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, పనిచేసిన ప్రఖ్యాత న్యాయశాస్త్రజ్ఞులు,

మేధావులునైన, సర్ జాన్ ఉడ్ రాఫ్ దొర గారు చక్కటి కృషిచేసి కొన్ని విషయములలో భారతదేశము తంత్ర శాస్త్రమునకు ఎంతయో ఋణపడి యున్నదని వాక్రుచ్చినారు.

వైద్య నిపుణులకు కూడ నయముకాని మొండి వ్యాధులు కేవలము మంత్రములచేత నయమగుటను 

వారు స్వయముగా చూచి,పరీక్షించి 

ఏ తన్మాహాత్మ్యమునకు కచ్చెరువంది సంస్కృతభాష నభ్యసించి తంత్ర శాస్త్రములో చక్కని కృషిచేసి,

ఈ గ్రంథములను ఆంగ్లభాషలో వివరించి వ్రాసి,తంత్ర శాస్త్రమును పునరుజ్జీవింపజేసినారు.శరీరము,

ప్రాణము,మనస్సు,బుద్ధి, నాడి,జ్యోతిష, వైద్య,రసాయన, శాస్త్రముల కెంతయో తంత్ర శాస్త్రము దోహదమిచ్చి మహత్తర సేవ గావించినదని వీరు చాటినారు.

శ్రీ మాక్సుముల్లర్ దొరగారు

వేదములకెట్టి సేవ చేసినారో అట్టి సేవనే వీరు తంత్ర శాస్త్రమునకుచేసి,యందు గల శాస్త్రీయ విజ్ఞానమును బయట పెట్టిరి.తంత్ర శాస్త్రముల విలువ ఎట్టిదో

వాని ప్రాధాన్య మెట్టిదో మనకిపుడు బోధపడినది గదా!


మరియు నింకొక విషయము.ఆత్మజ్ఞాన గ్రంథములు రహస్య గ్రంథములని పెద్ద లనినారు.అందువలన రహస్య భాషలోనే ఈ తంత్ర శాస్త్రములను రచియించినారు.దీనినే సంధ్యాభాష యని గూడ యందురు.సంధ్యలో చీకటి వెలుగులున్నట్లు వీనిలో వాడిన పదములకు కూడా రెండర్థములు గలవు.అనగా సామాన్యులకు సామాన్యర్థము,సాధకులకు విశేషార్థములందు బోధపడును.

దీనిచే నివి గోప్యమైనవని చెప్పబడినవి.రహస్యముగా నుంచబడుటచే వీని పవిత్రత చెడకుండా మహిమతో నొప్పియుండుటయైనది.

దీనినే గీతాచార్యుడు

 "జ్ఞాన మాఖ్యాంతం గుహ్యాద్గుహ్యంతరం" అని నుడివియున్నాడు.

ఇట్లు తంత్ర శాస్త్రములు నిగూఢమైన శక్తులతో నిండి సాధకులకు పరమార్థ మార్గదర్శకములై విలసిల్లినవి.

కామెంట్‌లు లేవు: