*31.10.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - ఇరువదియవ అధ్యాయము*
*జ్ఞాన, కర్మ, భక్తి యోగములు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*20.25 (ఇరువది ఐదవ శ్లోకము)*
*యది కుర్యాత్ప్రమాదేన యోగీ కర్మ విగర్హితమ్|*
*యోగేనైవ దహేదంహో నాన్యత్తత్ర కదాచన॥13030॥*
యోగి ఎట్టి నిషిద్ధకర్మలను చేయడు. ఒకవేళ ప్రమాదవశమున (మోహకారణముగా) ఏదైనను అపరాధము జరిగినచో యోగము ద్వారానే తొలగించుకొనుటకు ప్రయత్నింపవలెను. కాని, ఇతర ఉపాయముల జోలికి పోరాదు.
*20.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*స్వే స్వేఽధికారే యా నిష్ఠా స గుణః పరికీర్తితః|*
*కర్మణాం జాత్యశుద్ధానామనేన నియమః కృతః|*
*గుణదోషవిధానేన సంగానాం త్యాజనేచ్ఛయా॥13031॥*
సాధకులు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి, ఆయా కర్మలను ఆచరించుటయే గుణము. అట్లుగాక, అందులకు విరుద్ధముగా పరధర్మములను ఆచరించుట దోషము. ఏలనన, పుట్టుకచేతనే (స్వభావరీత్యా) కర్మలు అనర్థహేతువులు. కావున కర్మలపట్ల విషయాసక్తిని తొలగించుటకే శాస్త్రములు గలవు. ఇట్టి శాస్త్రములద్వారా కర్మలయొక్క గుణదోషములు, విధినిషేధములు వివరింపబడినవి. వీటిద్వారా కర్మలయందలి ప్రవృత్తిని విడనాడి, నివృత్తిమార్గమును అనుసరింపవలెను.
*20.27 (ఇరువది ఏడవ శ్లోకము)*
*జాతశ్రద్ధో మత్కథాసు నిర్విణ్ణః సర్వకర్మసు|*
*వేదదుఃఖాత్మకాన్ కామాన్ పరిత్యాగేఽప్యనీశ్వరః॥13032॥*
*20.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*తతో భజేత మాం ప్రీతః శ్రద్ధాలుర్దృఢనిశ్చయః|*
*జుషమాణశ్చ తాన్ కామాన్ దుఃఖోదర్కాంశ్చ గర్హయన్॥13033॥*
*20.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*ప్రోక్తేన భక్తియోగేన భజతో మాసకృన్మునేః|*
*కామా హృదయ్యా నశ్యంతి సర్వే మయి హృది స్థితే॥13034॥*
నా కథలయందు శ్రద్ధ గలిగినవాడు సర్వకర్మలయందు విరక్తిని పొందినవాడు. సమస్త భోగములకు - భోగ్యవిషయములు, కామ్యములు - కామ్యకర్మలు దుఃఖమయములు అని తెలిసికూడా వాటిని త్యజించుటకు అసమర్థుడైనచో, నా పట్ల శ్రద్ధాళువై దృఢనిశ్చయమును గలిగి అత్యంత ప్రేమభావముతో నన్ను భజింపవలెను. ఆ విధముగా నాయందు భక్తితత్పరుడై భోగములను అనుభవించుచూ, అవి దుఃఖహేతువులని, నిందనీయములు అని మానసికముగా చింతించుచు, వాటిని విడిచిపెట్టలేని దుఃస్థితికి లోలోన నొచ్చుకొనుచుండవలెను. ఈ విధమగా చెప్పబడిన భక్తియోగముద్వారా నిత్యనిరంతరము నన్నే భజించెడు ఆ మునియొక్క హృదయమునందు నేను స్వయంగావచ్చి నిలిచెదను. నిలిచినవెంటనే అతనిలోగల సమస్తభోగవాసనలు నశించిపోవును.
*20.30 (ముప్పదియవ శ్లోకము)*
*భిద్యతే హృదయగ్రంథిశ్ఛిద్యంతే సర్వసంశయాః|*
*క్షీయంతే చాస్య కర్మాణి మయి దృష్టేఽఖిలాత్మని॥13035॥*
సర్వాత్మస్వరూపుడనైన నేను, నా భక్తుని హృదయములో సాక్షాత్కరించిన ఉత్తరక్షణముననే అతని హృదయమునందు గల అనుమానపు ముడులు విడిపోవును. సమస్త సందేహములు తీరిపోవును. అతనిలోగల వాసనలన్నియును సంస్కారములతో సహా సమసిపోవును.
*20.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*తస్మాన్మద్భక్తియుక్తస్య యోగినో వై మదాత్మనః|*
*న జ్ఞానం న చ వైరాగ్యం ప్రాయః శ్రేయో భవేదిహ॥13036॥*
అందువలన నా భక్తియుక్తుడైన యోగి నాయందే చిత్తమును నిలుపుటవలన నాకు ఆత్మీయుడైపోవును. కావున అతనికి జ్ఞానవైరాగ్యములు లేకపోయిననూ, కేవలము నా భక్తివల్లనే అతడు శ్రేయస్సును పొందును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి