రామచరిత మానస్..!!
శ్రీరామ జయరామ జయ జయరామ..!!
శ్రీరామనామం సుధామధురం అంటారు.
భక్తులు భక్తి పూర్వకంగా రామరసాన్ని ఆస్వాదించాలని సదాశివ బ్రహ్మేంద్రులు చెబుతారు.
కదళి, ఖర్జూర ఫలాల కన్నా రామనామం ఎంతో రుచి
అని కీర్తించాడు రామదాసు.
రామభక్తి మనోజ్ఞమే కాక భవ సాగరాన్ని దాటించే తారక మంత్రమనీ భావిస్తారు సాధకులు.
అనంత రామభక్తితో సుందర సాహిత్యాన్ని,
మధుర సంగీతాన్ని సృజించిన మహానుభావులు
ఎందరో ఉన్నారు.
శ్రీరాముడికి ప్రథమ భక్తుడు భరతుడు అని ఆధ్యాత్మిక రామాయణం చెబుతోంది.
మరో సోదరుడు లక్ష్మణుడు ఎప్పుడూ శ్రీరాముడి
వెన్నంటి ఉన్నాడు.
రామబంటుగా పేరొందిన మహావీరుడు హనుమ. వారందరూ సదా రాముణ్నే ధ్యానించి తరించారు.
అదే బాటలో మరెందరో రామభక్తితో చరించారు.
వారు రసవత్తర రీతిలో రామాయణం రచించారు. కబీరుదాసు
తులసీదాసు
సూరదాసు
సుందరదాసు
వంటి సాధకులు ఎన్నో గీతాలు, వచనాలు వెలయించారు.
తులసీదాసు రాసిన రామచరిత మానసం,
జానకీ మంగళం,
హనుమాన్ చాలీసా
వంటివి ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి.
వాల్మీకి రామాయణం తరవాత తిరిగి అంతటి ప్రాచుర్యం పొంది, భక్తులకు పారవశ్యం కలిగించే గ్రంథం
రామచరిత మానస్.
ఈ గ్రంథ రచయిత తులసీదాసు.
ఆయన ఇప్పటి ఉత్తరప్రదేశ్ లోని రాజపూర్ గ్రామంలో జన్మించాడు.
ప్రాచీన హిందీకి రుపాంతరమైన ఆవధ్ ఆ ప్రాంతపు సామాన్య ప్రజల వాడుకభాష.
అందులో భారతదేశ సంస్కృతి నిండిన సంప్రదాయ సాహిత్యాన్ని వెలయించాడు తులసీదాసు.
ఆయన రామచరిత మానస్ నాలుగు పాదాల కవిత (చౌపాయి) గా సాగింది.
రామాయణాన్ని హిందీ మూలంలో అందించిన తొలికవి ఆయనే!
రామాయణం ఓ మహాగ్రంథం.
దాని రచనా కార్యక్రమాన్ని రామరాజ్య రాజధాని అయోధ్యలో చేపట్టాడు తులసీదాసు.
భగవంతుడి సగుణ సాకార తత్వాలు,
గుణ ప్రభావ విశేషాలు,
భక్తితత్వ రహస్యాలు అన్నింటినీ సుందరమైన సరళ శైలిలో అందించాడాయన.
రామచరిత మానసంలోని ప్రతి అక్షరమూ దివ్యమంత్ర సదృశమంటారు భక్తులు.
ఆ గ్రంథాన్ని ఆశీర్వాత్మకం గా వర్ణిస్తారు శ్రీరాముడి
కృపకు పాత్రుడైన మహాభక్తుడు తులసీదాసు.
భగవంతుడి లీలల్ని తన గ్రంథంలో ఆయన అనుభవ పూర్వకంగా వర్ణించాడు.
పరమేశ్వరుడి ఆజ్ఞానుసారం ఆ పుస్తకం రాశానని వెల్లడించాడు.
మొదట సీతమ్మకు నమస్కరించి,
గ్రంథరచన ప్రారంభించాడు.
ఆమెను మహాశక్తి స్వరూపిణిగా భావించి,
ఉద్భవ స్ధితి కారిణి అని స్తుతించాడు.
శివధనుర్భంగం గురించి తులసీదాసు విలక్షణంగా అభివర్ణిస్తాడు.
ఆ ధనస్సులో ఇతర రాజుల దురభిమానం, పరశురాముడి అహంకారం కలగలిపి ఉన్నాయని; అటువంటిదాన్ని రాముడు అవలీలగా విరిచాడని విలక్షణమైన రీతిలో వ్యాఖ్యానిస్తాడు.
వాల్మీకి రామాయణానికి రామచరిత మానసం యథాతథ అనువాదం కాదు.
మూల కథను ఏ మాత్రం మార్చకుండా,
భక్తితత్వాన్ని రంగరించి రాసిన గ్రంథం అది.
తులసీదాసు అద్భుత రచనాశైలికి అదొక నిదర్శనం. రామచరిత మానసం రాసిన తరువాత,
హనుమ దర్శనం పొందిన ఆనందంతో తులసీదాసు హనుమాన్ చాలీసా రచించినట్లు చెబుతారు.
హనుమను స్మరించడం వల్ల బుద్ధి, బలం, యశస్సు, థైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం కలుగుతాయన్నది
ఆ కవి వాక్కు.
భక్తి కావ్యరచన, తాదాత్మ్యత తులసీదాసులోని విలక్షణతలు.
ఆయన వారణాసిలో సంకట మోచన్ దేవాలయాన్ని కట్టించాడంటారు.
ఒక సంఘటన ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. సన్యాసిగా మారి,
అంతటా విస్తృతంగా పర్యటించాడు.
చిత్రకూటములో కొన్నాళ్ళు ఉన్నాడు.
జీవితాంతం అయోధ్యలో నివసించాడు.
అక్కడే ఆయన రామచరిత మానసం సహా పలు రచనలు చేశాడని ప్రతీతి.
శివుణ్ని సదా పూజించే తులసీదాసు,
తన అవసాన దశలో రుద్రాష్టకం రాశాడని పలువురు గాఢంగా విశ్వసిస్తారు.
స్వస్తి..!!
*సర్వే జనా సుఖినోభవంతు..!!*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి