5, జూన్ 2023, సోమవారం

చారిత్రాత్మక కథాస్రవంతి🌹* . ♦️ *ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 81*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 81*


చాణక్య చంద్రగుప్తులు విడిది భవనంలో రహస్య చర్చలలో నిమగ్నులయ్యారు. 


చంద్రగుప్తుడు అసంతృప్తిగా చూస్తూ "సుగాంగ ప్రాంగణంలో ప్రవేశానికి ఇప్పుడు మంచి రోజులు కావంటూ రాక్షసామాత్యుడు చెప్పిన మాటలు అసత్యాలని తెలిసింది. మనల్ని రాజభవనంలోకి అడుగుపెట్టనియ్యకుండా రాక్షసుడే ఏదో ఎత్తు వేస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది. మీరు దీనికి ఏదైనా ప్రతిక్రియ ఆలోచించాలి" అన్నాడు. 


చాణక్యుడు నవ్వి "పురోహితుల చేత రాక్షసునికి ఆ మాటలు చెప్పించింది నేనే... ఆ సంగతి తెలుసుకోలేక అతడే చిలకపలుకులు పలికాడు" అని చెప్పాడు. 


చంద్రుడు చకితుడవుతూ "మీరా ? ఎందుకలా చెప్పించారు ?" అనడిగాడు. 


చాణక్యుడు సాలోచనగా తలపంకిస్తూ "కోట మన వశమైన మాట నిజం. కానీ శత్రునిశ్శేషం కాలేదు. శత్రువర్గం పూర్తిగా నశించిన తర్వాతనే నీ సుగాంగ ప్రవేశమూ, పట్టాభిషేకమున్నూ... అంతవరకూ జరిగేదంతా చూస్తూ ఉండు. ఏమైనా, చంద్రగుప్తుడొక్కడే మగధ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు..." అని చెప్పాడు గంభీరంగా. 


చంద్రుడు తృళ్లీపడి "అదేమిటి ? పర్వతకుడికి అర్థరాజ్యం ఇస్తామని మాట యిచ్చాంగదా ?" ప్రశ్నించాడు. 


"మాట ఇచ్చింది మేము. దాని పాపం, ఫలితం మాదే... నువ్వు నిశ్చింతగా ఉండు..." అని చెప్పాడు గంభీరంగా. 


అదే సమయంలో మందిర ద్వారం బయట కాపలదార్లతో ఎవరో గొడవపడడం వినిపించింది. 'చాణుక్యుల వారిని అత్యవసరంగా కలుసుకోవాలనీ, లోపలికి వెళ్ళనివ్వమని' ఎవరో అడుగుతుంటే భటుడు వీలు కాదంటున్నాడు. చాణక్యుడు ఆ గొంతుని గుర్తుపట్టి "శార్జరవా ! రారా లోపలికి" ఆదేశించాడు బిగ్గరగా. మరుక్షణం మారువేషంలో ఉన్న శార్జరవుడు లోపలికి వచ్చి ఆర్యునికి అభివాదం చేశాడు. 


అతడిని ఎగాదిగా చూసి "నిన్ను రాక్షసగృహంలో భృత్యునిగా నియమించాను కదా ... ! ఏమిటి విశేషాలు ?" అడిగాడు చాణక్యుడు. 


శార్జరవుడు రాక్షసుడి ప్రతిజ్ఞ గురించి చెప్పి "రాత్రికి రాత్రే ఆమాత్రుడు రహస్యంగా, ఒంటరిగా ఎవరినో కలుసుకోవడానికి బయలుదేరాడు. నేను నీడలా ఆయన్ని వెంటాడాను. ఆయన సందులు గొందుల వెంట నడుస్తూ చివరికి శోణనదీ తీరానికి చేరుకున్నాడు. నేనూ అక్కడికి చేరాను. అక్కడ తెప్ప ఒకటి సిద్ధంగా ఉంది. అమాత్యుడు దానిలో ఎక్కి అవతలి తీరానికి బయలుదేరాడు. నేను వెంటనే ఇక్కడికి వచ్చేసాను" అని చెప్పాడు. 


"మరి నువ్వెందుకు నదిని దాటలేదు ?" విసుగ్గా ప్రశ్నించాడు చాణక్యుడు. 


"అక్కడ ఇంకొక పడవేది లేదు. నాకా ఈతరాదు ... అందుకని..." నసిగాడు శార్జరవుడు.  


చాణక్యుడు విసుక్కుంటూ "చీ ఛీ ... ఏం చెప్పినా నువ్విలాగే చేస్తావ్... ఎప్పుడూ అర్థసత్యాలే మోసుకొస్తావు.... నీకసలు బుద్ధిలేదురా... నీకంటే సిద్ధార్థకుడే వెయ్యిరెట్లు నయం" అన్నాడు. 


శార్జరవుడు వుక్రోషపడిపోతూ "ఆ సిద్ధార్థకుడికి ఈత వచ్చుగదా... అందుకే అతడిని అమాత్యుడి వెనుక అనుసరింపజేసి నేనిలా వచ్చాను..." అన్నాడు. 


చాణక్యుడు వచ్చే నవ్వుని బలవంతంగా పెదాల మధ్య బిగబట్టుకుంటూ "ఆ ఏడుపేదో ముందే ఏడవొచ్చుగదా...?" అన్నాడు. 


"ఏదీ... తమరు నన్ను సాంతం ఏడవనిస్తే గదా..." అంటూ శార్జరవుడు మొహం మాడ్చుకుని "రాక్షసుని అంతరంగ మదనంలోంచి పెల్లుబికిన దాన్నిబట్టి అతడు శోణనది అవతలి తీరాన వానప్రస్థాశ్రమ దీక్షలో ఉన్న సర్వార్ధ సిద్ధిని కలుసుకోవడానికి వెళ్లాడని తెలుస్తోంది" అని చెప్పాడు. 


"భేష్ ! ఇప్పుడు నిజంగా చాణక్యుడి శిష్యుడివనిపించుకున్నావురా !" అన్నాడు చాణక్యుడు అభినందనగా. 


శార్జరవుడు బుంగమూతి పెట్టి "మీరు నాకన్నీ నేర్పారుకానీ ఈత మాత్రం నేర్పలేదు. అది కూడా నేర్పించి వుంటే..." అన్నాడు అర్థోక్తిగా.


"ఆ నెపం నామీద వేస్తున్నావా ? సరే..." చాణక్యుడు తలపంకించి "ఎవరక్కడ ?" పిలిచాడు బిగ్గరగా. మరుక్షణం ఇద్దరు భటులు లోపలికి వచ్చారు. 


చాణక్యుడు వాళ్ళవైపు అదోలా చూస్తూ "ఈ శార్జరవుడిని తీసుకువెళ్లి పడవ ఎక్కించి శోణనదీ మధ్య భాగానికి చేర్చి... అక్కడ వీడిని ఎత్తి నదిలోకి విసిరి పారేయ్యండి" ఆజ్ఞాపించాడు. 


"అన్యాయం గురుదేవా ! అన్యాయం... అర్ధరాత్రి పూట చీకటిలో చలిలో నన్ను నదిలో పారేయించడం అన్యాయం..." అని వాపోతుంటే భటులు బర బర అతని రెక్కలు పట్టుకొని బయటికి లాక్కుపోయారు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: