5, జూన్ 2023, సోమవారం

ఆపస్తంబుడు

 ఆపస్తంబుడు

ఆపస్తంబుడు శాకల్య మహాముని శిష్యుడు. యజుర్వేద విహితకర్మలను సూత్రములుగా చేసిన మహానుభావుడు. ఈ సూత్రములకే ఆపస్తంబ సూత్రములని పేరు. ఆపస్తంబుడను నామము అతనికి ఆపాదించిన వైనము కడు విచిత్రమైనది. ఒకానొకమారు ఒక బ్రహ్మణుడు తన పిత్రుదేవతల శ్రాద్ధకర్మ కొరకు భోక్తగా ఒక బ్రాహ్మణుని కొరకు వెదకుచుండినాడు. ఆ విప్రుడు వైశ్వదేవులను, మహావిష్ణువును ప్రార్ధించగా ఆపస్తంబుడు ప్రత్యక్షమైనాడు. పరమానంద భరితుడైన బ్రహ్మణుడు పిండప్రదానము పిమ్మట ఆపస్తంబునకు తృప్తిచెందునటుల భోజనము వడ్డించినాడు. కానీ ఆపస్తంబుడు తృప్తి చెందలేదు. ఎంత వడ్డించినా తృప్తినొందక పోవుట చూచి కోపావేశభరితుడైన ఆ బ్రాహ్మణుడు ఆపస్తంబుని శపించుటకై కమండలములోని జలమును చేతిలో తీసుకొని ఆతనిపై చల్లగా, మహామహిమాన్వితుడైన ఆ ఋషి ఆ నీటి బిందువులను గాలిలోనే ఆపివేశినాడు. ఆపమును (నీటిని) గాలిలో స్తంబింప చేసిన వాడు కనుక ఆ ఋషి ఆపస్తంబుడుగా ప్రసిద్ధి కెక్కినాడు.

 వేరొక సమయమున ఆపస్తంబుడు ఆగస్త్యమునిని కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో (త్రిమూర్తులలో) అధికులెవరని అడుగగా ఆగస్త్యుడు శివుడు గొప్పయని తెలిపి, ఆ పరమేశ్వరుని మెప్పించుటకు తగు సూచనలు ఇచ్చినాడు. ఆపస్తంబుడు అగస్త్యుని సూచనమేరకు గౌతమీనది సమీపమున శివుని గూర్చి ఘోర తప మాచరించి నాడు. శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షముకాగా ఆపస్తంబుడు ఆ క్షేత్రమును దివ్యక్షేత్రముగా ఆశీర్వదించమని కోరినాడు. శివుడు ప్రసన్నుడై ఆ క్షేత్రమున స్నానమాచరించువారు దివ్యజ్ఞాన సంపన్నులు అగుదురని ఆ క్షేత్రమునకు ఆపస్తంబుని పేర ఆపస్తంబ తీర్థముగా ప్రసిద్ధి గాంచునని ఆశీర్వదించినాడు.

 ఆపస్తంబుని భార్యయగు అక్షసూత్ర మహా పతివ్రత. ఆపస్తంబునకు గర్కి అను కుమారుడు కలడు. గృహ్యసూత్ర సంగ్రహ మను విశేష సూత్రములు ఆపస్తంబుడు అందించిన అపూర్వ వరములు మహర్షుల, మహాత్ముల సంఖ్య గణనీయముగా తగ్గుటకు మనుష్యులలో ఇంద్రియ నిగ్రహము, ధర్మపరాయణత్వము తగ్గి, మోహం పుట్టటమే అని ఆపస్తంబుడు సూచించినాడు.

 ద్యుమత్సేను డను రాజు సాల్వదేశ అధిపతిగా వెలుగొందుచుండినాడు. ఈతని భార్య శైబ్య ఈతని కుమారుడు సత్యవనుడు. కారణంతరమువల్ల ద్యుమత్సేనుని చూపు మందగించి అంధత్వము దాపురించినది. శత్రురాజులు రాజ్యమును జయించగా భార్య పుత్రులతో అరణ్యమునకు పోగా ఆపస్తంబుడు ఓదార్చి ధైర్యమును ఒనగూర్చినటుల గూడా తెలియుచున్నది.  — భారతము – వనపర్వము

 ఇట్టి మహానుభావుడు ఆపస్తంబ సూత్ర కర్త.

కామెంట్‌లు లేవు: