5, జూన్ 2023, సోమవారం

కేదారము

 కేదారము

               

ఒకసారి పాండవులు అయిదుగురు కలిసి కేదారేశ్వర దర్శనమునకు వెళ్ళారు.


అప్పటికి ఆలయంలో చిన్న శివలింగం ఉంది. పాండవులు ఏమి చేస్తారో చూడాలని శివునికి ఒక ముచ్చట. ఒక చిన్న దున్నపోతు రూపంలో పరుగెత్తాడు. పాండవులు దానిని గమనించారు. వారు అది కచ్చితంగా ఆదిశంకరుడే అయి ఉంటాడని భావించారు. 


మహిషరూపంలో వెడుతున్నా అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు. శివుడు అనుకోలేదు. దాని కాళ్ళు పట్టుకోవాలని వారు ఆ మహిషం దగ్గరికి వెళ్ళారు. వాళ్లకి దాని కాళ్ళు అందలేదు. తోక అందింది. ఈశ్వర స్వరూపంగా దాని తోక పట్టుకున్నారు. 


వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై పరమేశ్వరుడు తన పృచ్ఛభాగమును అక్కడ విడిచి పెట్టి దానిని శివలింగంగా మార్చివేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్న కేదారలింగం.


కేదారక్షేత్రం వెళ్ళినవారు తెలియక ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. కేదార లింగమును తిన్నగా కంటితో చూడకూడదు. వలయమును పట్టుకు వెళ్ళాలి. వలయము అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువును తీసుకువెళ్ళాలి. అంతరాలయంలో ప్రవేశించగానే కంటిముందు ఆ వలయమును పెట్టుకుని అందులోంచి చూడాలి.


కేదారము దర్శనము చేతనే మోక్ష మీయగలిగిన క్షేత్రం గనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకరమును పెట్టుకుని అందులోంచి కేదార లింగమును చూడాలి. 


అలా చూసిన వలయ కంకణమును అక్కడ వదిలి పెట్టి వచ్చెయ్యాలి.


మన చేతికి వున్న ఏ బంగారమో ఉపయోగించినట్లయితే దానిని అక్కడ వదిలిపెట్టేయడానికి మనసొప్పదు. 


కాబట్టి ముందే ఒక రాగి కంకణమును పట్టుకుని వెడితే రాగి చాలా ప్రశస్తము కనుక, ఆ కంకణములోంచి కేదార లింగమును దర్శనం చేసి దానిని అక్కడ వదిలి పెట్టి రావచ్చు.


ఇకముందు వెళ్ళేవారు ఒక వలయంలోంచి కేదారలింగమును దర్శనం చేసే ప్రయత్నం చేస్తే మంచిది.

                            ~చాగంటి.

.

కామెంట్‌లు లేవు: