*అష్టైశ్వర్యాలు అంటే…*
➖➖➖✍️
*పిల్లలను ఆశీర్వదించేటప్పుడు పెద్దలు ‘అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు’ అని దీవించడం వింటూనే ఉంటాం. ఐశ్వర్యం అంటే సంపద. అది ఉన్న చోట దేనికీ ఎలాంటి లోటు ఉండదు. అయితే ఆ ఐశ్వర్యమొక్కటే ఉంటే మనిషి గొప్పవాడు కాలేడు. అవి కేవలం ఐహిక భోగాలు మాత్రమే. ఒక వ్యక్తికి సంఘంలో నిజమైన పేరు, ఆనందమయ జీవితం కలిగేది అతనికి అష్టైశ్వర్యాలు సిద్ధించినప్పుడే. మరి అంతటి ప్రాముఖ్యం ఉన్న అష్టైశ్వర్యాలు ఏంటో మీరే చదవండి…*
*రాజ్యమే రాజసం!*
*పూర్వం రాజ్యమంటే రాజు పాలించే ప్రాంతం. కానీ అష్టైశ్వర్యాల్లో రాజ్యమంటే ఆధీనంలో ఉన్న ప్రాంతం కాదు. ఈ భూమండలంపై వ్యక్తి పేరు, యశస్సు, కీర్తి ఎంతవరకు విస్తరిస్తే ఆ ప్రాంతమంతా అతని రాజ్యమని అర్థం. ఈ రాజ్యమే అతనికి రాజసం తెచ్చి పెడుతుంది. అంటే మనిషి గొప్పతనం నలుమూలలా విస్తరిస్తే అది తనకు కలిగిన ఒక ఐశ్వర్యమన్నమాట.*
*ధనమే మూలం!*
*ధనం ఉంటేనే ఎవరికైనా విలువ. అదే ధనం మీదగ్గర లేనప్పుడు సంఘంలో గౌరవమర్యాదలు దక్కడం కష్టం. జీవితంలో అతి ముఖ్యమైన కూడు, గూడు, బట్ట ఉండాలంటే ధనం తప్పనిసరి. డబ్బే లేని నాడు ఇవేవీ మీ చెంతకు రావు. అంటే ధనమే అన్నింటికి మూలమన్న సత్యాన్ని గ్రహించాలి. జేబులో పైసా లేని నాడు మనిషికి జీవితం కష్టాల్లో ఉంటుంది. కాబట్టి అష్టైశ్వర్యాల్లో ధనానిది ప్రత్యేక స్థానమని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.*
*ఇల్లాలే దీపం!*
*సంసార జీవితంలో భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తూ.. కష్టసుఖాలు పాలుపంచుకొంటూ భర్తకు కొండంత ధైర్యాన్నిచ్చేది ఆ ఇంటి ఇల్లాలు మాత్రమే. అందుకే పెద్దలు ఇల్లాలే ఇంటికి దీపం అన్నారు. అర్థం చేసుకునే ఇల్లాలు ఉంటే జీవితం ఆనందంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఒకవైపు సంతానాన్ని ప్రయోజకుల్ని చేయటం, మరోవైపు అత్తమామల్ని ఆప్యాయతతో చూసుకోవడం, భర్తతో సమానంగా ఇంటి వ్యవహారాలు నిర్వహించడంలో ఇల్లాలి పాత్ర అద్వితీయం.*
*సగం బలం!*
*కొండంత సంపద ఉండి చివరి రోజుల్లో బాగోగులను చూసుకోవడానికి సంతానం లేకపోతే జీవితానికి సంపూర్ణత చేకూరదు. పిల్లలు చేతికొచ్చారంటే తల్లిదండ్రులకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. సంతానం ప్రయోజకులయ్యారంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు.*
*ధైర్యే సాహసే లక్ష్మీ!*
*జీవితంలో కొందరు సాధించిన దాన్ని మరికొందరు సాధించలేరు. అలా జరగడానికి ఒక కారణం మీలోని ధైర్యసాహసాలు. జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులను అధిగమించలేక కొందరు మధ్యలోనే వెనుకంజ వేస్తారు. మరి కొందరు ధైర్యం కూడదీసుకుని ముందడుగు వేసి విజయం సాధిస్తారు. సరైన సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించినప్పుడు డబ్బు కూడా మీ దరికి చేరుతుంది. కష్టపడినప్పుడే కదా విజయం విలువ తెలిసేది. అలాంటి ధైర్యసాహసాలు కలిగి ఉండడమూ అష్టైశ్వర్యాల్లో ఒక భాగమే.*
*ఆత్మస్థైర్యం ఉంటేనే మనుగడ!*
*మన కర్మలకు అనుగుణంగానే ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఒకానొకసారి మిమ్మల్ని బలవంతుల్ని చేస్తే, మరొకసారి బలహీనుల్ని చేస్తోంది. బలహీనమైన సందర్భంలో మీలో ఆత్మస్థైర్యం ఎంత ఉందనేదే మీ మనుగడను నిర్దేశిస్తుంది. కొందరు గెలుపోటములను లెక్కచేయకుండా జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. అదే సందర్భంలో మరికొందరు ఓటమి కలిగినప్పుడు కుంగుబాటుకు లోనవుతారు. ఓటమి, కష్టాలు, బాధలు కలిగినప్పుడు కుంగిపోకుండా ధీమాతో ముందుకు సాగేవారే నిజమైన ఐశ్వర్యవంతులు.*
*విద్యే విజ్ఞాన జ్యోతి!*
*విద్య కలిగిన వాడు విద్యావంతుడు అవుతాడు. సమస్త విషయాలపై జ్ఞానాన్ని సంపాదిస్తాడు. చదువు సరిగా రాకపోతే ఇతరులకు మీరు సరిగా దిశానిర్దేశం చేయలేరు. ఉద్యోగం రావాలన్నా, ఆధునిక సమాజంలో బతుకు బండిని నెట్టుకు రావాలన్నా... విషయ పరిజ్ఞానం తప్పనిసరి. సంపాదనను దొంగిలించొచ్చు.. పేరు, ప్రఖ్యాతులు నాశనం చేయవచ్చు. కానీ మీ దగ్గర ఉండే విద్యను ఎవరూ దొంగిలించలేరు. అందుకే విద్య అనేది దొంగిలించలేని ఐశ్వర్యం. ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అని అంటారు.*
*వినయమే ప్రధానం!*
*మానవుడు జీవితంలో విజయం సాధించాలంటే వినయం కూడా అవసరం. వినయాన్ని పరిస్థితులకు తగ్గట్టుగా ప్రదర్శించినప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది. వినయం లోపించినప్పుడు అది పతనానికి కారణమవుతుంది. వినయంగా వినడం, మాట్లాడటం, ప్రవర్తించడం, నేర్చుకోవడం వంటివి మిమ్మల్ని బలవంతులను చేస్తాయి. పెద్దవారి ముందు వినయం ప్రదర్శించకుండా ప్రవర్తిస్తే నష్టపోక తప్పదు. కాబట్టి వినయమనే ఐశ్వర్యాన్ని కోల్పోకుండా చూసుకోవడం మీ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి