5, జూన్ 2023, సోమవారం

మన వేదములు – శాస్త్రములు

 మన వేదములు – శాస్త్రములు


వ్యాకరణము


షడంగాలలోని శిక్ష వేదభగవానునికి నాసికాస్థానం. వ్యాకరణం ముఖం. అనగావాక్కు. వ్యాకరణా లెన్నోవున్నా, ప్రధానమైనది పాణినీయం. పాణినీయానికి వరరుచివార్తికమూ పతంజలిమహరి భాష్యము వ్రాశారు. వ్యాకరణానికీ, ఇతర శాస్త్రాలకూ భేదమేమిటంటే ఇతరశాస్త్రాల భాష్యాలకన్నా సూత్రాలకేగౌరవం. వ్యాకరణవిషయం అట్లాకాదు. సూత్రాల కన్నా వార్తికానికీ, వార్తికానికన్న భాష్యానికీ గౌరవం అధికం. 


''సూచనాత్ సూత్రమ్'' పాణిని వ్యాకరణం సూత్రరూపంలోవున్నది. అన్నిశాస్త్రాలకూ భాష్యాలున్నా వ్యాకరణ భాష్యానికే మహాభాష్యమన్న గౌరవం. 


చోళమండలంలో శివాలయాలు ఎక్కువ. శివాలయాలలో 'వ్యాకరణదాన మంటపాలు' అని మంటపాలుంటవి. శివాలయానికిన్నీ, వ్యాకరణానికిన్నీ ఏమి సంబంధం? 


నృత్తావసానే నటరాజరాజో 

ననాద ఢక్కాం నవపంచ వారమ్. 

ఉద్ధర్తుకామః సనకాదిసిద్ధా 

నేతద్విమర్శే శివసూత్రజాలమ్ || 


పరమేశ్వరుడు మహానటుడు. ఆయన ఢక్క నుండి సూత్రాలేర్పడినవి. వానికి మాహేశ్వరసూత్రాలని పేరు. 


బొంబాయిలో నిర్ణయసాగర ప్రెస్ అనే ముద్రణాలయం ఒకటివుంది. వారు కావ్యమాల అని పేరుపెట్టి వరుసగా ప్రాచీనకావ్యాలను ప్రకటించేవారు. ఆ గ్రంథాలలో కొన్ని వెనుకటి సంస్కృతి శాసనాలనుగూర్చి వేంగినాటికి చెందిన తామ్రశాసనాన్నిగూర్చి, ప్రకటించినగ్రంథం చదవటం తటస్థించింది, కృష్ణా కావేరీ మధ్యప్రదేశమే వేంగినాడు. తెనుగు చోళులకున్నూ, తంజావూరు చోళులకున్నూ వియ్యమూ నెయ్యమూ ఉండేది. బృహదీశ్వరాలయం నిర్మించిన రాజరాజ నరేంద్రుడు చోళుడే. వేంగినాటికి చెందిన కులోత్తుంగచోళుడు చోళరాజ్యానికి వచ్చినప్పుడు ఆంధ్రదేశంలో వేదాన్ని మరింత ప్రచారంలోనికి తేదలచి చోళదేశపు ద్రావిడ బ్రాహ్మణులలో 500 కుటుంబాలను తనతోపాటు వేంగినాటికి తీసుకొనిపోయి కాపురం పెట్టించాడట. ఆంధ్రదేశంలో ద్రావిడశాఖకు చెందిన బ్రాహ్మణులు ఈ కుటుంబపరంపరలోనివారే. 


నిర్ణయసాగరంవారు ప్రచురించిన గ్రంథంలోని శాసనం ఈ ఐదువందల బ్రాహ్మణకుటుంబాలవారి గోత్రాలేమిటో ఆ కుటుంబాలలోనివారు ఏఏ శాస్త్రాలలో నిపుణులో వారు ఏ ఏ కార్యాలు చేయవలసియుండిరో వారికి ఏ ఏ చోట భూవసతులు కల్పింపబడెనో విశదీకరించినది. కోరినవారికి వేదములూ, శాస్త్రములూ చెప్పడమే వారి పని. ''రూపావతారవక్తుః ఏకో భాగః'' అన్న వాక్యం ఆ శాసనంలో కనిపించింది. ''రూపావతారం'' చెప్పేవారికి ఒకభాగం అని దీని అర్థం. రూపావతారం అనేది ఒక వ్యాకారణశాస్త్రం. 


ప్రస్తుతం వ్యాకరణగ్రంథాలలో అధికప్రచారం కలది 'సిద్ధాంతకౌముది'. అప్పయదీక్షితులవారి శిష్యుడైన భట్టోజీ దీక్షితులు దీనిని వ్రాసినవారు. ఇదిపాణినిసూత్రాలకు వ్యాఖ్యానం. భట్టోజీదీక్షితులు అద్వైతమతానుసారియైన 'తత్వకౌస్తుభం' అనేమరొక గ్రంథం, అప్పయదీక్షితులవారి ఆజ్ఞానుసారం మధ్వమతం ఖండిస్తూ 'మధ్వమత విధ్వంసన' మన్న ఇంకొక గ్రంథమున్నూ వ్రాశారు. 


సిద్ధాంతకౌముది వ్యాప్తికికాకముందు రూపావతారమే ప్రచారంలోవున్న వ్యాకరణం. రూప మనగా శబ్దంయొక్క మూలస్వరూపమే. రూపావతారమనగా శబ్దముయొక్కమూలస్వరూపవ్యక్తీకరణం. నిర్ణయసాగరంవారుప్రచురించిన తామ్ర శాసనం వేగినాటిలో రూపావతార వైయాకరణులకు కల్పించిన భూవసతులను పేర్కొన్నది. ఆరోజులలో వ్యాకరణానికి అంత ప్రాధాన్యం. వేగినాటికి వలసవెళ్ళిన బ్రాహ్మణులలో కొందరికి 'షడంగవిదు' లన్న బిరుదులున్నవి. వారిపేళ్ళుసహితము అరవపేర్లే. 'అంబలకూత్తాడువన్ భట్టన్' ''తిరువరంగముడై యాన్ భట్టన్' అన్న ద్రావిడనామములను ఇందు చూడవచ్చును. 


వీరందరూ స్మార్తులే. కాని పైన చెప్పిన పేళ్ళలో మొదటిది శివనామం, రెండవది వైష్ణవం. తిరువంగముడై యార్ పేరు వైష్ణవమేగాని నామధారి స్మార్తుడే. ఆ పేరుకు సంస్కృతము రంగస్వామి. తిరువంబల కూత్తాడువన్ అన్న పేరు నటరాజ శబ్దానికి తమిళం. కుత్తాడుట అనగా నాట్యంచేయటం. మనం చేయవలసిన నాట్యాలన్నీ ఈనటరాజేచేస్తున్నట్లున్నది. నటరాజునృత్యం అందరూ చూడలేరు. తపోధనులైన సనకాదులు పతంజలి, వ్యాఘ్రపాదులు దైనీసంపద కలవారు కనుక, దివ్యచక్షువులతో దానిని విలోకిస్తున్నారు. ఒక్కజ్ఞానచక్షువు లున్నవారే, ఆనటరాజతాండవాన్ని దర్శించగలరు. కృష్ణభగవానుల విశ్వరూపాన్ని ఒక్క అర్జునుడు, సంజయుడుమాత్రం చూడగలిగినవారు. సంజయునకు వ్యాసభగవానుల ప్రసాదం, అర్జునునకు ''దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగ మైశ్వరమ్'' అని కృష్ణపరమాత్మయే దివ్యచక్షువు ప్రసాదించాడు. 


మనకండ్లలో లెన్సువంటి సాధన మొకటివున్నదనిన్నీ, దానిసాయంచేతనే మనంచూడగల్గుచున్నామనిన్నీ శాస్త్రజ్ఞులు చెప్పుతున్నారు. వస్తువులన్నీ ఒక నిర్ణీతపరిమాణంలో మనకు కనబడటానికి ఆ కళ్ళలోని లెన్సే కారణం అన్నమాట. ఈ దృశ్యప్రపంచంలోని వస్తువులను మరింత ఘనపరిమాణంలో చూడాలని మనం తలచుకొంటే దానికి తగ్గ లెన్సు మన చక్షువులకు అమర్చుకోవాలి. అందుచే మనము చూచేదంతా సత్యమే అని చెప్పగలమా? రూపంయొక్క ఘనపరిమాణం మనదృష్టిని అనుసరించి ఉంది. దీనినే వేదాంతం దృష్టి, సృష్టివాదమని అంటున్నది. 


సనకాదులది సత్యదృష్టి, అందుచేతనే నటరాజునాట్యం చూచి ఆనందిస్తున్నారు. ఆనృత్యంలో ఉదయించిన శబ్దాలు, శివస్వరూపాన్ని ఏకభోగంగా అనుభవించడానికి వీలుగా ఉన్నవి. వానిభక్తిసూత్రాలుగా నందికేశ్వరుడు గ్రహించి భాష్యం చేశాడు. ఆనృత్య సందర్భంలో పాణిని కూడా ఉన్నాడట. 


పాణినికథ బృహత్కథలో ఉన్నది. ప్రాకృతభాషలు ఆరు. వానిలో పైశాచి ఒక్కటి. బృహత్కథ పైశాచిలో గుణాఢ్యుడు వ్రాశాడు. 


'చిత్రార్థాం న బృహత్కథా మచకథమ్'కువలయానందము. ఈబృహత్కధను క్షేమేంద్రుడు సంస్కృతములో సంక్షిప్తంగా రచించాడు. దీని ననుసరించి సోమదేవభట్టు కథాసరిత్సాగరం సంతరించాడు. 


మగధదేశంలో పాటలీపుత్రంలో (ప్రస్తుతం పాట్నా) వరోపాధ్యాయులు, ఉపవరోపాధ్యాయులని ఇరువురు పండితులుండేవారు. వీరిలో ఉపవరోపాధ్యాయులు చిన్న. అతని కొమారై ఉపకోసల. వరోపాధ్యాయులవారిశిష్యులే వరరుచి, పాణిని, ఈశిష్యద్వయంలో పాణిని మందబుద్ధి. చదు వెక్కలేదు. వరోపాధ్యాయు లాతని జూచి'నాయనా నీవు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి, ఈశ్వరానుగ్రహం పొందితేకాని, నీకు చదువు ఎక్కేటట్టు లేదు. అందుచే వెళ్ళి తపస్సుచెయ్యి' అని ఆదేశించారు. అంతటితో హిమాలయాలకు వెళ్లి పాణిని ఉగ్రతపస్సుచేత ఈశ్వరునిమెప్పించిఈశ్వరప్రసాదం పొందాడు. పై పెచ్చు నటరాజు తాండవాన్ని చూడగల పుణ్యంకూడా సంపాదించుకొన్నాడు. నృత్తావసానసమయంలో పుట్టిన శబ్దాలను పదునాలుగు సూత్రాలుగా గ్రహించి అష్టాధ్యాయి. 


'అఇఉణ్, ఋఈక్, ఏఓజ్, ఐఔచ్, హయవరట్, లణ్, ఞమఞణనమ్, ఝభఞ్, ఘఢధష్, జబగడదశ్, ఖఫఛఠధ, చటతవ్, కపయ్, శషసర్, హల్-' అనేవి ఈపద్నాల్గు సూత్రాలు. 


అచ్చులకు ఆకారము ఆది. ఈ మాహేశ్వర సూత్రాలలో 'అ' అనేది మొదటవది. 'హల్' చివరిది. వీనిమధ్యలో ఇమిడిఉన్న అచ్చులనూ, హల్లులనూ 'అల్' అ్సనేది సూచిస్తుంది. 'అలోంత్యస్య' అనేదొక పాణినిసూత్రం. లోకములో శబ్దశాస్త్రాలను ఏర్పరచినది పరమేశ్వరుడుకనుక శివాలయాలలో వ్యాకరణదానమంటపాలు నిర్మించే వాడుక ఏర్పడినది. 


దాదాపు నాలుగువందల సంవత్సరములకు పూర్వం తంజావూరు రఘునాథుడనే నాయకవంశమునకు చేరిన రాజు పాలించేవాడు. అతనికాలములో యజ్ఞనారాయణదీక్షితులు అన్న శివభక్తులొక రున్నారు. వారు 'సాహిత్యరత్నాకరం' అనే గ్రంథం వ్రాశారు. అందలి శివస్తోత్రమిది. 


అజ్ఞాతప్రభవై ర్వచోభి రఖిలై రాలంబి ధర్మప్రభా(థా) 

హేతుత్వం వివిధాధ్వరక్రమకృతి ష్వేకాయన శ్చోదనైః. 

తేషా మధ్వరకర్మణా మధిపతిం త్వా మీశ నారాధయన్ 

ధర్మా నర్జయితుం న శ క్ష్యతి జనో దక్షో ప్యదక్షోఽథవా|| 


మనం ధర్మాన్ని అనుష్ఠించాలన్నా, చేసిన కర్మలు ఫలించాలన్నా భగవంతుని కృప అవసరం. వేదవాక్కుఎక్కడ ప్రభవమైనదో ఎవరికీ తెలీదు. ఆవేదం 'ధర్మం ఇది' అని నిర్ధారిస్తున్నది. అనేక అధ్వరాలనూ, నానావిధకర్మలనూచేయుమని ఆజ్ఞ ఇస్తున్నది. యజ్ఞకర్మాధిపతివి నీవు. యజ్ఞేశ్వరుడవు నీవు. నిన్ను ఆరాధించకపోతే ఇవన్నీ ఇట్లా ఫలితాన్ని ఇస్తవి? 


''ఆవో రాజాన మధ్వరస్య రుద్రం హోతారం'' అని తైత్తిరీయ సంహిత. ఎవడు ఎంత కుశలుడైనా, దక్షుడైనా పరమేశ్వరుని ఆరాధన లేకపోతే వానికౌశలం నిరుపయోగమై పోతుంది. వానికి ఏ కార్యమూ సిద్ధించదు. దీనికి దక్షుడే సాక్ష్యం. 


ఈ శ్లోకానికి ముందున్నది వ్యాకరణమును గూర్చి. 

అదౌ పాణినినా(వా) దతొఽక్షర సమామ్నాయోపదేశేనయః 

శబ్నానా మనుశాసనం వ్యకలయ చ్ఛాస్త్రేణ సూత్రాత్మనా, 

భాష్యంతస్యచ పాదహంసకరవైః ఫ్రౌఢాశయం తం గురుం 

శబ్దార్థప్రతిపత్తిహేతు మనిశం చంద్రార్థచూడంభజే|| 


అక్షర సమామ్నాయము వ్యాకరణము. వేదములు ఈశ్వరనిశ్వాసాలు. ఈశ్వరునిచేతిలోని ఢక్కానాదమేశబ్దాను శాసనం. 


నీవు చేయి ఆడించావు; సూత్రా లేర్పడినవి. పాదవిన్యాసం చేశావో లేదో భాష్య మేర్పడినది. 


వ్యాకరణభాష్యం వ్రాసిన పతంజలి ఆదిశేషుని అవతారం. ఆయన పరమేశ్వరుని మ్రోల పాదాక్రాంతుడైయున్నందున ఆయన వ్రాసిన భాష్యం మహేశ్వర పాదవిన్యాసములో నుంచి పుట్టింది. ఇట్లా శబ్దార్థాలు రెండున్నూ పరమేశ్వరునిచే సృష్టింపబడినవి. వ్యాకరణం పరమేశ్వరుని సృష్టి, ''శబ్దార్థ ప్రతిపత్తిహేతు మనిశం చంద్రార్థచూడం భజే.''                        


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: