🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-52🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*భోగ శ్రీనివాసుడు:*
భోగ శ్రీనివాసుడు తిరుమల ఆలయంలోని శ్రీవేంకటేశ్వరుని విగ్రహం. ఈ విగ్రహం వెండితో తయారుచేయబడింది. ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు ప్రతిరోజు భోగ శ్రీనివాసునికి ప్రాతఃకాలంలో మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకం జరుగుతుంది. రాత్రిపూట పర్యంకాసనంలో నిద్రపుచ్చుతారు. ఈ దేవాలయంలో ఒక్క ధనుర్మాసంలో తప్ప మిగతా పదకొండు మాసాలు ఏకాంతసేవ జరుగుతుంది. ఈ సేవలో స్వామివారికి శయన మందిరంలోని వెండితో చేసిన ఉయ్యాలలో ఊపుతూ, తాళ్ళపాక కవుల పాటలు శ్రావ్యంగా పాడుతుండగా పాలు మొదలైనవి నివేదించడం జరుగుతుంది.
దేవాలయ ప్రాకారపు ఉత్తరకుడ్యం మీద ఉన్న శాసనం ప్రకారం భోగ శ్రీనివాసుని విగ్రహం క్రీ.శ.966 సంవత్సరంలో శక్తివిటంకన్ రాజు భార్య అయిన కాడవన్ పెరుందేవి లేదా సామవై అనే పల్లవరాణి ప్రతిష్ఠించింది.మహారాజు కొప్పాత్ర మహేంద్ర పన్నార్ యొక్క 14వ పరిపాలనా కాలంలో విగ్రహ ప్రతిష్ఠ జరిపిన సందర్భంలో ప్రతిదినం నాలుగు 'నాళి'ల విరువాముదు (వండిన అన్నం) ను స్వామికి నివేదనకు ఏర్పాటుచేసినది. ఒక నిత్యదీపానికి, రెండు సంక్రాంతి పుణ్యదినాలలో తిరుమంజనానికి, ప్రధాన ఉత్సవం ప్రారంభించడానికి ముందు రెండు రోజులు ముందు పురట్టాసి (బాధ్రపద) మాసంలో ఉత్సవాన్ని తొమ్మిది రోజులు జరిపేందుకు ఏర్పాటు గావించింది. తరువాత ఈ నూతన విగ్రహాన్ని తిరువిళన్ కోయిల్ (గర్భగుడి) లో ప్రతిష్ఠించింది. 47 కళంజుల బంగారు ఆభరణాలను స్వామివారికి బహూకరించింది. ఈ కొత్త కౌతుక బేరానికి 'మనవాళప్పెరుమాళ్' అని నామకరణం గావించింది. ఈ కౌతుక బేరానికి భూములను దానం చేసింది.మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.
*కొలువు శ్రీనివాసుడు:*
ప్రతిరోజు ప్రాతఃకాలంలో తోమాల సేవ తరువాత తిరుమామణి మండపంలో కొలువు లేదా ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారిని బంగారు ఛత్రం క్రింద రజత సింహాసనంపై ఆసీనుని గావిస్తారు. ప్రధాన మూర్తికి బదులుగా కొలువు శ్రీనివాసుడు విగ్రహం అధ్యక్షతన ఇక్కడి కార్యక్రమం జరుగుతుంది. ఈయన అన్నివిధాల మూలదైవాన్ని పోలివుంటాడు. దేవాలయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు, ఆదాయ వివరాలను పర్యవేక్షిస్తుంటాడు. ప్రతిరోజు ఆనాటి తిథి వార నక్షత్రాది వివరాలతో కూడిన పంచాంగ శ్రవణం ఈ మూర్తికి వినిపిస్తారు. అర్చకులకు మాత్రదానంగా ఇచ్చే బియ్యం, వారివంతునకు వచ్చే భాగం ఇక్కడ ఇవ్వబడుతుంది.
ఉగ్ర శ్రీనివాసుడు
ఉగ్ర శ్రీనివాసుడు స్వామి వారి ఆగ్రహదశను సూచిస్తుంది. మూలబేరం తరువాత ప్రాచీనకాలానికి చెందిన తొలి విగ్రహం ఇదియే అయి ఉంటుంది. ఈ విగ్రహాన్నే స్నపన బేరం అని కూడా అంటారు. ఈ విగ్రహం దాదాపు 18 అంగుళాల ఎత్తు కలిగి రమారమి 7 అంగుళాల ఎత్తు పీఠం మీద నిలువబడి ఉంటుంది. ధృవబేర, కౌతుకబేర, బలిబేరాలకు భిన్నంగా ఈ విగ్రహం నిలుచుని ఉన్న భంగిమలో శ్రీదేవి, భూదేవుల ప్రతిమలతో కలసి ఉంటుంది.
తమిళ పర్యాయపదమైన 'వెంకట తురైవార్' అన్న పేరును బట్టి భోగ శ్రీనివాసుడు ప్రతిష్ఠ జరగడానికి పూర్వం ఉత్సవ విగ్రహంగా ఉండేదని తెలుస్తుంది. 14వ శతాబ్దానికి ముందు ఉత్సవ విగ్రహంగా ఉపయోగించేవారు. ఒకసారి ఈ విగ్రహం ఊరేగింపుగా వెళ్ళినప్పుడు అగ్నిప్రమాదం జరగడం వల్ల అప్పట్నుంచీ ఈ విగ్రహంపై సూర్యకిరణాలు పడనివ్వరు. ఏడాదికి ఒక్కసారి సూర్యోదయానికి ముందే ఉగ్ర శ్రీనివాసుని అన్ని అలంకారాలతో ఊరేగింపుగా తీసుకువెళ్ళి, గర్భగుడిలోకి తీసుకెళ్ళిపోతారుఉత్థాన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ద్వాదశి ఆరాధనలలో ఈ ఉగ్రశ్రీనివాసుని ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఈయనపై సూర్యకిరణాలు పడరాదని, అలా ప్రసరించినట్లయితే ప్రపంచానికి హాని సంభవిస్తుందని పురాణేతిహాసం తెలుపుతోంది
*తిరుమల శ్రీ మలయప్ప స్వామి:*
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ మూర్తిని మలయప్ప స్వామి అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భార్యలైన శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ఉభయ నాంచారులు అంటారు.
966A.D, కన్య మాసం లో బ్రహ్మోత్సవాలు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కి ఒక్కసరె జరిగేవి. అప్పుడు పల్లవుల రాణి "సామవై" శ్రీవేంకటేశ్వర స్వామికి వెండి విగ్రహం ప్రతిష్టించింది దీనిని "భోగ శ్రీనివాసా" అని పిలుచుకునేవారు. ఈ భోగశ్రీనివాసునినే ఉత్సవ మూర్తిగ బ్రహ్మోత్సవాలు సమయం తిరు వేధుల్లో 9 రోజులు తిప్పేవారు. కాని ఇప్పుడు వుండే మలయప్ప స్వామి ఉత్సవ మూర్తి మాత్రం 1339A.D నించి వెలుగులోకి వచ్చింది.
*తిరుమల ఉభయ నాంచారులు:*
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భార్యలైన శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ఉభయ నాంచారులు అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ మూర్తిని మలయప్ప స్వామి అంటారు.
ఉభయ నాంచారులలోని శ్రీదేవి విగ్రహం ఎల్లప్పుడు మలయప్ప స్వామికి కుడి వైపున ఉంటుంది. 26 అంగుళాల ఎత్తు గల శ్రీదేవి విగ్రహం 4 అంగుళాల పీఠముపై నిలబడి ఉంటుంది.
అలాగే భూదేవి విగ్రహం ఎల్లప్పుడు మలయప్ప స్వామికి ఎడమవైపున ఉంటుంది.
*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి