రామాయణమ్ .330
...
హనుమా !
తపస్సు చేతగానీ
సేతువు నిర్మించిగానీ
సమస్త సంద్రాన్నీ ఎండగట్డించి గానీ
మనము సముద్రము దాటగలము !!
.
నీవు లంకనంతా చూచినావు కదా అసలు అచట ఎన్ని దుర్గములు ఉన్నవో నేను తెలుసుకొనదలుచుకున్నాను ..అని రాముడు ప్రశ్నించెను..
.
సైన్య పరిమాణమెంత ?
ఎన్ని ద్వారములున్నవి
దుర్గనిర్మాణ శైలి ఎలా ఉన్నది ?
లంక యొక్క భద్రతా ఏర్పాట్లు ,రక్షణపటిష్టత ,
యుద్ధసన్నద్ధత ...నీవు పరిశీలించినావు కదా అన్నీవివరముగా చెప్పుము.
.
.( ఈ ప్రశ్న ఊహించి అశోకవన విధ్వంసము ,లంకా దహనము చేసినాడు హనుమంతుడు ! ఆయనను చేయమన్న పని సీతమ్మను వెదకమని మాత్రమే ! అదీ హనుమ స్వామి గొప్పదనం).
.
ఆ నగరమునకు విశాలమైన పెద్దవైన నాలుగు ద్వారములున్నవి
వాటి తలుపులు చాలాదృఢమైనవి అవి పెద్దపెద్ద గడియలతో బంధింపబడియున్నవి
.
అచట బాణములను మరియు పెద్దపెద్ద బండరాళ్ళను అతివేగముగా విసర గల పెద్దపెద్ద యంత్రములున్నవి .
.
ఇనుముతో తయారుచేయబడిన శతఘ్నులు వందలకొలదీ సదా సిద్ధముగా యున్నవి వాటిని ఉపయోగించగల సుశిక్షితులైన రాక్షసులు వాటి వద్ద సదా సిద్ధముగా యున్నారు.
.
లంకా నగర స్వర్ణప్రాకారము ఎవరూ ఆక్రమించలేనటువంటిది .వాటిచుట్టూ భయంకరమైన పరిఖలలో మొసళ్ళు మీనములు నివసిస్తూ ఉంటాయి.
.
ఆ కందకముల పైన నాలుగు వంతెనలు వాటిపై అనేక యంత్రములు అమర్చబడియున్నవి. ఆ నాలుగు వంతెనలు అతిదృఢమైనవి.
.
ఇక రావణుడికి ఎప్పుడూ యుద్ధసన్నద్ధతే ! ఆతని మనస్సులో భయము ,జంకు లేనే లేవు
.
ఇంత రక్షణ వ్యవస్థతోపాటు అసలు లంకానగరమంతా ఒక ఎత్తైన పర్వత శిఖరము మీద కలదు...
.
ఆ నగరములోనాలుగు దుర్గములు
చుట్టూ లోతైన నది ప్రవహిస్తున్నది కావున నదీ దుర్గము
పర్వతములు ఆవరించియుండుట చేత పర్వత దుర్గము
దట్టమైన అరణ్యము ఆనగరము చుట్టూ యుండుట వలన అరణ్య దుర్గము
కట్టబడ్డ ఎత్తైన ప్రాకారములుండుట చేత కృత్రిమదుర్గము ...ఈ విధముగా నాలుగు దుర్గములు ఆ లంక చుట్టూ యున్నవి .
.
ఇదియూ కాక లంకకు నౌకా మార్గము కూడా లేదు .ఏ వైపునుండీ వార్తలు పంపు అవకాశమే లేదు.
.
అంటూ హనుమంతుడు లంకానగర రక్షణ వ్యవస్థ గురించి ఇంకా చెపుతూనే ఉన్నాడు.
.
వూటుకూరు జానకిరామారావు
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి