*బ్రహ్మలోక ప్రాప్తి ఎలా వస్తుంది...?*
కర్మ మూడు విధాలుగా ఉంటుంది. సంచితకర్మ, ఆగామికర్మ, ప్రారబ్దకర్మ అని మూడురకాలు. ఆధికారిక పురుషులకు సంచిత, ఆగామికర్మలు లేవు. ప్రారబ్ధకర్మ మాత్రం ఉంటుంది. అదే బాధ్యతగా ఇవ్వబడిన కర్మ, బాధ్యత పూర్తికాగానే దేహంనుండి విముక్తి కలగటమే ఆలస్యం, మోక్షం లభిస్తుంది - బ్రహ్మత్వాన్ని పొందుతారు అని చెప్పబడింది.
ఉత్తరరామాయణంలో ఒక ఉదాహరణ కలదు - మరణించిన ఉపాసకునికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. వారు తిరిగి జన్మను పొందరు. దక్షిణాయంలో మరణించిన వారు పునర్జన్మను పొందుతారు అని చెప్పుకోవటం వున్నది. ఇది ఎంత వరకు సమంజసం? అంటే ఇది సామాన్య కర్మిష్ఠికే. జ్ఞానికి అట్లా కాదు. జ్ఞానికి మోక్షం కలుగుతుంది. అటువంటి సందర్భంలో భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎందుకు ప్రతీక్షించాడు? అంటే భీష్మునికి తండ్రియైన శంతనుడు - భీష్ముని త్యాగ
నిరతికి, నిష్టకు మెచ్చి ఒక వరమును ప్రసాదించాడు. ఆ వర ప్రభావం వలన స్వేచ్ఛా మరణమును పొందవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహత్యాగం చేసి ముక్తిని పొందవచ్చు. అందుచేత భీష్మునకు తన తండ్రి ఇచ్చిన వరం యొక్క శక్తిని లోకానికి వెల్లడించటానికి కొంత కాలం అంపశయ్యపై వుండి తాను చేయవలసిన బాధ్యత పూర్తియైనదని తలచిన తరువాత ఉత్తరాయణంలో దేహత్యాగం చేశాడు.
జ్ఞానులైన వారు ఉత్తరాయణంలో పోయినా దక్షిణాయణంలో పోయినా వారికి ముక్తి వుంది. ఉత్తరాయణ, దక్షిణాయన శబ్దాలను ఆధారంగా చేసుకొని ఉత్తరాయణంలో మరణించిన వారికి మోక్షమని దక్షిణాయణంలో మరణించిన వారికి లేదని భావించటం భ్రమ మాత్రమే. కాబట్టి జ్ఞానం అనేది మాత్రమే మోక్షమును నిశ్చయంగా పాంద కలిగేటట్లు చేస్తుంది. అలా భావన చేస్తూ సిద్ధాంతాన్ని పూర్తిగా విశ్వసించి భగవత్పాదులు రచించిన భాష్యగ్రంధాలను శ్రవణమననాదులు చేసి జ్ఞాన సముపార్జన చేయవలెను.
--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి