*దైవ ఆన్వేషణ*
ఒక భక్తుడు దైవం కోసం అన్వేషణ చేస్తూ ప్రపంచం అంతా తిరిగాడు,
అలా తిరుగుతూ తిరుగుతూ ఎందరినో ఎన్నో సందేహాలు అడిగాడు...
కానీ మనస్సుకి వారి సమాధానాలు రుచించలేదు, ఇలా ఉండగా ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడ్డాడు...
*అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది...*
*స్వామి పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉంటాడు? అని అడిగాడు...*
అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వుతూ..నీ సందేహం త్వరలోనే తీరుతుంది నాయన... అంటూ ఒక మహా వృక్షం చూపించి అది ఏమిటి నాయన అన్నాడు...
అది వృక్షం...
ఓహో వృక్షమా! ఎలా వచ్చింది?
విత్తనం ద్వార వచ్చింది స్వామి
సరే అక్కడ పలుగు ఉంది.
తీసుకొని ఆ చెట్టు పునాది త్రవ్వు అన్నాడు.
ఎందుకు స్వామి? మహావృక్షం కదా! త్రవ్వితే చచ్చిపోతుంది,
చచ్చిపోతుంది కాని ఆ విత్తనం ఎలా ఉందొ చూడాలని ఉంది...
అయ్యో స్వామి! అదెలా సాధ్యం అవుతుంది?
విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు విత్తనం చూడలేమా?
విత్తనమే చెట్టు...
చెట్టుకి విత్తనానికి తేడా లేదు, విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా!!!
ఇదే నాయన నీ సందేహానికి సమాధానం...
అదెలా స్వామి?
విత్తనం అనేది పరమాత్మ
ఆ పరమాత్మే వృక్షం.
అనగా సృష్టి , సృష్టి వేరు పరమాత్మ వేరు కాదు, ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు...
సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము...
*మరి విగ్రహారాధన ఎందుకు స్వామి?*
పరమాత్మని తెలుసుకోవాలి అంటే సాధకుడికి ఒక ఆకారం కావాలి... సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కనుక ధ్యానం చేయమంటే ఎలా చేస్తాడు? ఏమి అర్థం కాదు.ఆదిత్యయోగీ..
అదే ఆ పరమాత్ముడికి ఒక రూపం, ఒక వర్ణన కల్పితే సాధకుడు ఆ ఆకారాన్ని, ఆ వర్ణనని తన ధ్యానంలో చూస్తాడు.
ధ్యానం నిలబడుతుంది, అంతేతప్ప శూన్యం లోకి చూస్తూ ధ్యానం చేస్తే సాధకుడికి చీకటి తప్ప ఏమి అర్థం కాదు.
అందుకే పూర్వం మహర్షులు వేదాన్ని ఆధారంగా చేసుకొని వేదం వర్ణించిన విధంగా పరమాత్మకి ఒక రూపం కల్పించి సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు.
కొన్ని చోట్ల ఆయనే స్వయంభువై వెలిసి భక్తులను అనిగ్రహించాడు, అంతేతప్ప ప్రత్యేకంగా అంటూ పరమాత్ముడు ఎక్కడా లేడు, సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నాడు.
సాధకులను ఉద్దరించే నిమిత్తం విగ్రహారాధన ఏర్పాటు చేయబడింది.
భగవంతుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు.
ప్రకృతిలో ఉన్నాడు అంటే సామాన్య భక్తుడు భగవంతుడిని దర్శించలేడు, సాధ్యం కాదు, అందుకే రూపం, దానికి దీపం ధూపం, నైవేద్యం, నివేదన, పుష్పాలంకరణ ఇలా అనేక సేవలు ఏర్పాటు చేసి భగవంతుడి దగ్గరికి భక్తుడిని, సామాన్య సాధకులని తీసుకెళ్ళే మార్గం చూపారు తప్ప విగ్రహమే దైవం కాదు.
అది ఒక మార్గం, దాని నుండి ముందుకి వెళ్ళాలి అంతేతప్ప విగ్రహారాధన దగ్గరే ఆగితే భగవంతుడిని ఎన్నటికి తెలుసుకోవడం సాధ్యం కాదు...
*స్వామి! భగవంతుడి ఆస్తులు భగవంతుడే రక్షించుకోలేకపోతే భక్తులని ఏమి రక్షిస్తాడు?*
భగవంతుడు నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు...
ఒకడు విగ్రహం పెట్టుకున్నాడు, మరొకడు గుడి కట్టాడు.
మరొకడు తన దగ్గర ఉన్న డబ్బుతో వజ్రాలు కూర్చిన నగలు చేయించి దర్జాగా వచ్చి అలంకరించాడు, మరొకడు దొడ్డిదారిలో వచ్చి తీసుకెళ్ళాడు.
భగవంతుడిని ప్రతిష్టించడం దగ్గర నుండి అలంకరిచడం వరకు అన్ని చేసిన మనమే వాటిని కాపాడు కోవాలి కాని భగవంతుడి మీద నిందలు వేస్తె మనకే అపచారం...
పరమాత్ముడికి మట్టిగడ్డ అయినా వజ్రమైన తేడా లేదు, ఎందుకంటే రెండిటిలో ఉంది తనే కనుక.. నగలు పెట్టినవాడిలో ఉన్నాడు.
దోచుకెళ్ళినవాడిలోనూ ఉన్నాడు, తన భక్తులని ఎవరైనా బాధలకు గురి చేస్తే తప్ప మిగిలినవి ఏమి పరమాత్మ పట్టించుకోడు….
.
పుట్టిన ప్రతిజీవి యొక్క శరీరము మార్పుచెందుతూ తుదకు నశిస్తుంది. మార్పుచెందనిది, శాశ్వతమైనది, ఆత్మ మాత్రమే. ఈ నిత్యసత్యమైన ఆత్మ ప్రతిజీవిలో నెలకొనివుంది. ప్రతిజీవి పరమాత్మ స్వరూపమే.
అన్ని జీవరాసులలో కెల్లా మనిషి సహజంగా అత్యంత జ్ఞానసంపన్నుడు. ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని సమన్వయ పరుచుకొని ఆత్మజ్ఞానంతో ఎంతో ఆనందంగా జీవించే తెలివికలవాడు. అలాగే అంతర్గత శత్రువులను రూపుమాపలేకా, వాటిని నేర్పుతో సమన్వయ పరుచుకోలేక తన నిజస్వరూపాన్ని విస్మరించి జీవితాన్ని కష్టాలపాలు చేసుకునే తెలివితక్కువ వాడు కూడా మనిషే.
పరమాత్మ ప్రసాదంగా తనకు లభించిన జ్ఞానాన్ని, తనలో నెలకొనివున్న ఆత్మను తెలుసుకొనే సాధన చెయ్యడమే ఆధ్యాత్మికము.ఆదిత్యయోగీ..
స్వయంభువుగా (తనంతట తానుగా) వ్యక్తమై, తననుండి పంచమహాభూతములను (ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి) సృష్టించి, వాటి సమ్మేళనంతో ప్రాణరూపమును దాల్చి, మొదటిగా పరమేష్ఠిని జనింపజేసి, తద్వారా సకల జీవకోటిని ఉద్భవింపజేసి, విశ్వమును విస్తరించి, అవసరమగు స్థితిని కల్పించి, మరలా సమస్తమును తనలో లయం చేసుకుంటూ, అన్నింటికీ ఆధ్యునిగా, ఎల్లప్పుడూ సచ్చిదానందస్వరూపంతో వెలుగొందే సర్వశ్రేష్ఠుడు ఆ పరమాత్మ...
ఉపనిషత్తులు “సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ!” అని పరమాత్మను వర్ణించేయి. అంటే అంతటా, అన్నింటా వ్యాపించియున్న ఆత్మస్వరూపము “నిజమైనది, జ్ఞానవంతమైనది, అనంతమైనది” అన్నమాట! అంటే దానిని గ్రహిస్తే, ఇక గ్రహించవలసినది ఏమీ వుండడని భావము! ఆదిత్యయోగీ..
ఏ భావంతో సాధన చేస్తామో అదే సిద్ధిస్తుందని, అటువంటి శక్తిని జీవునికి ఆ పరమాత్మ ప్రసాదించేడని, కాబట్టి తత్వసాధనకు మనోభావన స్వచ్ఛమైనదిగా వుండాలని, ఈ భావమే బాహ్యకర్మలుగా వ్యక్తమౌతుందని, అందుకే జీవుడు ముందుగా మనస్సును తన ఆధీనంలోకి తెచ్చుకునే సాధన చెయ్యాలని భగవద్గీత బోధించింది.
ఎచ్చటనుండి జీవుడు వచ్చేడో, అక్కడికి చేరుకోవలసిందే! కారణం పరమాత్మే జీవాత్మగా ఒక ఉపాధిని కల్పించుకొని వ్యక్తమయ్యేడు! అదే జీవాత్మ అసలు స్వరూపము!
ఈ ధరణిలో జీవమునకు సరివాడే వాతావరణాన్ని ఋతువులతో కల్పించి, జీవులన్నింటినీ తన అంశగా సృష్టించి, వాటిలో నివాసముంటూ, వాటికి జ్ఞానాన్ని ప్రసాదించి, మనుగడకోసం వాటితో కర్మలు చేయిస్తూ, మృత్యురూపమున వాటికి విశ్రాంతిని కలుగజేస్తూ, మరల వాటి కర్మానుసారం పునర్జన్మను ప్రసాదిస్తూ, ఈ సత్యమును గ్రహించినవారికి మనోహరమైన ఆత్మదర్శనాన్ని కలుగజేస్తూ, ధర్మపరిరక్షణకై అప్పుడప్పుడు ఉగ్రరూపం దాలుస్తూ ఎంతో దక్షతతో విశ్వాన్ని నడిపించే జగన్నాధుడతడు!..
సత్యమైన బ్రహ్మమే అన్ని జడ-జీవ పదార్ధాలలో వ్యాపించివుంది. వీటి పరస్పర సంబంధమే ఈ సృష్టి. దీని వెనుకనున్న పరతత్వాన్ని శోధించి ఉపనిషత్తుల ద్వారా మనకు అందించారు ఎందరో తపఃసంపన్నులు. అన్ని ఉపనిషత్తుల సారమే భగవద్గీత. భవ్య భగవద్గీతలో పేర్కొన్న పరమాత్మ విభూతిని విష్ణు సహస్రనామ స్తోత్రంగా మనకు అందించేడు భీష్ముడు.ఆదిత్యయోగీ..
సత్యమైనది, జ్ఞానవంతమైనది, అనంతమైనది ఏదైతేవుందో దానికే భగవంతుడని, పరమాత్మయని పేరుపెట్టారు. ప్రతీ జడజీవ పదార్ధము పరమాత్ముని స్వరూపంగా వర్ణించేరు. పరమాత్మనుండి బయటపడి మళ్ళీ పరమాత్మలోనే ఐక్యమయ్యేదే సృష్టి అని పేర్కొనటం జరిగింది.
స్థాణువుగా ఒకేచోటయుంటూ, సచ్చిదానందస్వరూపునిగా, అన్ని ప్రమాణములతో విశ్వమంతటా వ్యాపించి, క్షయములేని బీజరూపంలో జీవులుగా వ్యక్తమై, అన్నమయాది పంచకోశములుగా వాటి దేహములను ఆవరించి, కర్మ-జ్ఞానాలుగా అష్టైశ్వర్యరూపేణ వాటి మనుగడకు దోహదపడుతూ, అందరిచే ఆశింపబడుతూ, తానుమాత్రం వైరాగ్యంతో దేనిని ఆశింపకా, సాక్షీభూతంగా అన్నింటినీ గమనించే విశ్వాత్ముడే ఆ పరమాత్మ!..
.
*'జ్ఞానము'* అంటే మననము, చింతన, నిర్మలమైన విచక్షణ తప్ప ఇంకేమీ కాదు. వివిధ వస్తువుల, విషయాల మధ్య గల తారతమ్యాన్ని చూపించుట. అభిప్రాయ బేదములకు హద్దులు గీయుట. వివాదంశములనూ, లేదా విశేషాంశములను నిర్ధారించుట - ఈ *జ్ఞానమే కేవలం మనసు యొక్క సహజ తత్వము. *'వివేకము'* అంటే విచక్షణ, *అంటే మంచి చెడ్డలను నిర్దించుకునే శక్తి. రెండు వేరువేరు స్థితుల మధ్య మనస్సు నిలిచినప్పుడు, దానిలో ఆలోచనలు స్పందిస్తాయి. ఈ రెండు విభిన్న స్థితుల కలయిక (*నచ్చిన భావాలను కలుపుట*), వ్యత్యాసాల (*నచ్చని భావాలను వేరుపరచుట*), *నడుమనున్న పరిధిలోనే ఆలోచన స్థానం ఉంటుంది.*
*ఆ పరిధి పైననే, అందులోనే నిలచి, మనస్సు *'జ్ఞాని'* *యొక్క లక్షణము ఆలోచించడము.....*
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి