4, ఆగస్టు 2024, ఆదివారం

ధర్మాచరణ

 ✳️*ధర్మాచరణ:*✳️

                   ➖➖➖



*సృష్టిలో కనిపించే లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అత్యంత శ్రేష్టమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆకలి, నిద్ర, సంతానోత్పత్తి ఇతర ప్రాణుల్లోనూ ఉన్నాయి. మరి మనిషి ప్రత్యేకత ఏమిటి?*


*ధర్మాన్ని ఆచరించే యోగ్యత మనిషికే ఉంది. ఏ ఇతర ప్రాణుల్లో ధర్మాన్ని ఆచ రించే అవకాశం లేనందువల్ల, అది మనిషికి దక్కిందని జ్ఞానులు చెబుతారు. ఆ స్థానాన్ని పొందిన మనిషి సరైన మార్గంలో ధర్మాన్ని ఆచరించకపోతే, మిగిలిన ప్రాణులకూ మనిషికి తేడా ఉండదు.* 


*మనిషికి మాట్లాడేందుకు నోరు, పూజించడానికి చేతులు, ఆలకించేందుకు చెవులు, ఆలయానికి వెళ్ళడానికి కాళ్లు భగవద్వాసనలు ఆఘ్రాణించే నాసిక, దైవ తీర్ధం-సేవించే జిహ్వ ఉన్నాయి.* 


*మిగిలిన ప్రాణులకు చెవులు ఉన్నాయి. కానీ... భగవంతుడి స్తుతులను ఆలకించాలని తెలియదు. కాళ్లు ఉన్నాయి కానీ గుడికి వెళ్ళాలని తెలియదు. పూజ చేసే చేతులు లేవు. నోరు ఉంది. కానీ భగవన్నామం చెయ్యా లని తెలియదు. అందుకే వాటిలో లేని ఆ  యోగ్యత మనిషిలో ఉంది. కాబట్టే-మానవ జన్మ అత్యున్నతమైనది.* 


*శాస్త్రోకమైన ధర్మాచరణ చేసేవారిని మహాత్ములు అంటారని శంకరులు తమ భాష్యంలో తెలిపారు.* 


*ధర్మం ఈ చరాచర జగత్తును అంతటినీ నడిపిస్తున్న దివ్యశక్తి, దానివల్లనే ఈ బ్రహ్మాండమంతా నిలబడుతోంది. ప్రకృతి ఎలా ప్రవర్తించాలి. ప్రాణికోటి ఎలా ప్రవర్తించాలో తెలియజేసేదే  ధర్మం.* 


*అది కాలానుగుణమైన మార్పులకు మారేది కాదు. దానికి కాల దోషం లేదు. దేని కారణంగా మనిషికి ఆధ్యాతికోన్నతి లభిస్తుందో అదే ధర్మం.* 


*"మనిషి కచ్చితంగా దాటాల్సిన భౌతిక దశలన్నీ క్షణభంగురాలే. ఈ లోకంలో అచంచలమైనది, స్థిరమైనది ధర్మం ఒక్కటే అన్నారు వివేకానంద.* 


*సత్కర్మల్లో ముఖ్యంగా దానం, ధ్యానం ప్రతినిత్యం శ్రద్ధగా చేసేవారికి మనో చైతన్యం కలిగించేది ధర్మం మాత్రమే. ప్రతివారూ తమ పనులు ధర్మబద్ధంగా ఉన్నాయా లేవా అని తరచి చూసుకోవాలి.*


*’ధర్మం సారమే ఈ జగత్తు!’ అన్నాడు గౌతను బుద్ధుడు. మనిషిని జీవింపజేసే..ధర్మాల్లో ముఖ్యమైనవి- నిగ్రహం, ప్రేమ, సంతృప్తి, త్యాగం, దహింపచేసేవి- అత్యాశ, ద్వేషం, పరదూషణ, పగ.*


*వ్యక్తిగత ధర్మాలు సమష్టి ధర్మాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు అలాంటివాటిని త్యజించడమే అసలైన ధర్మం.*


*రామాయణంలో ధర్మం మూర్తీభవించిన శ్రీరాముడు, మహాభారతంలో ధర్మానికి ప్రతినిధి అయిన ధర్మరాజు, లోక ధర్మానికి కట్టుబడి భార్యను, కుమారుణ్ని, రాజ్యాన్ని వదిలి వెళ్ళిన గౌతమ బుద్ధుడు ధర్మ స్వరూపుల య్యారు. అనంతర కాలంలో రామకృష్ణ పరమహంస, వివేకానందుడు. అరవిందులు... ధర్మాచరణలో సఫలీకృతులైన సత్పురుషులు.*


*ధర్మరాజు యుద్ధంలో ‘అశ్వత్థామ హతః' అని చెప్పడం, యుద్ధంలో నియమ విరుద్ధంగా దుర్యోధనుని గదతో తొడలపై మోదడం, కర్ణుడు నేలపై ఉండగా సంహరించడం.. ధర్మ విరుద్ధాలు కావా అనే సందేహం కలుగుతుంది. ధర్మాన్ని ధర్మంతో, అధర్మాన్ని అధర్మంతో ఎదుర్కోవాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలియజెప్పాడు.*


*మనిషి ఆధ్యాత్మిక కర్మలను ధర్మబద్ధంగా ఆచరించినప్పుడే తనను, సమాజాన్ని, ఇతర ప్రాణుల్ని, ప్రకృతిని, ప్రపంచాన్ని రక్షించగలుగుతాడు. ధర్మం అనేది లేకపోతే పై వాటికి రక్షణ లేదు.*


*ధర్మం అంటే పరస్పర రక్షణ. దాన్ని ఆచరించి, రక్షించే ఉత్తమ యోగ్యతను మనిషికి ప్రసాదించాడు భగవంతుడు, ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః

                  - 

.          *✳️సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*🙏

కామెంట్‌లు లేవు: