9, ఆగస్టు 2020, ఆదివారం

ఈరోజు (8-8-2020) *ఆంధ్రపత్రిక* సంపాదకీయం🌹
 *సత్కవి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి* //
"సత్కవి చెళ్ళపిళ్ళ వేంకన గురువంచు చెప్పుకొనగా-అది గొప్ప తెలుంగునాడునన్" అన్నాడు ఒక కవి. అన్నవాడు సామాన్యుడు కాడు. సాక్షాత్తు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఇంతటి విశ్వనాథ కూడా  చెళ్లపిళ్లకు శిష్యుడే.వేటూరి ప్రభాకరశాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, పింగళి, కాటూరి వంటి ఎందరో ఉద్దండులు చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి శిష్యులు. తిరుపతి వెంకటకవులుగా లబ్ధప్రతిష్ఠులైన జంటకవులలో వయస్సులో పెద్దవాడు చెళ్ళపిళ్ళ.1870, ఆగష్టు 8వ తేదీ నాడు, తూర్పు గోదావరి జిల్లా కడియంలో జన్మించాడు. నేటికి 150 ఏళ్ళు పూర్తయ్యాయి.1950 వరకూ 80 ఏళ్లపాటు జీవించారు. తుది శ్వాస వరకూ సరస్వతీ ఉపాసనలోనే గడిపారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థానకవిగా నియమించి గౌరవించింది. ఆంధ్ర ప్రభుత్వ తొలి ఆస్థానకవి వీరే.ఈ వేడుక కూడా అసాధారణ విధంగా జరిగింది. మద్రాస్ నుండి ప్రభుత్వగణమంతా విజయవాడ తరలి వచ్చింది. భక్తి ప్రపత్తులతో  చెళ్లపిళ్లకు నియామక పత్రం సమర్పించి, ఘనంగా సత్కరించారు. ఈ సంఘటన 1949 లో జరిగింది. ఇది జరిగిన కొన్నాళ్లకే చెళ్ళపిళ్ళ శివైక్యమయ్యారు. ఇలా జీవిత చరమాంకం వరకూ ఘన గౌరవాలు పొందిన భాగ్య జాతకుడు చెళ్ళపిళ్ళ. అతి సాధారణ కుటుంబంలో పుట్టి, ఆధునిక ఆంధ్ర సాహిత్య చరిత్రలో అగ్రస్థానం పొందిన ప్రతిభామూర్తి. అవధానం, జంటకవిత్వం, పద్యనాటకాలు అనగానే గుర్తుకు వచ్చేవారు తిరుపతి వెంకటకవులు. దివాకర్ల తిరుపతిశాస్త్రి-చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి కలిసి తిరుపతి వేంకటేశ్వర కవీశ్వరులుగా తెలుగుతల్లి కడుపు పండించారు. దివాకర్ల కంటే ముందుగానే చెళ్ళపిళ్ళ అవధాన ప్రస్థానానికి శ్రీకారం చుట్టాడు.తర్వాత జంటగా కవితా యాత్ర చేశారు.1920లోనే దివాకర్ల అస్తమించారు.తర్వాత 30ఏళ్ళ పాటు చెళ్ళపిళ్ళ ఒక్కరే కవితాయానం సాగించారు.గతంలోనూ 6ఏళ్లపాటు విడివిడిగానే కవితాపర్వం నడిపారు. 1903 నుండి 1916 వరకూ 13ఏళ్ళపాటు చెళ్ళపిళ్ళ బందరు హైస్కూల్ లో ఉపాధ్యాయుడుగా చేశారు. ఆ కాలంలోనే ఎందరో వీరికి విద్యార్ధులయ్యారు.విశ్వనాథ, వేటూరి, వేలూరి, పింగళి కాటూరి ఈ సమయంలోనే శిష్యులయ్యారు. స్కూల్ పాఠాలు అలా ఉంచగా, వీరందరిపై చెళ్ళపిళ్ళ కవితా ప్రభావం ఎక్కువగా పడింది. అప్పటికే ఆయన                 లబ్ధప్రతిష్ఠుడు కాబట్టి, ఆయన శిష్యులని అనిపించుకోడానికి అందరూ ముచ్చటపడేవారు.చెళ్ళపిళ్ళ అక్షర్షణ అటువంటిది.మృదు  భాషణం,రసరంజితమైన కవిత్వం,వినసొంపైన పద్య పఠనం, గంగా ప్రవాహ తుల్యంగా సాగే చమత్కార భరిత ప్రసంగం,ఎదుటివారిని ప్రోత్సహించే స్వభావం మొదలైన సులక్షణాలతో   ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునేవారు.వెంకటశాస్త్రి ఆకర్షణలో పడితే,బయటకు రావడం ఎవరికైనా  అసాధ్యం.అంతటి అసాధ్యుడు చెళ్ళపిళ్ళ.అవధానవిద్యను సర్వ కళామయంగా తీర్చిదిద్దినవాడు చెళ్ళపిళ్ళ.వీరి ప్రభావంతో ఎందరో అవధానులు తెలుగునేలపై పుట్టుకు వచ్చారు.ఈ రంగానికి అత్యంత ఆకర్షణ తెచ్చిపెట్టిన మహనీయుడు చెళ్ళపిళ్ళ.ప్రారంభంలో సంస్కృత కవిత్వం సృష్టించినా, తర్వాత తెలుగు కవిత్వం వైపే ఎక్కువగా దృష్టి  సారించారు. కావ్యాలు, శతకాలు, నాటకాలు, అనువాద రచనలు ఎన్నో చేశారు. నానారాజ సందర్శనం, దేవీ భాగవతం,బుద్ధ చరిత్ర, మృచ్ఛకటికం,పాణీగృహీత   మొదలైనవి ఎంతో ప్రసిద్ధం.శ్రవణానందం ఆ కాలంలో చాలా సంచలనం.ముద్రణపై ఆంక్షలు కూడా విధించారు.వీరి అనువాద రచన శ్రీనివాస విలాసం గొప్ప కావ్యంగా కొందరు పెద్దలు చెబుతారు.వీరు చేసిన అవధానాలలోని కొన్ని పద్యాలు తీసుకొని, మెరుగులు దిద్ది శతావధానసారంగా ప్రచురించారు.ఇక పాండవ ఉద్యోగాలు గురించి చెప్పక్కర్లేదు.ఈ పద్యనాటకాలు తెలుగునేలపై చేసిన సందడి అంతా ఇంతా కాదు.చెల్లియొ చెల్లకో, జండాపై కపిరాజు అంటూ... పల్లెల్లో గొడ్లకాపరి కూడా గొంతెత్తి పాడే పద్యాలు ఈ నాటకాల లోనివే. ఎందరో పద్యనటులను, పద్యప్రియులను తయారు చేసిన గొప్ప రచన ఇది. తిరుపతి వెంకటకవులను జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళిందివే. మిగిలిన సాహిత్యమంతా సాహిత్యవేత్తలకు మాత్రమే దగ్గరయింది.ఈ పద్యనాటకాలు తిరుపతి వెంకటకవులను అందరికీ దగ్గర చేశాయి.చెళ్ళపిళ్ళ వచన రచనలోనూ సిద్ధహస్తుడు.ఆ రచనా శిల్పం పరమ ఆకర్షణా స్వరూపం.చదవడం మొదలు పెడితే, చివరి వరకూ వెళ్లాల్సిందే.పాఠకులను అంతగా కట్టిపడవేసే వచన రచనా నిపుణత చెళ్ళపిళ్ళ సొత్తు.అటు గద్వాల్ ఇటు చెన్నపట్నం అన్నట్లుగా తెలుగువారు ఎక్కడుంటే అక్కడ వీరి సభలు జరిగాయి.కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు పల్లెలు, పట్టణాలు, రాజాస్థానాలు అన్ని దిక్కులా వీరి కవిత ప్రవహించింది.అవధానాలు, కురుక్షేత్ర పద్యనాటకాలు, శిష్యబృందం వల్ల వీరి చరిత్ర ఘనంగా సాహిత్య చరిత్రలో లిఖించబడింది.చెళ్లపిళ్లకు పట్టుదల జాస్తి.ఎందరితోనో వివాదాలు జరిగాయి.వివాద సాహిత్యం కూడా చాలా ప్రసిద్ధం.వివాద స్వభావంతో పాటు లౌక్యం కూడా చాలా ఎక్కువ.మెత్తని మాట,సుతిమెత్తని కవిత్వం చెళ్ళపిళ్ళ శైలి.రచించిన  ప్రతి పద్యం ఎంతో మెత్తన అంటూ శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ అభివర్ణించారు.శిష్యవాత్సల్యం కూడా చాలా ఎక్కువ.శిష్య వాత్సల్యంబు చెలువుతీరిన మూర్తి అంటారు పింగళి,  కాటూరి.ఆ కాలంలో ఎక్కడ చూసినా కవులు, శతావధానులు, ప్రబంధకర్తలు ఉండేవారు.ఈ వాతావరణం ఏర్పడడంలో ప్రభావం జూపించిన వారిలో చెళ్ళపిళ్ళ ప్రథమ శ్రేణీయులు.వెంకటశాస్త్రి కామేశ్వరీ ఉపాసకులు.ప్రజాసంబంధాలు ( పి-ఆర్ - పబ్లిక్ రిలేషన్స్ ) కూడా చాలా ఎక్కువ.పోలవరం జమిందార్ రాజా కొచ్చెర్లకోట వెంకటకృష్ణారావు ప్రోద్బలంతోనే పాండవ ఉద్యోగ విజయాలు రచించారు. విజయవాడ దుర్గాకళామందిరం పేరు చెళ్ళపిళ్ళ పెట్టారు. ఎన్నో బిరుదులు, సత్కారాలు, గౌరవాలు పొందారు. వారు జీవించిన కాలం తెలుగుభాషకు స్వర్ణయుగం. వీరి ప్రధాన గురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి. దివాకర్ల-చెళ్ళపిళ్ళను కలిపి తిరుపతి వేంకటేశ్వరకవులుగా బ్రహ్మముడి వేసింది వీరే.దివాకర్లలో పాండిత్యం మెండు. చెళ్లపిళ్లలో రంజకత్వం మెండు. వీరిద్దరి స్వభావాలు పూర్తిగా భిన్నం. చెళ్లపిళ్లకు దూకుడు,లౌక్యం రెండూ ఎక్కువే.పట్టుదలతో పాటు పట్టువిడుపులు కూడా ఎక్కువే.సారస్వత ప్రతిభా దీప్తి, సరస లౌక్య త్రిమూర్తి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి. స్వయంకృషి ద్వారానే ఎక్కువగా పాండిత్యం సంపాయించారు. చదరంగంలోనూ నిపుణుడు. అందుకే, జీవితంలోనూ ఎత్తుపైఎత్తులు తెలిసిన గడసరిగా పేరు తెచ్చుకున్నాడు. ఇటువంటి మహనీయులు ఎప్పుడో కానీ పుట్టరు. తెలుగు భాషాసాహిత్యాలకు వీరు చేసిన సేవ,చూపిన త్రోవ సామాన్యమైంది కాదు. వీరి ఋణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. కవనం  జీవనంగా సాగించిన  సత్కవి చెళ్ళపిళ్ళ. వీరిపై కొప్పరపు సోదరకవులు పరమాద్భుతమైన పద్యమాలిక చెప్పారు. అది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. చెళ్లపిళ్లలేని ఆధునిక సాహిత్య యుగం ఊహించలేం.తెలుగుభాష ఉన్నంతకాలం ఈ మహనీయుడు చిరంజీవిగా ఉంటారు. ఈ మహాకవితా స్వరూపానికి అక్షరాంజలులు సమర్పిద్దాం. - మాశర్మ🙏

కామెంట్‌లు లేవు: