9, ఆగస్టు 2020, ఆదివారం

*భగవంతుడు*


ఒక క్షణములో జరిగి మరో క్షణములో మరుగు పడే ఘటనలకు యధాతథంగా ఎటువంటి ఆధ్యాత్మిక మూలము ఉండదు.
*భగవంతుడనగా ఎవరు*
శ్రీ పరాశర మహర్షి నిర్వచనము ప్రకారము... *భగొస్యాస్తితి భగవానితి విష్ణుస్య మీర్యతే భగము*. ఆరు లక్షణముల సముదాయము కలది భగము.
ఆరు లక్షణములు.... *ఐశ్వరస్య సమగ్రస్య్య వీరస్య్య యశ సశ్రియః, జ్ఞాన వైరాగ్య యోశ్చివ షణాం భగ ఇతిరణా* అనగా సమగ్ర ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము మరియు వైరాగ్యము మొదలైన ఆరింటిని కలిపి భగమని వ్యవహారము..ఇట్టి భగము కలవాడు విష్ణువు...అనగా విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు.
మానవుడు భగవంతుని చేరుకునే కొద్ది, భగవంతుడు మానవుణ్ణి సమీపిస్తూ ఉంటాడు . మానవ మనస్సుకు ఏయే రూపము బోధగమ్యము కాగలదో, ఆయా రూపాలను ధరించి భగవంతుడు భక్తుని అభిష్టాను సారము మెలుగుతుంటాడు. అందులో మన ప్రమాణ నిరూపణల, తర్క వితర్కాలకు తావులేదు.
ఆయన (భగవంతుని) యందలి పూర్ణ విశ్వాసముతో స్వరూప నిష్ట కల్గిన మహాత్ములు తొలుత గావించిన వర్ణల ఆధారంగా ధ్యేయ కార్యాన్ని మల్చుకొని అనంతరీయ సాధకులు, అదే పరమానుభవాన్ని స్వాత్మ గోచరంగా చేసుకో గల్గుచున్నారు.
భగవంతుని యొక్క సగుణ రూపాలు, భగవద్ అవతారాల లీలా విలాసాలు హిందువుల మనో మందిరాలలో, పురాణాల వల్ల సుస్థిరంగా నిలిచి పోయాయి. *భగవాను డొక్క ప్రత్యేక వ్యక్తి కాదని పరమ పురుషుడని భావించాలి*.
ఆ పరమ పురుషునకు ఒక ఆద్య రూపం ఉన్నప్పటికీ, *పురుష శబ్దము* శరీర వాచకము కనుక సర్వాత్మకుడైన ఆయనకు, ఏ రూపములో ఆవాహన చేస్తే ఆ రూపములో సాక్షాత్కరింప గలడని చెప్పబడినది. ఆయనను మానవీకరించి, భగవద్ అవతారాలను మానావాకృతిమంతాలుగా భావిస్తున్నాము. భగవంతుని యొక్క ఆ ఆద్య రూపాన్ని భక్త జనుల కోసము, వాస్తవికత ఉట్టిపడే చిత్రీకరణ కౌశలంతో, ప్రతీకాత్మకంగా గోచరీభవింప జేస్తున్న పురాణాలలోని వర్ణనలు చదువు తుంటే, భగవంతుడు సాకారంగా గోచరిస్తున్నాడు.
భగవంతుని మానవ మనస్సుకు అంత సన్నిహితంగా తీసుకున్న వచ్చి, మానవుని లోని నిరుపమాన భక్తి సంపదను పెంపొందించి, మానవాళి అభ్యుదయానికి గ్రంధావళిగా, *ప్రపంచములోని ఏ సారస్వతము మన పురాణ వాంగ్మయానికి సాటిరాదు*.
ధర్మానికి భక్తి ఫలమవడం నిజము కనుక భక్తిని సాధింప గొరువారు, మొట్ట మొదటిగా వారి వారి వర్ణాశ్రమాల ప్రకారము స్వధర్మాన్ని పాటించాలి. *ధర్మానుష్టానములో ఒక రహస్యమున్నది, ఏది భగవంతునికి సంతోషమో అదే ధర్మము*.
భగవద్ సంతోషమే ధర్మ సిద్ది అని తెలుసుకోవాలి. *ఎటువంటి ధర్మ మైనా భక్తి హీనమవుతే నిరర్థక మవుతుంది*. అందువల్ల ధర్మాన్ని భక్తి పూర్వకంగా ఆచరించాలి.
లోకమంటే పరమేశ్వరుని వ్యక్త రూపమే తప్ప వేరేమీ కాదు. *లోకారాధనమే ఈశ్వరా ధానము కనుక మానవ సేవయే మాధవ సేవ*.
భగవంతుని పూజలు మరియు ధ్యానము మొక్కుబడిగానో, భయముతోనో, కోరికలతోనో, ప్రెరేపణలతో చేయకుండా ఇష్టముగా సంతోషములతో చేస్తే భగవంతుణ్ణి కరిగిస్తుంది *మనకు శుభాలను, ధర్మానికి బలాన్నిస్తుంది*.
*******************

కామెంట్‌లు లేవు: